కూతురు ఇంట్లో దాక్కున్నా దక్కని లారిజానీ ప్రాణం!
x

కూతురు ఇంట్లో దాక్కున్నా దక్కని లారిజానీ ప్రాణం!

హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించేలా ఇజ్రాయెల్ దాడి.. ఎలా చేసిందంటే..


మొన్న అయతుల్లా ఖమేనీ, నిన్న లారిజానీ, రేపు ఇంకెవరో..
ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ 'మొసాద్' టార్గెట్ చేస్తే ఇక బతకడం కష్టమేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇరాన్ లో అత్యంత పవర్ ఫుల్ లీడర్లు ఇద్దర్ని ఒకే రోజు మట్టుబెట్టిన తీరు ఓ హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

Larijani, soleimani

ఇరాన్ గడ్డపై మరోసారి నిప్పుల వాన కురిసింది. ఆ దేశ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ సైనిక యంత్రాంగానికి వెన్నెముకగా నిలిచిన అలీ లారిజానీని ఇజ్రాయెల్ అత్యంత వ్యూహాత్మకంగా అంతమొందించింది. ఇది కేవలం ఒక వైమానిక దాడి కాదు.. వేల కిలోమీటర్ల అవతల ఉన్న శత్రువు ఊపిరిని పక్కాగా లెక్కగట్టి తీసిన అతిఖరీదైన ప్రాణం.
అదృశ్య నీడ.. వేట మొదలైంది..
ఖమేనీ మరణం తర్వాత లారిజానీ ఇజ్రాయెల్‌కు 'టార్గెట్ నంబర్ 1' అయ్యారు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇరాన్ అణు కార్యక్రమాల నుంచి సైనిక వ్యూహాల వరకు ప్రతిదీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. శత్రువులకు చిక్కకుండా ఉండటంలో లారిజానీ దిట్ట. ఫోన్లు వాడరు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటారు, రోజుకు మూడుసార్లు తన రహస్య స్థావరాలను మారుస్తుంటారు. కానీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆయనను నీడలా వెంటాడింది.
1600 కిలోమీటర్ల 'సర్జికల్' అటాక్
టెహ్రాన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య దూరం దాదాపు 1600 కిలోమీటర్లు. అంత దూరం నుంచి యుద్ధ విమానాలు వెళ్లి దాడి చేయడం అంటే శత్రుదేశాల గగనతలాన్ని దాటుకుంటూ వెళ్లాలి. లారిజానీ తన కుమార్తె ఇంటికి వస్తున్నాడనే సమాచారాన్ని ఇజ్రాయెల్ గూఢచారులు పక్కాగా సేకరించారు.
ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'గ్రీన్ సిగ్నల్' ఇచ్చారు. నిమిషాల వ్యవధిలో ఎఫ్-35 యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి.
కుమార్తె ఇల్లే మృత్యుపాశం..
సాధారణంగా లారిజానీ సైనిక బంకర్‌లలో ఉంటారు. కానీ, అనుకోకుండా ఆయన తన కుమార్తె ఇంటికి చేరుకోవడం ఇజ్రాయెల్‌కు వరంలా మారింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులు ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ భీకర దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన వారసుడిని కూడా కోల్పోవడంతో లారిజానీ సామ్రాజ్యం కుప్పకూలింది.
ఒకే ముహూర్తం.. రెండు ప్రాణాలు
ఇక్కడ ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ ఎంత తెలివిగలదో తెలుసుకోవాలి. ఒకవైపు లారిజానీపై దాడి జరుగుతుండగానే, మరోవైపు ఇరాన్ అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేసిన జనరల్ గులాం రెజా సాల్మనీపై కూడా దాడి జరిగింది.
ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అగ్రనేతలను మట్టుబెట్టడం ద్వారా ఇరాన్ గూఢచారి వ్యవస్థను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది.
ఈ దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలోని డొల్లతనం బయటపడిందని విశ్లేషకులు అంటున్నారు. అగ్రనేతలే తమ ఇళ్లలో సురక్షితంగా లేరన్న భయం టెహ్రాన్ వీధుల్లో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సాంకేతికత, గూఢచారి బలం ముందు ఇరాన్ సైనిక శక్తి ప్రశ్నార్థకంగా మారింది.
Read More
Next Story