పాకిస్థానీయులకు గడువు పొడిగింపు..
x

పాకిస్థానీయులకు గడువు పొడిగింపు..

ఇప్పటికే 55 మంది దౌత్యవేత్తలు, సహాయక సిబ్బందితో సహా 86 మంది పాక్ దేశీయులు భారత్‌ను వీడారు. పాక్ నుంచి 1,465 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.


పాకిస్థాన్ జాతీయులు (Pakistanis) భారత్‌ను వీడేందుకు కేంద్రం గడువును పొడిగించింది. వాఘా-అట్టారి సరిహద్దు(Attari-Wagah border)లో పాకిస్థాన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

పహెల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో ఉంటున్న పాక్ జాతీయులందరిని వారి దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. భారత్ నుంచి పాక్‌కు వెళ్లే సింధూ జలాలను కూడా నిలిపేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఏప్రిల్ 27వ తేదీ తర్వాత భారత్ - పాక్ సరిహద్దును మూసి వేస్తామని గతంలో హోం మంత్రిత్వ శాఖ(Home Ministry) పేర్కొంది. వైద్య వీసాలున్న వారు 29లోగా వెళ్లాలని సూచించింది. ఆ తేదీలోగా చేరుకోని పాకిస్థానీయులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత ఊరట నిచ్చిందని చెప్పాలి.

కేంద్రం పెంచిన గడువుతో పంజాబ్‌లోని అట్టారి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి పాకిస్తానీయులను వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పటికే 55 మంది దౌత్యవేత్తలు, సహాయక సిబ్బందితో సహా 86 మంది పాకిస్తానీ జాతీయులు భారత్‌ను వీడారు. మరో 1,465 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

మెహబూబా విజ్ఞప్తి..

భారతీయులను వివాహం చేసుకున్న పాకిస్తానీ జాతీయుల విషయంలో పునరాలోచించాలని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti,) కేంద్రాన్ని కోరారు. "30-40 ఏళ్ల క్రితం భారత్ వచ్చి భారతీయ పౌరులను పెళ్లి చేసుకుని మహిళలను దేశం వీడాలని కోరడం బాధాకరం" అని ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేశారు.

Read More
Next Story