పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటి చికిత్సపై వివాదం..
x

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటి చికిత్సపై వివాదం..

ప్రభుత్వ గోప్యతపై కుటుంబం, పార్టీ ఆందోళన


Click the Play button to hear this message in audio format

పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన కంటి చికిత్సపై రాజకీయ దుమారం రేగింది. ఇమ్రాన్ ఖాన్ వైద్య పరీక్షల వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తున్నాయి.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్‌కు నిపుణులతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పాకిస్తాన్ సమాచార మంత్రి అతౌల్లా తరర్ మీడియాతో అన్నారు. కంటిచూపు మందగిస్తున్నందున ప్రత్యేక వైద్య కేంద్రంలో పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ప్రభుత్వ గోప్యతపై అనుమానాలు..

అయితే చికిత్స ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం వివాదానికి కారణమైంది. ఆసుపత్రికి రహస్యంగా తరలించే ప్రయత్నం జరుగుతోందని, ఇది మాజీ ప్రధాని ప్రాణాలకు ప్రమాదకరమని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలంటున్నారు. “ఇలాంటి విషయాల్లో పారదర్శకత ఉండాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవద్దని మరో మంత్రి తరర్ ఎక్స్ (X)లో పేర్కొన్నారు. ప్రముఖ కంటి నిపుణులతో పరీక్షలు నిర్వహించి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈయన కూడా స్థలం, సమయంపై స్పష్టత ఇవ్వలేదు.

73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా జైలు నుంచి ఆసుపత్రికి తరలించవచ్చని వస్తున్న వార్తలపై పీటీఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటున్నారు. ఏ పరీక్షలు జరిపినా ఆయన వ్యక్తిగత వైద్యుడు, కనీసం ఒక కుటుంబ సభ్యుడు ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలింపు విషయం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ పేర్కొన్నారు. ఖాన్ ఆరోగ్య సమస్యలపై పార్టీ మద్దతుదారులు ఇస్లామాబాద్ సహా పలు నగరాల్లో నిరసనలు చేపట్టారు.

ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి అదియాలా జైలులో ఉన్నారు. అవినీతి కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. 2022 ఏప్రిల్‌లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో పదవిని కోల్పోయారు. తన తొలగింపు విదేశీ కుట్ర ఫలితమని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం కంటి చికిత్స అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరో రాజకీయ పోరుకు దారి తీసింది.

Read More
Next Story