
war 31st day
మా గురి అంతా ఇరాన్ ఆయిల్ పైన్నే..
మనసులో మాట చెప్పిన డోనాల్డ్ ట్రంప్, ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేటితో 31వ రోజుకు చేరుకుంది. అమెరికా అండతో ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నా, ఇరాన్ ఏమాత్రం బెదరడం లేదు. పైగా సరికొత్త హెచ్చరికలతో పశ్చిమ దేశాలను వణికిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ట్రంప్ వ్యాఖ్యల దుమారం: ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌లోని చమురు సంపదను స్వాధీనం చేసుకోవాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవైపు శాంతి చర్చలంటూనే, మరోవైపు అమెరికా భూతల దాడులకు కుట్ర పన్నుతోందని టెహ్రాన్ ఆరోపించింది.
భారతీయ కార్మికుడి మృతి: ఇరాన్‌లోని ఒక విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడిలో భారత్‌కు చెందిన ఒక కార్మికుడు మరణించినట్లు కువైట్ ప్రకటించింది. గల్ఫ్ దేశాలు తమ గగనతలంపైకి వస్తున్న డ్రోన్లను, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు తెలిపాయి.
ముమ్మర దాడులు: ఇజ్రాయెల్-అమెరికా దళాలు ఇరాన్‌లోని తబ్రిజ్ వద్ద ఉన్న పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడులు చేయడంతో టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రతిగా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని పారిశ్రామిక జోన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడ రసాయన లీకేజీ ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
యెమెన్, లెబనాన్లలో ఉద్రిక్తత: యెమెన్‌కు చెందిన హౌతీలు ప్రయోగించిన రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ అడ్డుకుంది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో జరిగిన దాడిలో ఒక ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు మరణించినట్లు సమాచారం.
ముస్లిం దేశాల చర్చలు: పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌లో భేటీ అయ్యారు. యుద్ధం మరింత ముదరకుండా శాంతి దిశగా అడుగులు వేయాలని వారు నిర్ణయించారు.
ఇరాన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు శాంతి గురించి మాట్లాడుతున్నారంటే, యుద్ధం మరింత తీవ్రం కాబోతోందని ఇరాన్ అధికారులు భావిస్తున్నారు. ట్రంప్ నైజం తెలిసిన ఇరాన్, చర్చల కన్నా భూతల దాడుల ఎదుర్కొనేందుకే సిద్ధమవుతోంది. ఒకవేళ అమెరికా దళాలు ఇరాన్ గడ్డపై అడుగుపెడితే, అది సుదీర్ఘ కాలం సాగే భీకర యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు.
చమురు సంక్షోభం...
యుద్ధం కారణంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన పెట్రాన్ కార్పొరేషన్ అత్యవసర పరిస్థితి దృష్ట్యా రష్యా నుండి 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి చివర నుండి ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయి, వచ్చే మంగళవారం ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది.
Next Story

