
భారత్–EU వాణిజ్య ఒప్పందం దిశగా కీలక అడుగు..
భారత్.. ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందన్న EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్
భారత్–యూరోపియన్(India-EU) యూనియన్ (EU) మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం(trade deal) తుది దశకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలో విజయ శీల భారత్.. ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుంది అని EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా(Ursula) వాన్ డెర్ లేయన్ వ్యాఖ్యానించారు. భారత్–EU శిఖరాగ్ర సమావేశానికి ముందు మూడు రోజుల పర్యటన కోసం ఆయన భారత్‌కు వచ్చారు. మంగళవారం ప్రధాని మోదీ(Narendra Modi)తో కీలక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో వాణిజ్య ఒప్పందమే ప్రధాన అంశంగా ఉండనుంది.
చారిత్రక ఒప్పందం..
భారత్–EU వాణిజ్య ఒప్పందాన్ని కొందరు వాణిజ్య రంగంలో చరిత్రలోనే నిలిచిపోయే అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ప్రపంచ GDPలో దాదాపు 25 శాతం వాటా కలిగిన భారీ ఆర్థిక శక్తిగా మారనుంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో లేయన్ మాట్లాడుతూ.. “ఇంకా కొంత పని మిగిలి ఉంది. కానీ మనం చారిత్రక వాణిజ్య ఒప్పందానికి చేరువలో ఉన్నాం” అని పేర్కొన్నారు.
భారత్‌కు బలమైన బిజినెస్ పార్టనర్ EU..
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో EU–అమెరికా సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు భారతీయ వస్తువులపై అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో బలమైన వాణిజ్య భాగస్వామ్యం EUకి వ్యూహాత్మకంగా కీలకంగా మారింది.
వాణిజ్య గణాంకాలు..
2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్–EU మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $135 బిలియన్లకు చేరుకుంది. దీంతో EU, భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది.
దిగుమతి సుంకాలను తగ్గించే దిశగా..
ఈ ఒప్పందంలో భాగంగా..EU నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ విధిస్తున్న 110 శాతం వరకు ఉన్న సుంకాలను క్రమంగా తగ్గించే అంశంపై చర్చలు సాగుతున్నాయి. మొదటిగా కొన్ని లగ్జరీ వాహనాలపై సుంకాన్ని తగ్గించి, భవిష్యత్తులో 10 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని సమాచారం. దీంతో వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, BMW వంటి యూరోపియన్ కార్ల కంపెనీలకు భారత మార్కెట్ మరింతగా తెరుచుకోనుంది.
నేపథ్యం..
భారత్–EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు 2007లో ప్రారంభమై, 2013లో నిలిచిపోయాయి. అనంతరం 2022లో మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం అవి తుది దశకు చేరుకున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే ఈ వాణిజ్య ఒప్పందం భారత్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా కీలక మలుపుగా మారే అవకాశముంది.

