
ఖమేనీని చంపడానికి 47 ఏళ్లు పట్టిందన్న ట్రంప్
అంతటి గొప్ప గౌరవం నాకే దక్కింది, అయతుల్లా ఖమేనీని ఎలా చంపారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ పాలకవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇరాన్ పాలక వర్గ సభ్యులను అంతం చేయడం తనకు దక్కిన 'గొప్ప గౌరవం' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇవాళ (మార్చి 13) ఉదయం ఆయన 'ట్రూత్ సోషల్' (Truth Social) లో ఇలా రాశారు..
'మేము ఇరాన్ ఉగ్రవాద పాలనను సైనికంగా, ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా పూర్తిగా నాశనం చేస్తున్నాం. ఇరాన్ నౌకాదళం అంతమైపోయింది, వారి వాయుసేన ఇక లేదు. క్షిపణులు, డ్రోన్లు, మిగిలినవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారి నాయకులు భూమి మీద లేకుండా కనుమరుగయ్యారు.
మా వద్ద సాటిలేని అగ్ని సామర్థ్యం ఉంది. అపరిమితమైన ఆయుధ సంపత్తి ఉంది. కావాల్సినంత సమయం ఉంది. మతిస్థిమితం లేని ఈ దుర్మార్గులకు ఈరోజు ఏం జరుగుతుందో చూడండి.
గత 47 ఏళ్లుగా వీరు ప్రపంచవ్యాప్తంగా అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా నేను వారిని అంతం చేస్తున్నాను. అలా చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను!" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకున్నారు.
అయతుల్లా ఖమేనీని ఎలా చంపారంటే...
అమెరికా, ఇరాన్ మధ్య చాలా కాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే సాకుతో దాడులు చేయాలని అమెరికా నిర్ణయించింది. అందుకు ఫిబ్రవరి 28వ తేదీని ఖరారు చేసుకుంది. ఇజ్రాయెల్ కు ఈమాటే చెప్పింది. ఇరు దేశాలు సంయుక్తంగా ఇరాన్ పై దాడులకు దిగాయి.
తొలి దాడి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా సాగింది. ఈ దాడికి "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" (Operation Epic Fury) గా అమెరికా పేరు పెట్టింది.
2026 ఫిబ్రవరి 28, శనివారం ఉదయం 9.00 గంటలు..
ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టే 'డికాపిటేషన్ స్ట్రైక్' (అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టే దాడి) మొదలైంది.
ఈ దాడి కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగిసినప్పటికీ, దీని వెనుక నెలల తరబడి నిఘా, కసరత్తు, అమెరికా ఇంటెలిజెన్స్ (CIA) సేకరించిన సమాచారం ఉంది.
ఉదయం 9:30 (టెహ్రాన్ సమయం): ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసం, కార్యాలయ సముదాయంలో (Leadership Compound) ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ధృవీకరించుకున్నాయి.
ఉదయం 9:40: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడిని ప్రారంభించాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. సరిగ్గా ఒక నిమిషం వ్యవధిలోనే 30కి పైగా శక్తివంతమైన బాంబులను ఆ సముదాయంపై కురిపించాయి.
ఈ దాడిలో భూగర్భంలో ఉన్న బంకర్లను కూడా ఛేదించగల 'బ్లూ స్పారో' (Blue Sparrow) క్షిపణులను, గైడెడ్ బాంబులను వాడారు. ఇవి కొన్ని మైళ్ల దూరం ఆకాశం వైపు ఎగిరి అత్యంత వేగంతో నేరుగా కింద లక్ష్యాన్ని తాకాయి.
ఉదయం 9:41:
కేవలం 60 సెకన్ల వ్యవధిలో ఖమేనీ ఉంటున్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఆ ప్రాంతం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది.
ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, కోడలు, మనవడు, పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు.
మధ్యాహ్నం 3:30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఖమేనీ అంతమైనట్లు తొలిసారి ప్రకటించారు.
మధ్యాహ్నం 4:00: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఖమేనీ మరణించినట్లు సంకేతాలిచ్చారు.
తొలుత ఇరాన్ ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది.
మార్చి 1, 2026 (ఆదివారం)
తెల్లవారుజామున: ఇరాన్ అధికారిక మీడియా ఛానల్ (IRINN) ఖమేనీ "అమరుడు" (Martyred) అయ్యారని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
వారసుడి ప్రకటన: ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తదుపరి సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి మృతదేహాన్ని తాను స్వయంగా చూశానని ఆయన ధృవీకరించారు.
ఈ మొత్తం కార్యక్రమాన్నే డోనాల్డ్ ట్రంప్ గత 47 ఏళ్లుగా ఇరాన్ చేస్తున్న కార్యకలాపాలకు ముగింపు పలకడం అంటున్నారు.
Next Story

