చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నమేంటి?
x

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నమేంటి?

చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయ మైనింగ్, ప్రాసెసింగ్, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేసింది.


Click the Play button to hear this message in audio format

చైనా(China) ఆధిపత్యం వల్ల అరుదైన భూ ఖనిజాల సరఫరాలో భారత్‌ వెనకబడి పోయింది. ఇక దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తోంది. అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉండటం, పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం, సాంకేతిక లోపాలు పురోగతిని నెమ్మదిస్తున్నాయి.


అసలు అవసరమేంటి?

♦ అయస్కాంతాల దిగుమతి కోసం చైనాపై అధికంగా ఆధారపడటం

♦ స్వచ్ఛమైన శక్తి (క్లీన్ ఎనర్జీ) సాంకేతికతకు అరుదైన భూమి ఖనిజాలు కీలకం

♦ రక్షణ, ఏరోస్పేస్ రంగాల వ్యూహాత్మక అవసరాలు

♦ విస్తారమైన దేశీయ నిల్వలు తక్కువగా వినియోగంలో ఉండటం

♦ దేశీయ ప్రాసెసింగ్, తయారీ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం


‘‘రేర్ ఎర్త్ కారిడార్స్..’’

2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో “రేర్ ఎర్త్ కారిడార్లు” ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ కార్యకలాపాలను అభివృద్ధి చేసి, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, రక్షణ పరికరాలు, ఏరోస్పేస్ వ్యవస్థలకు అవసరమైన శాశ్వత అయస్కాంతాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

చైనాపై ఆధారపడటాన్ని బాగా తగ్గించాలన్న నిర్ణయం తీసుకుందని ఆబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ సమీర్ పాటిల్ పేర్కొన్నారు. గత ఏడాది ప్రకటించిన విధాన చర్యలపై ఈ బడ్జెట్ ఆధారపడింది. 2025 నవంబర్‌లో రూ.7,280 కోట్ల విలువైన రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (REPM) తయారీ పథకానికి ఆమోదం లభించింది. ఐదు సంవత్సరాల్లో అమ్మకాల ప్రోత్సాహకాలు, మూలధన సబ్సిడీల రూపంలో వేల కోట్ల మద్దతు అందించనున్నారు.


చైనా నుంచే ఎక్కువ..

ప్రపంచ అరుదైన భూ నిల్వల్లో భారతదేశం 6–7 శాతం వాటా ఉంది. ఉత్పత్తిలో అయితే 1 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యం ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 2022–23 నుంచి 2024–25 మధ్య కాలంలో భారతదేశం దిగుమతి చేసుకున్న శాశ్వత అయస్కాంతాల్లో చైనా వాటా 59.6 నుంచి 81.3 శాతం, పరిమాణ పరంగా 84.8 నుంచి 90.4 శాతం వరకు ఉంది. 2025లో బీజింగ్ ఎగుమతుల నియంత్రణను కఠినతరం చేయడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది.


మనదగ్గరున్న నిల్వలెన్ని?

దేశంలో 13.15 మిలియన్ టన్నుల మోనజైట్ నిల్వలు ఉన్నాయని, అందులో 7.23 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్లు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్నాయి. అదనంగా గట్టి శిలల్లో 1.29 మిలియన్ టన్నుల ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వాణిజ్య వినియోగం పరిమితంగానే ఉంది.

విదేశీ దిగుమతులు తగ్గించేందుకు కారిడార్ ప్రణాళికతో పాటు సుంకం మినహాయింపులు, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా భౌగోళిక–రాజకీయ అడ్డంకులు కూడా ప్రభావం చూపుతున్నాయి. మయన్మార్ వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయ సరఫరా ప్రయత్నాలు భద్రతా అస్థిరత కారణంగా నిలిచిపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, జాంబియా వంటి దేశాలతో ఒప్పందాల ద్వారా దీర్ఘకాలిక సరఫరా మార్గాలను అన్వేషిస్తోంది.

అమెరికా ఆధ్వర్యంలో జరిగే క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశం, మినరల్స్ సెక్యూరిటీ పార్టనర్‌షిప్ (MSP), ఇండో–పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (IPEF) వంటి బహుపాక్షిక వేదికల్లో భారతదేశం చురుకుగా పాల్గొంటోంది. అయితే ఒక్క దేశంపై ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశీయ అభివృద్ధిలో అసమానతలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లాలో అధునాతన అన్వేషణలు జరిగినప్పటికీ వేలం, అనుమతులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గణనీయ నిల్వలు ఉన్నా.. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కొరతతో పురోగతి నెమ్మదిగా సాగుతోంది. మొత్తంగా అరుదైన భూ రంగంలో భారతదేశం దిశానిర్దేశక అడుగులు వేస్తున్నప్పటికీ, స్థాయి–సామర్థ్య లోపాలు, నియంత్రణ సమస్యలు, సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకులుగా మారాయి.

Read More
Next Story