
అమెరికా-ఇరాన్ యుద్ధం 37వ రోజుకు చేరింది.. యుద్ధం ముదిరింది!
ట్రంప్ హూంకారం.. ఇరాన్ ధిక్కారం..
37వ రోజుకు చేరిన యుద్ధం: 48 గంటల డెడ్ లైన్!
నిన్న 'నరకానికి స్వాగతమన్న' ఇరాన్..
నేడు 'నరకం చూపిస్తామన్న' ట్రంప్!
యుద్ధం 37వ రోజుకు చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం క్షిపణుల కన్నా వేగంగా, పదునుగా దూసుకుపోతోంది. ఒకర్నొకరు హెచ్చరించుకుంటున్నారు. బెదిరించుకుంటున్నారు. నిన్నటికి నేటికి ఇరు దేశాల అగ్రనేతలు వాడుతున్న భాషను గమనిస్తే, ఈ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదని, ఇది పరస్పర అహంకారాల పోరాటమని స్పష్టమవుతోంది.
ఆవేళ ఇరాన్ సవాలు: "వెల్‌కమ్ టు హెల్"
ఇరాన్ సైనిక కమాండర్లు అమెరికా బలగాలను ఉద్దేశించి అత్యంత ఘాటుగా స్పందించారు. "మీరు గనుక ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే.. మీకు నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి. వెల్‌కమ్ టు హెల్" అంటూ హెచ్చరించారు. అమెరికా సైన్యాన్ని గెరిల్లా తరహా యుద్ధంతో ముంచెత్తుతామని, వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా వ్యూహాలు పాతబడిపోయాయని, తమ భూమిపైకి వచ్చే శత్రువుకు ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం ఉండదని ఇరాన్ బాహాటంగానే ప్రకటించింది.
నేడు ట్రంప్ ప్రతిదాడి: "ఆల్ హెల్ విల్ రెయిన్ డౌన్"
ఇరాన్ చేసిన ఆ 'నరకపు' వ్యాఖ్యలకు నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు. 48 గంటల అల్టిమేటం విధిస్తూ.. "మీరు శాంతి ఒప్పందానికి రాకపోతే, ఇరాన్ కు నరకం చూపించడం ఖాయం (All hell will rain down)" అని హెచ్చరించారు.
దీనర్థం ఇరాన్ చెప్పినట్టు అమెరికా సైనికులు అక్కడికి వెళ్లడం కాదు.. అమెరికా తన అత్యాధునిక క్షిపణులు, బాంబులతో ఇరాన్‌నే నరకంగా మారుస్తుందని ట్రంప్ సంకేతాలిచ్చారు.
ఏయే లక్ష్యాలపై దాడులు ఉంటాయి...
అమెరికా హెచ్చరిక నేపథ్యంలో ఇరాన్ లోని ఏయే లక్ష్యాలపై దాడులు జరగవచ్చునంటే.. వంతెనలు, చమురు క్షేత్రాలు, పవర్ ప్లాంట్లు.. ఇలా ఇరాన్ మనుగడకు ఆధారమైన ప్రతి అంశాన్ని ధ్వంసం చేస్తామన్నది ట్రంప్ అంతర్యం.
మాటల వెనుక మర్మం ఏమిటి?
ఇరాన్ తన సంఖ్యాబలం, భౌగోళిక పరిస్థితులను నమ్ముకుని 'నరకం' అనే పదాన్ని వాడితే.. అమెరికా తన సాంకేతిక పరిజ్ఞానం, గగనతల ఆధిపత్యంతో 'నరకం చూపిస్తా' అంటోంది.
ఇరాన్ ఈ హెచ్చరికలను "చేతకాని వాడికి మాటలు ఎక్కువ"గా కొట్టిపారేస్తోంది. అమెరికా విమానాలను కూల్చివేయడం ద్వారా తాము ఇప్పటికే పైచేయి సాధించామని ఇరాన్ భద్రతా అధికారులు వాదిస్తున్నారు.
అమెరికా అల్టిమేటం గడువు ముగిసేలోపే ఒక భారీ 'సర్ప్రైజ్' అటాక్ ఉంటుందని ఇరాన్ అనడం యుద్ధం మరింత విస్తరిస్తుందనేదానికి నిదర్శనం.
పొరుగు దేశాల భయం...
ఈ 'నరకపు' పోరులో బుషెహర్ అణు ప్లాంట్ గనుక దెబ్బతింటే, ఆ రేడియేషన్ ప్రభావంతో గల్ఫ్ దేశాలు నిజంగానే నరకాన్ని చూడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఒకరు 'నరకానికి రమ్మంటే'.. మరొకరు 'నరకాన్ని చూపిస్తా' అంటున్నారు. ఈ అహంకారాల మధ్య సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగిసేలోపు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూడక తప్పదు. అది శాంతికి దారి తీస్తుందా లేక సర్వనాశనానికా అనేది వేచి చూడాలి.
మంటల్లో పెట్రో జోన్: ఇరాన్‌లోని మాహ్‌షహర్ పెట్రోకెమికల్ జోన్‌పై జరిగిన దాడులు ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి. మరోవైపు 30కి పైగా యూనివర్సిటీలు యుద్ధ ప్రభావానికి గురయ్యాయి.
అణు ప్రమాద ఘంటికలు: బుషెహర్ అణు ప్లాంట్‌పై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల మంచినీటి వనరులు (Desalination Plants) రేడియేషన్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విస్తరిస్తున్న యుద్ధ జ్వాలలు: కువైట్ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు, లెబనాన్‌లో ఇజ్రాయెల్ బాంబుల వర్షంతో మధ్యప్రాచ్యం అస్థిరంగా మారింది.
Next Story

