
భారత జెండా మోసే నౌకలు కూడా ఇక్కడికి రాకూడదు: పాకిస్తాన్
మనదేశ నౌకల ప్రవేశాన్ని నిషేధించిన దాయాదీ దేశం
భారత్, పాకిస్తాన్ నౌకలకు ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, దాయాదీ దేశం సైతం అలాంటి చర్యకే దిగింది. ఆ దేశంలోని పోర్టుల్లోకి భారత నౌకల ప్రవేశాన్ని అడ్డుకుంటోంది. తన దేశ ఓడరేవుల్లో భారత జెండా కనిపించే నౌకలు సైతం కనిపించకూడదని ఆంక్షలు విధించింది.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుడూ.. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్దంగా ఉందని మరోసారి స్ఫష్టమైన సందేశం ఇచ్చిన తరువాత మన దేశ అధికారులు వెంటనే పాకిస్తాన్ కు చెందిన నౌకల ప్రవేశాన్ని నిషేధించారు.
శనివారం నుంచి దాయదీ దేశం నుంచి వచ్చే అన్ని రకాల నౌకలను, రవాణా వస్తువులు మనదేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది.
భారత్ జెండా మోసేవారికి అనుమతి లేదు..
‘‘భారతీయ జెండా క్యారియర్ లు మోసే ఓ నౌక కూడా పాకిస్తాన్ ఓడరేవును సందర్శించడానికి అనుమతిలేదు’’ అని ఆ దేశం శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి పత్రిక డాన్ వార్తలు ప్రసారం చేసింది.
‘‘భారత్ తో ఇటీవల సముద్ర పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న దృష్ట్యా సముద్ర సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ భద్రతను కాపాడటానికి పాకిస్తాన్ ఈ క్రింది చర్యలను తక్షణమే అమలు చేస్తుంది.
భారత జెండా క్యారియర్ లను ఏ పాకిస్తాన్ ఓడరేవులోకి రావడానికి అనుమతి లేదు. పాకిస్తాన్ జెండా క్యారియర్ లు ఏ భారతీయ ఓడరేవుకు వెళ్లకూడదు. ఏదైనా మినహయింపులు కావాలంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది’’ అని వార్తా పత్రిక నివేదించింది.
పాకిస్తాన్ సముద్ర వ్యవహరాలు మంత్రిత్వ శాఖ ఓడరేవులు, షిప్పింగ్ విభాగం శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను డాన్ పత్రిక ఉటంకించింది.
పహల్గామ్ దాడి తరువాత నిషేధాలు..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరువాత సింధు నదీ ఒప్పందాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం, పాక్ విమానాలకు భారత ఎయిర్ స్పేస్ అనుమతి నిరాకరణ, వాణిజ్యం నిలిపివేత, నౌకలకు ప్రవేశం లేకుండా చేయడంతో పాటు ఇ మెయిల్స్, పార్శిళ్లను నిలిపివేసింది. జాతీయ భద్రతా, ప్రజా విధానం ఆధారంగా పాకిస్తాన్ నుంచి అన్ని వస్తువుల దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించారు.
పుల్వామా దాడి తరువాత పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం సుంకాలు విధించారు. అలాగే మూడో దేశం నుంచి పాక్ వెళ్లే భారతీయ వస్తువులపై కూడా ఇప్పుడు ప్రభుత్వం నిషేధం విధించింది.
సైన్యాన్ని సిద్దం చేసిన పాక్..
ఉగ్రవాద దాడి తరువాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టింది. అట్టారి వద్ద సరిహద్దును మూసివేసింది. అలాగే దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించేసింది.
ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అబ్దాలి క్షిపణులను పరీక్షించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం లోని లక్ష్యాలపై దాడులు చేయగలదు.
దళాల సన్నద్దతను నిర్ధారించడం, కీలకమైన సాంకేతిక పారామితులను ధృవీకరించుకోవడం లక్ష్యంగా పెట్టుకుందని పాక్ పేర్కొంది. ఈ పరీక్షను భారత్ రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించింది.
శ్రీలంకలో గాలింపులు..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న అనుమానితులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారనే అనుమానంతో అక్కడి విమానాశ్రయాన్ని మొత్తం దిగ్భంధనం చేసి గాలింపు చేపట్టారు.
అయితే అనుమానితులు ఎవరు కనిపించకపోవడంతో తరువాత యథావిధిగా కార్యకలాపాలు జరిగాయి. పహల్గామ్ మారణహోమంలో ఆరుగురు వ్యక్తులు పాలుపంచుకున్నారని, అందులో నలుగురు వ్యక్తులు హిందూ పర్యాటకులను కల్మా చదవలేని కారణంగా తుపాకీతో కాల్చి చంపారు.
ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు పాక్ జాతీయులు కాగా, అందులో ఒకరు పాకిస్తాన్ సైన్యంలోని స్పెషల్ ఫోర్స్ కు చెందిన సైనికుడిగా గుర్తించారు. వారి కోసం జమ్మూకాశ్మీర్ లో భారీగా సెర్చ్ ఆపరేషన్ జరగుతోంది.
Next Story