
తల్లి మీరా నాయర్ తో జోహ్రాన్ మమ్దానీ
న్యూయార్క్ మేయర్ సీటుపై మన మీరా నాయర్ కుమారుడు మమ్దానీ?
న్యూయార్క్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 33 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ముందంజలో ఉన్నారు.
అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీలో మంగళవారం జరుగుతున్న మేయర్ ఎన్నికలు- తరం మార్పు, ఆలోచనా ధోరణుల మధ్య సంఘర్షణకు సంకేతంగా నిలుస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అటు అమెరికాలో కాకుండా ఇటు అంతర్జాతీయంగా రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
కొద్దిసేపటి కిందట న్యూయార్క్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో  33 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ముందంజలో ఉన్నారు. ప్రముఖ కార్మిక నేత, డెమోక్రాటిక్ సెనేటర్ బెర్లీ శాండర్స్ (Bernie Sanders) విశ్లేషణ ప్రకారం మమ్దానీ తప్పక గెలువబోతున్నారు. జోహ్రాన్ మమ్దానీ భారతీయ మూలాలున్న యువకుడు. హిందీలోనూ బాగా మాట్లాడగలరు. ఒడియా భాష కూడా అర్థమవుతుంది. మంచి వక్త. అద్భుతంగా హిందీ, పంజాబీ పాటలు పాడగలరు.
సుమారు 82 లక్షలకు పైగా ఓట్లున్న న్యూయార్క్ నగర మేయర్ పదవికి 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ (డెమోక్రటిక్ పార్టీ), 67 ఏళ్ల మాజీ గవర్నర్ ఆండ్రూ క్యువోమో (స్వతంత్ర అభ్యర్థి), 71 ఏళ్ల రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా పోటీ పడుతున్నారు.
తాజా సర్వేల ప్రకారం ఆయనకు సుమారు 46 శాతం ఓటర్ల మద్దతు ఉండగా, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యువోమోకు 32 శాతం, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 16 శాతం మద్దతు లభించింది.
మార్పు కోరుతున్న న్యూయార్క్ ప్రజలు...
ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ అవినీతి, పరిపాలనా లోపాలతో విమర్శలు ఎదుర్కొంటుండగా, మమ్దానీ -మార్పు ప్రతీక- గా ఎదిగారు.
హౌసింగ్ ఖర్చులు, రెంట్ నియంత్రణ, వలసదారుల సంక్షేమం, ప్రజా రవాణా సదుపాయాలు వంటి ప్రజా సమస్యలపై ఆయన సూటిగా మాట్లాడుతున్నారు. దీంతో యువత, మైనారిటీలు, వలసదారులు- నుంచి మద్దతు ఆయన వైపు మొగ్గుచూపుతున్నారు. న్యూయార్క్ నాట్ ఫర్ సేల్ అనే నినాదం బాగా ఆకట్టుకుంది.
భారతీయ మూలాలు ఉన్న కుటుంబం ...
జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్, భారతీయ మూలాలున్న ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకురాలు. 1957లో ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో జన్మించిన మీరా నాయర్, Salaam Bombay, Monsoon Wedding, The Namesake వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
తల్లిదండ్రులతో జోహ్రాన్ మమ్దానీ
తండ్రి మహ్మూద్ మమ్దానీ ఉగాండాలో జన్మించిన భారతీయ వంశస్తుడు. ఆయన ఆఫ్రికాలో ప్రముఖ రాజకీయ తత్వవేత్త. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్.
ఆయన రచనలు Citizen and Subject, Good Muslim, Bad Muslim లాంటి ప్రపంచవ్యాప్తంగా పాఠ్యగ్రంథాలుగా ఉన్నాయి.
ఈ బహు సాంస్కృతిక కుటుంబ వాతావరణంలో పెరిగిన జోహ్రాన్ చిన్నప్పటి నుంచే సమానత్వం, మానవ హక్కులు, కళాత్మకత విలువలను గ్రహించారు. తల్లి నుంచి సృజనాత్మకతను, తండ్రి నుంచి మానవతా దృష్టిని ఆయన పొందారు.
జోహ్రాన్ రాజకీయ ప్రయాణం...
జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న తర్వాత న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతం అస్టోరియా నుంచి అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అద్దెదారుల హక్కులు, వలసదారుల జీవన ప్రమాణాలపై ఆయన గళం విప్పారు. వేలాది మందిని ఆకట్టుకున్నారు. ఆయన ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవలు కూడా అందించారు. ట్రక్ డ్రైవర్ల సంఘం కూడా ఏర్పాటు చేసి వాళ్ల సమస్యలపై పోరాడి విజయం సాధించారు.
2025 డెమోక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యువోమోను ఓడించి పార్టీ నామినేషన్ సాధించారు. ఇది న్యూయార్క్ రాజకీయాల్లో పెద్ద సంచలనం. మేయర్ ఎన్నికల్లో పెద్ద మలుపు. దీంతో ఆండ్రూ క్యువోమో స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు.
ఆండ్రూ క్యువోమో ను పోటీ నుంచి తప్పుకునేలా డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వం మధ్యవర్తిత్వం చేసినా ఫలించలేదు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పార్టీలో వ్యతిరేకత మమ్దానీకి మంచి ఊపునిచ్చాయి.
ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రతిష్ట మసకబారడం కూడా మమ్దానీకి కలిసివచ్చింది. రిపబ్లికన్ క్యాంప్ వైపు పెద్దగా కదలిక లేకపోవడం తదితర కారణాలు మమ్దానీ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉండడానికి తోడ్పడ్డాయి.
విశ్లేషకుల అంచనా...
పోలింగ్ సెంటర్లు, మీడియా తాజా సర్వేల ప్రకారం జోహ్రాన్ మమ్దానీ గెలుపు సాధ్యమేనని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే వృద్ధులైన సీనియర్ ఓటర్లు, వ్యాపార వర్గాల ఓటు  పైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
కొత్త తరం నాయకత్వానికి సంకేతం...
భారతీయ మూలాలున్న తల్లి, ఆఫ్రికన్‐ఇండియన్ వంశపారంపర్యం కలిగిన తండ్రి, బహుసాంస్కృతిక నేపథ్యం కలిసి జోహ్రాన్ మమ్దానీని న్యూయార్క్ పాలిటిక్స్‌లో ఒక సరికొత్త నాయకునిగా ఎదిగేలా చేశాయి. అతని గెలుపు కేవలం రాజకీయ విజయం కాదు, భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే నగరం ఒక యువనేతకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడమే అవుతుందని డెమోక్రాటిక్ సెనేటర్ బెర్లీ శాండర్స్ అన్నారు.
మమ్దానీ గెలిస్తే ఆయన న్యూయార్క్ చరిత్రలో తొలి ముస్లిం మేయర్‌గా, భావితరం నేతగా నిలుస్తారు. ఈ విజయంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
ప్రజా సంక్షేమం, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆధారపడిన ఎన్నిక ఇది. మమ్దానీ తనది డెమోక్రటిక్ సోషలిస్ట్ విధానమని చెప్పి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
Next Story

