శాంతి చర్చలకు ఇరాన్ మెలిక, ఇరకాటంలో అమెరికా!
x
యుద్ధం 43వ రోజుకు చేరింది. శాంతిచర్చలకు పాకిస్తాన్ సిద్ధమైంది..

శాంతి చర్చలకు ఇరాన్ మెలిక, ఇరకాటంలో అమెరికా!

అమెరికాను నమ్మలేమని స్పష్టం చేసింది. లెబనాన్ పై దాడులు ఆపకుండా చర్చలు ప్రారంభం కావని తేల్చిచెప్పింది.


శాంతి చర్చలకు ఓకే అంటూనే ఇరాన్ మెలిక పెట్టింది. అమెరికాను నమ్మలేమని స్పష్టం చేసింది. లెబనాన్ పై దాడులు ఆపకుండా చర్చలు ప్రారంభం కావని తేల్చిచెప్పింది. ఇది అమెరికాను ఇరకాటంలో పెట్టింది. లెబనాన్ పై దాడులు ఆపేలా ఇజ్రాయెల్ ను ఒప్పించే పరిస్థితిలో అమెరికా లేకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కాదనలేకనే శాంతి చర్చలకు వచ్చినట్టు చెబుతున్న ఇరాన్ మున్ముందు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

మరోపక్క, అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న చారిత్రక శాంతి చర్చల (USA-Iran Peace Talks) కోసం ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ఈ బృందానికి పాక్ అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ తన పట్టుదలను ప్రదర్శిస్తూ పలు కఠిన షరతులను అమెరికా ముందుంచింది.
లెబనాన్ మారణహోమం ఆగాల్సిందే!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఈ చర్చల్లో ప్రధానాంశంగా మారాయి. బుధవారం నాటి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 357కు చేరిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, "ఏదైనా కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే అది లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి" అని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్‌పై దాడులు ఆపడంతో పాటు, ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేస్తేనే చర్చలు అర్థవంతంగా సాగుతాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.
అమెరికాపై నమ్మకం లేదు..
ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ స్పీకర్ ఘాలిబఫ్ విలేకరులతో మాట్లాడుతూ అమెరికా వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. "అమెరికాపై మాకు నమ్మకం లేదు. గతంలో చర్చలు జరుగుతుండగానే మాపై దాడులకు పాల్పడిన చరిత్ర వారికి ఉంది. మా ప్రజల హక్కులను గుర్తిస్తేనే ఒప్పందానికి సిద్ధం. ఈ చర్చలను కేవలం ప్రచార ఆర్భాటంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ఆయన హెచ్చరించారు.
అమెరికా స్పందన: జేడీ వాన్స్ ఏమన్నారంటే.. మరోవైపు అమెరికా ప్రధాన మధ్యవర్తి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలపై సానుకూలంగా స్పందించారు.

ఇరాన్ తో చర్చలకు బయల్దేరబోయే ముందు ట్రంప్, జేడీ వాన్స్ సంభాషణ

"ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే, మేము కూడా స్నేహపూర్వకంగా చేయి అందించడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆయన ఇస్లామాబాద్ బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య నేరుగా సంభాషణ
పాక్‌లో చర్చలకు రంగం సిద్ధమవుతున్న వేళ, అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాల్పుల విరమణే లక్ష్యంగా జరిగిన ఈ సంభాషణ ద్వారా, ఈనెల 14న అధికారికంగా సమావేశం కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి ఇస్లామాబాద్‌పైనే ఉంది. అమెరికా ఇచ్చే హామీలు, ఇరాన్ విధించిన షరతుల మధ్య ఈ శాంతి చర్చలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
Read More
Next Story