ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా మరణించారా?
x

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా మరణించారా?

US మిలిటరీ ట్వీట్, ధృవీకరించని ఇరాన్, వదంతుల మధ్య టెన్షన్ టెన్షన్..


ఇరాన్ నూతన సుప్రీం కమాండర్ (సుప్రీం లీడర్) అయతుల్లా మొజ్తాబా ఖమేనీ మరణంపై వస్తున్న వార్తలు ప్రస్తుతం తీవ్ర సస్పెన్స్‌కు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా 'ఎక్స్' (X) వేదికగా అమెరికా మిలిటరీ వర్గాల పేరుతో ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఇరాన్ మీడియా ధృవీకరించిందంటూ యూఎస్ మిలిటరీ పేరిట ఉన్న ఎక్స్ ఖాతా తెలియజేస్తోంది. కానీ, ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు. అమెరికా చేస్తున్న దుష్ప్రచారంగా ఇరానీయన్లు కొట్టిపారేస్తున్నారు.
గాయపడినట్టు వార్తలు...
ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన వైమానిక దాడుల్లోనే మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా (ది హిందూ, టెలిగ్రాఫ్) పేర్కొంది. ఆయన కాలు కోల్పోయారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే మూడు రోజుల కిందట ఆయన ఓ మంత్రి అంతిమ సంస్కారాలలో పాల్గొన్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అమెరికా ఈ వార్తను ప్రచారం పెట్టింది. మొజ్తాబా చనిపోయారంటూ ట్విట్టర్ లో పెట్టడం సంచలనం రేపుతోంది.
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, ఆ దాడిలో ఆయన తండ్రి (అలీ ఖమేనీ) సహా కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మరణించారని సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ వెల్లడించారు.
నికోసియాలోని రాయబార కార్యాలయం నుంచి 'ది గార్డియన్' పత్రికతో మాట్లాడిన సలారియన్, మొజ్తాబా చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందుకే బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బహిరంగంగా ప్రసంగించలేకపోయారని వివరించారు.
రమదాన్ మాసం 10వ రోజున జరిగిన ఈ దాడిలో అలీ ఖమేనీ నివాసం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో మొజ్తాబా భార్య జహ్రా, కుమారుడు మొహమ్మద్ బాఘేర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలీ ఖమేనీ భార్య మన్సూర్, దాడి జరిగిన మూడు రోజుల తర్వాత మరణించినట్లు సమాచారం.
అలీ ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా నియమించడం ఇష్టం లేకపోయినప్పటికీ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నత స్థాయి మత పెద్దలు మొజ్తాబాను ఈ పదవి చేపట్టాలని కోరడంతో ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు రాయబారి పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ మొజ్తాబాను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. మొజ్తాబా బతికే ఉన్నారా లేదా అనే విషయంలో తమకు స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.
ఇరాన్ ప్రభుత్వం, అక్కడి మీడియా మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెబుతున్నాయి. మార్చి 12న ఆయన పేరుతో ఒక లిఖితపూర్వక సందేశం కూడా విడుదలైంది, కానీ ఆయన వీడియో లేదా ఆడియో మాత్రం బయటకు రాలేదు.
'ఎక్స్'లో యూఎస్ మిలిటరీ వర్గాల పేరుతో వస్తున్న పోస్ట్లు.. ఇరాన్ మీడియా ధృవీకరించిందని చెబుతున్నా, ఇప్పటివరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు (IRNA లేదా Fars News) మొజ్తాబా మరణాన్ని ప్రకటించలేదు.
ఆయన మరణించారనే వార్త ఇంకా ధృవీకరించబడని సమాచారం (Unconfirmed) గానే ఉంది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరు పక్షాల నుంచి ఇలాంటి 'మైండ్ గేమ్' లేదా 'ఇన్ఫర్మేషన్ వార్' జరిగే అవకాశం ఉంది.
Read More
Next Story