
అమెరికా యుద్ధం 17వ రోజుకు చేరింది
అయ్య బాబోయ్.. దుబాయ్: మంటల్లో విమానాశ్రయం!
దుబాయ్ విమానాశ్రయానికి సమీపంలో ఇరాన్ డ్రోన్ల దాడి
ప్రపంచ విలాసానికి మారుపేరైన దుబాయ్ ని ఇవాళ మరోసారి యుద్ధ మేఘాలు కమ్మాయి. దుబాయ్ విమానాశ్రయానికి దగ్గర్లో పేలుళ్లు సంభవించడంతో మూసివేశారు.
గల్ఫ్‌లోని పలు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఇరాన్ డ్రోన్‌లతో దాడులు చేసింది. ఇంధన ట్యాంకుకు మంటలు అంటుకుని భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూఏఈలోని పలు పోర్టుల నుంచి అమెరికా దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇటీవల ఖర్గ్ ద్వీపంపై దాడి కూడా యూఏఈ పోర్టులు, డాక్స్ నుంచే జరిగిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో యూఏఈ పోర్టుల్లోని సిబ్బంది, అధికారులను మొత్తం వెనక్కు పిలిపించుకోవాలని దుబాయ్‌ను కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్టుకు సమీపంలో డ్రోన్ దాడి జరగడం కలకలానికి దారి తీసింది.
యుద్ధం మొదలైన నాటి నుంచీ ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. ఫలితంగా గల్ఫ్ దేశాలు ఇప్పటివరకూ సుమారు 2 వేలకు పైగా ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడులను ఎదుర్కున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనం. ఇక దుబాయ్ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా ఇప్పటికే పలు డ్రోన్ దాడులు జరిగాయి.
ఇరాన్-అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు పశ్చిమ ఆసియా (Middle East) మొత్తాన్ని దహించివేస్తోంది. అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా గల్ఫ్ దేశాల మధ్య 'సమైక్యత' చిగురిస్తోంది.
గల్ఫ్ అంతటా దాడుల పరంపర
గడిచిన 24 గంటల్లో గల్ఫ్ రీజియన్ అస్థిరతకు లోనైంది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్లను అడ్డుకోవడంతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తూర్పు ప్రాంతంలో డజన్ల కొద్దీ డ్రోన్లను సౌదీ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగి రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఖతార్ కూడా తన గగనతలంలోకి వచ్చిన డ్రోన్లను అడ్డుకుంది.
విబేధాలు వీడి.. ఒక్కటైన 'బ్రదర్స్'
ఈ యుద్ధం గల్ఫ్ దేశాల మధ్య ఉన్న పాత పగలను తుడిచివేస్తోంది. గతంలో యమెన్ విషయంలో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. కానీ, ప్రస్తుత ముప్పును గమనించిన మహ్మద్ బిన్ సల్మాన్ (MBS), మహ్మద్ బిన్ జాయెద్ (MBZ) ఫోన్లో మాట్లాడుకుని, తమ భూభాగాలను రక్షించుకోవడానికి కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
GCC (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్), బ్రిటన్, జోర్డాన్‌తో కలిసి ఇరాన్ దురాక్రమణను ఖండిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. ఇది దౌత్యపరంగా ఇరాన్‌ను ఒంటరి చేసే వ్యూహం.
రంజాన్ మాసంలో 'ప్రార్థనల' ఐక్యం
ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది. యుద్ధం ఒకవైపు భయాన్ని కలిగిస్తుంటే, మరోవైపు ప్రజలను మానసికంగా దగ్గర చేస్తోంది. అరబ్ దేశాల ప్రజలు పాత విభేదాలను మరిచిపోయి, ఒకరి క్షేమం కోసం మరొకరు ప్రార్థిస్తున్నారు. "తమ దేశం, పక్క దేశం" అనే తేడా లేకుండా గల్ఫ్ ప్రజలందరూ #UnitedGulf వంటి ట్యాగ్‌లతో ఐక్యతను చాటుతున్నారు.
ఆపదలో అవకాశం...
"కష్ట కాలమే అవకాశాలను సృష్టిస్తుంది" అన్న నానుడి గల్ఫ్ విషయంలో నిజమవుతోంది. ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్న గల్ఫ్ రాజ్యాలు ఇప్పుడు ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
భవిష్యత్తులో గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఒకే విధమైన 'ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్'ను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఖతార్ ప్రధాని, సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు జరపడం, ప్రాంతీయ భద్రత కోసం చిన్న దేశాలు పెద్ద దేశాలతో చేతులు కలపడం ఒక శుభపరిణామం.
దుబాయ్ ఆకాశంలో కనిపిస్తున్నవి కేవలం క్షిపణులు మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల మధ్య గట్టిపడుతున్న బంధానికి సంకేతాలు కూడా. యుద్ధం ముగిసేసరికి, మధ్యప్రాచ్యంలో ఒక కొత్త , శక్తివంతమైన కూటమి ఆవిర్భవించే అవకాశం ఉంది.
Next Story

