హార్మోజ్ జలసంధి గుండా భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్..
x

హార్మోజ్ జలసంధి గుండా భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్..

చర్చల తర్వాత షరతులో కూడిన అనుమతి ఇచ్చిన ఇరాన్..


Click the Play button to hear this message in audio format

హార్మోజ్ జలసంధి గుండా భారతదేశం జెండా ఉన్న నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జయ శంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో ఫోన్‌లో చర్చించిన తర్వాత ఇరాన్ ఇందుకు అంగీకరించింది. ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోన్న యుద్ధం నేపథ్యంలో ఇంధన రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

జైశంకర్ – అరాఘ్చి చర్చలు..

ఇద్దరు మంత్రులు మార్చి 9న టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లు సమాచారం. పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాల భద్రతపై ఈ చర్చలు జరిగాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్మోజ్ జలసంధి గుండా నౌకల కదలికలపై ఇటీవలి ఆందోళనలు పెరిగాయి. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్‌తో అనుబంధం ఉన్న కొన్ని నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఇరాన్ షరతు..

భారత జెండా ఉన్న నౌకలకు ప్రయాణానికి అనుమతి ఉన్నప్పటికీ, జలసంధి దాటే ముందు ఇరాన్ నుంచి అనుమతి తీసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. హెచ్చరికలను పట్టించుకోకుండా జలసంధి దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలపై ఇటీవల చర్యలు తీసుకున్నారు.

హార్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యం..

హార్మోజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటి. రోజూ 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానం. అలాగే భారీ స్థాయిలో ద్రవీకృత సహజ వాయువు కూడా ఇదే మార్గం గుండా రవాణా అవుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై వెంటనే ప్రభావం పడే అవకాశం ఉంది.

ముంబై చేరుకున్న ట్యాంకర్..

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకువెళుతున్న ఒక ట్యాంకర్ సురక్షితంగా ముంబైకి చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఈ నౌకను భారతీయ కెప్టెన్ నడిపించారు. ఈ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని దాటి 1,35,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ముంబైలోని జవహర్ ద్వీప టెర్మినల్‌కు చేరుకుంది.

ప్రమాదకర ప్రాంతంలో ‘చీకటి’గా ప్రయాణం..

ప్రమాదకర ప్రాంతంలో ప్రయాణించే సమయంలో నౌక కొంతసేపు తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ఆపివేసినట్లు సమాచారం. దీనివల్ల నౌక ట్రాకింగ్ వ్యవస్థల్లో కొంతసేపు కనిపించలేదు. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవు నుంచి బయలుదేరిన ఈ ట్యాంకర్ హార్ముజ్ జలసంధి దాటిన తర్వాత మళ్లీ ట్రాకింగ్ వ్యవస్థల్లో కనిపించింది.

గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకలు..

ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారత జెండాలున్న నౌకలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాటిలో చాలా నౌకలు జలసంధికి పశ్చిమ భాగంలో ఉన్నాయి. ఈ నౌకల్లో వందలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. వారి భద్రతను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

పరిస్థితిని గమనించేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. షిప్పింగ్ కంపెనీలు, రిక్రూట్‌మెంట్ సంస్థలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చమురు ధరల పెరుగుదల..

ఇదే సమయంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిస్థితుల్లో ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రభుత్వం కూడా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి చమురు విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ పరిణామాల మధ్య భారత నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి లభించడం ఒక కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు.

Read More
Next Story