
రష్యా చమురు వివాదం: ‘తొలుత బెదిరించారు.ఇప్పుడు బతిమలాడుతున్నారు’
అమెరికా వ్యవహారశైలిని తప్పబట్టిన ఇరాన్ విదేశాంగ మంత్రి..
రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. రష్యా నుంచి చమురు కొనొద్దని మొదట భారత్‌ను బెదిరించిన అమెరికా, ఇప్పుడు అదే దేశం నుంచి చమురు కొనాలని కోరడంపై సోషల్ మీడియా వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగచ్చి స్పందించారు. ‘‘రష్యా చమురు దిగుమతులు ఆపాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారడంతో అదే అమెరికా.. భారత్ సహా ఇతర దేశాల నుంచి రష్యా నుంచి చమురు కొనాలని కోరుతోంది’’ అని పేర్కొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా మద్దతు పొందాలనే ఆశతో ఇరాన్‌పై "చట్టవిరుద్ధ యుద్ధానికి" మద్దతు ఇచ్చినందుకు యూరోపియన్ దేశాలను కూడా అబ్బాస్ విమర్శించారు.
క్రమేణా తగ్గిన సుంకం..
అంతకుముందు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 25 శాతం అదనపు సుంకాన్ని ట్రంప్ విధించారు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత ఈ సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ప్రపంచ సుంకాలను రద్దు చేసిన తర్వాత ఆ రేటు 15 శాతానికి తగ్గింది.
‘హార్ముజ్’ ద్వారా భారత నౌకలకు అనుమతి..
యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత నౌకలకు ఇరాన్ సహకారం అందించింది. భారతదేశ జెండా ఉన్న LPG క్యారియర్ నౌకలను జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతించింది. సౌదీ అరేబియా నుంచి చమురు తీసుకొచ్చిన ఒక ట్యాంకర్ కూడా ఈ జలసంధి గుండా ప్రయాణించి భారతదేశానికి చేరుకుంటుందని సమాచారం.
భారత్‌కు ఇరాన్ హామీ..
భారతదేశంలో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతిహీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని ఇరాన్ కల్పిస్తుందని చెప్పారు. భారత్ - ఇరాన్ మధ్య దీర్ఘకాల స్నేహం ఉందని, రెండు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భారత ప్రజలకు జరిగే నష్టం తమకు కూడా నష్టమేనని పేర్కొన్నారు.
‘బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించాలి’
రష్యా చమురు, అమెరికా ఆంక్షలు, యుద్ధ పరిస్థితులు కలిసి అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తన ఇంధన అవసరాలు, అంతర్జాతీయ సంబంధాలు రెండింటిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

