హాంకాంగ్ మంటల్లో 44 మంది సజీవ దహనం
x

హాంకాంగ్ మంటల్లో 44 మంది సజీవ దహనం

ఎప్పుడూ రద్దీగా ఉండే హాంకాంగ్‌ ‘వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌’ ఆకాశహర్మ్యాల్లో బుధవారం రాత్రి చెలరేగిన మంటల్లో మరణించిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది.


హాంకాంగ్ మంటల్లో ఇప్పటికి 44 మంది సజీవ దహనం అయ్యారు. మరో 3 వందల మంది జాడ తెలియడం లేదు. ప్రపంచదేశాలు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే హాంకాంగ్‌ ‘వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌’ ఆకాశహర్మ్యాల్లో బుధవారం రాత్రి చెలరేగిన మంటల్లో మరణించిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. జనం హాహాకారాలతో ఆకాశహార్మ్యాలు మృత్యుభవనాలుగా మారాయి.
ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం 44 మంది సజీవదహనమయ్యారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన 37 ఏళ్ల ఒక అగ్నిమాపకదళ సభ్యుడు హోవాయ్‌హోహీ సైతం కాలినగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరో 3 వందల మంది జాడ గల్లంతైనట్టు సమాచారం. కేవలం 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం చెబుతున్నా పెద్దసంఖ్యలో జనం కాలినగాయాలతో స్థానిక ఆస్పత్రుల్లో చేరారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో దాదాపు ఆనుకుని మొత్తం 8 ఎత్తయిన భవనాలున్నాయి.
2,000 అపార్ట్‌మెంట్లలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్లాట్లు నిర్మాణదశలో ఉన్నాయి. మంటలు అంతటా వ్యాపించేలోపే 1,000 మందిని తరలించారు. మంటల్ని ఆర్పేందుకు వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, తమవారు ఏమయ్యారో తెలీక ఆందోళనతో వచ్చిన వందలాది మంది స్థానికులతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
అగ్నిమాపక దళాలకూ అంతుచిక్కని మంటలు..
బుధవారం సాయంత్రం సమయంలో భవనాల చుట్టూ ఉన్న ఆకుపచ్చని వస్త్రానికి తొలుత నిప్పు అంటుకున్నట్టు రాయిటర్ వార్తా సంస్థ కథనం. ఆ తర్వాత మంటలు పక్కనున్న నిర్మాణాలను అంటుకుని అంతటా వ్యాపించాయి. అగ్ని ప్రమాదం వార్త తెల్సి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్‌ సిబ్బంది, వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగారు. అత్యంత ఎత్తయిన వాటర్‌ కేనన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నంచేస్తున్నారు. ఎగసిపడుతూ చుట్టూతా వ్యాపించిన అగ్నికీలలు, దట్టంగా కమ్ముకున్న పొగ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఫైర్‌ఇంజిన్ల నిచ్చెనలు చేరుకోలేని ఎత్తులకు మంటలు వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. ఫ్లాట్లలో చిక్కుకున్న వారిలో వృద్దులే అధికంగా ఉన్నారని తైపో జిల్లా మండలి సభ్యుడు లో హీయూఫుంగ్‌ చెప్పారు. ‘అంత ఎత్తున మంటలు ఉండటంతో భవనాల లోపలికి వెళ్లడం సాధ్యపడట్లేదు. లోపల ఏం జరుగుతోందో ఊహించలేకపోతున్నాం’ అని ఫైర్‌ సర్వీసెస్‌ విభాగ డైరెక్టర్‌ ఆండీ యే యుంగ్‌ అశక్తత వ్యక్తంచేశారు.

హాంకాంగ్‌లో నిర్మాణరంగంలో వెదురు కర్రలను విరివిగా ఉపయోగిస్తారు. తాత్కాలిక మెట్లుగా, ఆవలివైపు గోడ నిర్మాణాల కోసం తాత్కాలిక సపోర్ట్‌ గోడగా వెదురు కర్రలను ఉపయోగిస్తారు. బుధవారం బుగ్గిపాలైన ఆకాశహర్మ్యం చుట్టూతా, నిట్టనిలువునా ఈ వెదురుకర్రలే దర్శనమిచ్చాయి. మంటలకు త్వరగా కాలిపోయే గుణమున్న ఈ కర్రల వాడకానికి తిలోదకాలు ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం చెప్పినా నిర్మాణరంగ సంస్థలు వినిపించుకోవట్లేవు. ప్రమాదం వార్త తెలిసి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Read More
Next Story