మనకి మున్ముందు యుద్ధ కష్టాలు తప్పవా?
x
ఇరాన్-అమెరికా యుద్ధం 20వ రోజుకు చేరింది

మనకి మున్ముందు 'యుద్ధ కష్టాలు' తప్పవా?

యుద్ధం 20వ రోజుకు చేరింది. మనకు ఆయిల్ వచ్చే ఖతార్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే భారత్ లో గ్యాస్ కొరత తీవ్రమైంది..


ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 20వ రోజుకు చేరింది. రోజురోజుకూ ముదురుతోంది. ఇరాన్ మరో మంత్రిని కోల్పోయింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజ్తాబాను చంపేంత వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. దీనికి అమెరికా వంత పాడింది. వేలాదిగా యూఎస్‌ బలగాలను పశ్చిమాసియాకు తరలించాలని నిర్ణయించింది.

ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ప్రతిగా ఇరాన్ పెద్దఎత్తున ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇప్పుడిప్పుడే యుద్ధం చల్లారేలా లేదు. కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
మరోపక్క, యుద్ధ ప్రభావం భారత్ సహా ఆసియా దేశాలు నలిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇండియన్లకు మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఇంధన ధరలు పెరగవచ్చు. గ్యాస్ కొరత ఇప్పటికే వెంటాడుతోంది. ఆహార పదార్ధాల ధరల పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మరో మంత్రిని కోల్పోయిన ఇరాన్...

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇప్పటికే తన కీలక నేతలను కోల్పోయింది. ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించినట్లు సమాచారం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకునే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయెల్ భీష్మించింది. దీనికి మద్దతుగా అమెరికా వేలాది మంది అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది.
ఇంధన క్షేత్రాలే లక్ష్యం
తమ నేతల మరణానికి ప్రతీకారంగా ఇరాన్ బుధవారం అర్ధరాత్రి భీకర దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ క్షిపణులను కురిపించింది.
ఖతార్‌పై దాడి: ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన 'సౌత్ పార్స్'పై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఆరోపిస్తూ, ఇరాన్ ప్రతిగా ఖతార్‌లోని రస్ లాఫాన్ (Ras Laffan) ఇండస్ట్రియల్ సిటీపై దాడి చేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఈ కేంద్రం దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ట్రంప్ హెచ్చరిక: ఇరాన్ గనుక దాడులు ఆపకపోతే, ఆ దేశంలోని అతిపెద్ద గ్యాస్ నిల్వలను "పూర్తిగా పేల్చివేస్తాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

భారత్‌పై 'యుద్ధ' సెగ: సామాన్యుడికి కష్టాలు...

పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం భారతీయుల వంటింటిపై నేరుగా ప్రభావం చూపుతోంది. మన దేశ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే తీరుతాయి.
తాజా దాడుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 110 డాలర్లకు చేరుకుంది. ఇది ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
గ్యాస్ కొరత - భారత్ ఆందోళన
భారత్ తన గ్యాస్ అవసరాల కోసం (CNG, PNG, ఫర్టిలైజర్స్) ప్రధానంగా ఖతార్‌పైనే ఆధారపడుతుంది. భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)లో 47% ఖతార్ నుంచే వస్తుంది.
ఇరాన్ దాడులకు గురైన రస్ లాఫాన్ కేంద్రం దెబ్బతినడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఎల్పీజీ సరఫరాలో జాప్యం జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
స్టాక్ మార్కెట్ల పతనం
యుద్ధ భయంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. జపాన్ నిక్కీ 2.7%, దక్షిణ కొరియా కోస్పీ 2.6% నష్టపోగా, భారత మార్కెట్లు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
ఆహార సంక్షోభం
రవాణా ఖర్చులు పెరగడం, ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా తగ్గడం వల్ల రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు.

పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరీ ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం చల్లారకపోతే సామాన్యుడి బతుకు భారంగా మారక తప్పదు.
Read More
Next Story