హెచ్-1బి లాటరీ 2027: కొత్త నిబంధనలేంటి?
x

హెచ్-1బి లాటరీ 2027: కొత్త నిబంధనలేంటి?

ఆఫర్ చేసిన జీతం ఆధారంగా ఎంపిక..అధిక వేతనం ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అవకాశాలు..


Click the Play button to hear this message in audio format

అమెరికా Fiscal Year -2027 హెచ్-1బి వర్క్ వీసా లాటరీ ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. వీటి కోసం వేలాది విదేశీ నైపుణ్య కార్మికులు, వారి యజమానులు USCIS ఆన్‌లైన్ ఖాతాలను గమనిస్తున్నారు. ఈసారి లాటరీ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మూడు అంశాలను పూర్తిగా మార్చాయి. పాత యాదృచ్ఛిక లాటరీ విధానాన్ని తొలగించి, వేతనాల ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే అమెరికా వెలుపల ఉన్న అభ్యర్థుల కోసం $100,000 అదనపు ఫీజు విధించారు. అంతేకాకుండా, మోసాలను అరికట్టే చర్యల వల్ల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

వేతనాల ఆధారంగా ఎంపిక..

కొత్త విధానం ప్రకారం, అభ్యర్థి ఎంపిక అవకాశాలు ఇప్పుడు అతనికి ఆఫర్ చేసిన జీతంపై ఆధారపడి ఉంటాయి. అధిక వేతనం ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

లెవెల్ IV (అత్యంత నిపుణులు) – 4 అవకాశాలు

లెవెల్ III (అనుభవజ్ఞులు) – 3 అవకాశాలు

లెవెల్ II (మధ్యస్థ నైపుణ్యం) – 2 అవకాశాలు

లెవెల్ I (ప్రారంభ స్థాయి) – అత్యల్ప అవకాశాలు

ఈ వేతనం అభ్యర్థి ప్రస్తుతం సంపాదిస్తున్న జీతం కాదు. యజమాని భవిష్యత్తులో చెల్లించేందుకు అంగీకరించిన జీతమే నిర్ణయాత్మకం.


ఫీజు నిబంధన..

2025 సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, అమెరికా వెలుపల ఉన్న అభ్యర్థుల కోసం దాఖలు చేసే హెచ్-1బి పిటిషన్లకు $100,000 అదనపు ఫీజు విధించారు. అయితే అమెరికాలో ఇప్పటికే ఉన్న ఎఫ్-1 విద్యార్థులకు (OPTలో ఉన్నవారికి) ఈ ఫీజు వర్తించదు. గతంలో హెచ్-1బి పిటిషన్లలో వీరి వాటా ఎక్కువగా ఉండటం గమనార్హం.


భారీగా తగ్గిన దరఖాస్తుల సంఖ్య

కొత్త నియమాల వల్ల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకే వ్యక్తికి పలువురు యజమానులు దరఖాస్తు చేయకుండా నిరోధించే విధానాన్ని అమలు చేయడంతో ఈ తగ్గుదల కనిపించింది.

FY-2024లో దాదాపు 8 లక్షల రిజిస్ట్రేషన్లు

FY-2025లో 38% తగ్గుదల

FY-2026లో మరో 26.9% తగ్గి 3,43,981కి చేరింది.

ఈ తగ్గుదల మోసపూరిత దరఖాస్తులను తగ్గించడంలో భాగంగా జరిగింది.


ఏఐ ద్వారా పర్యవేక్షణ..

అసాధారణ దరఖాస్తులను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వేతనాల్లో అవకతవకలు వంటి అంశాలను గుర్తించేందుకు నమూనా విశ్లేషణ (ప్యాటర్న్ రికగ్నిషన్) పద్ధతులను వినియోగిస్తున్నారు. అయితే ఏఐ వినియోగంపై అధికారిక ధృవీకరణ లేదు.


ఫలితాలు, ఆ తర్వాత దశ..

FY-2027 ఎంపిక నోటిఫికేషన్‌లను మార్చి 31, 2026 నాటికి పంపాలని అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్‌లు నేరుగా అభ్యర్థులకు కాకుండా, వారి యజమానులు లేదా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులకు పంపుతారు. ఈ లాటరీలో సుమారు 85 వేల మంది ఎంపికయ్యే అవకాశం ఉంది. ఎంపికైన వారు ఏప్రిల్ 1 నుంచి పూర్తి పిటిషన్ దాఖలు చేయాలి. ఎంపిక కాలేని వారు తదుపరి FY-2028 లాటరీ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

మొత్తంగా, కొత్త విధానం హెచ్-1బి లాటరీ వ్యవస్థను మరింత కఠినంగా, పారదర్శకంగా మార్చినట్లు భావిస్తున్నారు.

Read More
Next Story