యూరప్‌తో చేతులు కలిపిన భారత్: మోదీ మార్క్ డీల్
x

యూరప్‌తో చేతులు కలిపిన భారత్: మోదీ మార్క్ డీల్

భారత్, యూరప్ మధ్య వాణిజ్య బంధానికి కొత్త అధ్యాయం - స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని సంతకం


Click the Play button to hear this message in audio format

భారత్–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రకటించారు. దీన్ని ప్రజలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’గా పిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం వల్ల దేశంలోని 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్ ప్రజలకు లాభం చేకూరుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇండియన్ ఎనర్జీ వీక్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


సేవల రంగానికి తోడ్పాటు..

ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటా ఉన్న దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం విశేషమని మోదీ చెప్పారు. భారత్–ఈయూ మధ్య ఉన్న బలమైన సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యానికి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. వస్త్రాలు, రత్నాలు–ఆభరణాలు, తోలు, పాదరక్షల రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మందికి ఇది మేలు చేస్తుందని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌లో తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు, సేవల రంగం మరింత విస్తరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులకు అనుకూలంగా ఉండటమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భారత్‌పై నమ్మకం మరింత పెరుగుతుందని చెప్పారు.


వంద బిలియన్ డాలర్లకు పెంచాలని..

ఇంధన రంగంలో భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే దశాబ్దంలో చమురు, గ్యాస్ రంగంలో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లోతైన సముద్ర అన్వేషణ, ‘సముద్ర మంథన్ మిషన్’ వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఒప్పందం ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Read More
Next Story