
తమ పౌరులను స్వదేశానికి తరలించే పనిలో ప్రపంచ దేశాలు..
ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధ నేపథ్యంలో చార్టర్, సైనిక విమానాలను ఉపయోగిస్తున్న దేశాలు..
ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో వందలాది విమానాలు రద్దు కావడంతో, అక్కడ చిక్కుకున్న పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, దక్షిణాసియా దేశాలు తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి చార్టర్ విమానాలు, సైనిక విమానాలను ఉపయోగిస్తున్నారు. ఒమాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా మార్గాల ద్వారా వారిని తీసుకువస్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం ఒమాన్ నుంచి వచ్చిన విమానంలో పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి తీసుకువచ్చింది. ఇప్పటివరకు సుమారు 4 లక్షల ఫ్రెంచ్ పౌరులు గల్ఫ్‌లో ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ తెలిపారు.
అమెరికా విదేశాంగ శాఖ 18,000 అమెరికన్ పౌరులను సురక్షితంగా తరలించిందని ప్రకటించింది. మెక్సికో, బ్రిటన్, ఐర్లాండ్, నార్వే ప్రభుత్వాలూ తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి చార్టర్, సైనిక విమానాలను ఉపయోగిస్తున్నారు.
చైనా పర్యాటకురాలు లీ కియన్ అబూదాబిలో చిక్కుకుపోయిన పరిస్థితిని వివరిస్తూ భయం వ్యక్తం చేసింది. “మేము వీలైనంత త్వరగా ఇంటికి చేరాలని మాత్రమే కోరుకుంటున్నాం,” అని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు అత్యవసరంగా తమ పౌరులను భద్రతా మార్గాల ద్వారా తీసుకురావడంలో నిమగ్నమయ్యాయి.

