Donald Trump With his wife Melania
x
ట్రంప్ తో ఆయన భార్య మెలానియా

ట్రంప్ భార్యపై 'నీలి నీడలు', సెక్స్ ట్రాఫికర్ 'ఎప్‌స్టీన్' చిచ్చు‌!

ఎప్‌స్టీన్ లింక్‌ను ఖండించిన మెలానియా… మౌనం వీడి మీడియా ముందుకు..


ట్రంప్ పక్కనున్న ఈమె పేరు మెలానియా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య. అమెరికా ఫస్ట్ లేడీ. ఇప్పుడు ఈమె వస్తున్న ఆరోపణలు అమెరికా అంతటా సంచలనంగా మారాయి. ట్రంప్ కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉన్నాయి. ఈ తంటు పెట్టిన వ్యక్తి ఎవరో కాదు ట్రంప్ జీవిత చరిత్రరాస్తున్న జర్నలిస్టు. పేరు మైఖేల్ ఉల్ఫ్.
ప్రపంచ కుబేరుల సెక్స్ ఆరాటాన్ని తీర్చిన లైంగిక నేరగాడు, కక్కుర్తి సంపదకు మారుపేరుగా నిలిచి, మైనర్ బాలికల్ని తార్చిన నేరానికి శిక్ష పడి జైల్లోనే ఊరేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్ భార్య మెలానియాకు సంబంధాలు ఉన్నాయంటూ ఈ ఉల్ఫ్ చేసిన ఆరోపణ దావాలనంలా మారింది. ఇప్పుడది నిజం కాదని చెప్పుకోవాల్సిన అగత్యం మెలానియాకు వచ్చింది. మన రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే "నీ తాట తీస్తా", 'నిన్ను కోర్టుకీడుస్తా', చట్టం ముందు నిలబెడతానంటూ ఆమె నిన్న రాత్రి ఘాటుగా స్పందించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె నిప్పులు చెరిగారు.
అసలేమిటీ వివాదం..?
డొనాల్డ్ ట్రంప్ జీవితంపై పుస్తకం రాస్తున్న రచయిత మైఖెల్ ఉల్ఫ్ చెప్పిన మాటలు కొన్ని మెలానియా బతుకును బజారుపాల్జేసేలా ఉన్నాయి. ఆమె గతంలో మోడల్. అప్పుడు ఆమెకో ఏజెంట్ ఉండేది. ఆ ఏజెంట్ కి జెఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధాలు ఉన్నాయి. ఒక పెద్ద వింధులో మెలానియాను ట్రంప్‌నకు పరిచయం చేసింది ఎప్‌స్టీనేనని ఉల్ఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై మెలానియా స్పందిస్తూ.. "నన్ను ఎప్‌స్టీన్‌తో ముడిపెడుతూ చేస్తున్న అసత్య ప్రచారం వెంటనే ఆపాలి. నాపై దుష్ప్రచారం చేసే వ్యక్తులు నైతిక విలువలు లేనివారు. వారి అజ్ఞానాన్ని నేను కాదనను కానీ నా ప్రతిష్టను దెబ్బతీయాలనే వారి దురుద్దేశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను" అన్నారు. 8,500 కోట్ల రూపాయల నష్టపరిహారానికి నోటీసులు పంపారు.
ప్రస్తుతం ఈ పరిణామాలు అటు వైట్ హౌస్‌లోనూ, ఇటు అంతర్జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) మధ్య ఏదో సంబంధం ఉందంటూ సాగుతున్న ప్రచారం ఇప్పుడు అమెరికాలో పెను సంచలనంగా మారింది.
మైఖెల్ ఉల్ఫ్ ఈ ఆరోపణలు ఎందుకు చేసినట్టు?
మైఖేల్ ఉల్ఫ్ ప్రముఖ రచయిత. చాలా పుస్తకాలు రాశారు. జర్నలిస్టు కూడా. డొనాల్డ్ ట్రంప్ జీవితంపై గతంలో Fire and Fury వంటి పుస్తకాలు రాశారు. ఆయన మెలానియా పేరును ఈ వివాదంలోకి లాగడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి.
వోల్ఫ్ చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. 1990లలో మెలానియా ఒక మోడల్‌గా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, ఆమెను డొనాల్డ్ ట్రంప్‌నకు పరిచయం చేసింది జెఫ్రీ ఎప్‌స్టీనేనని. ఎప్‌స్టీన్ నడిపిన 'సోషల్ సర్కిల్'లో మెలానియా కూడా భాగమని, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం పరిచయస్థుల స్థాయి కంటే ఎక్కువేనని మైఖేల్ ఉల్ఫ్ వాదించారు.
సాక్ష్యాల వేట..
మెలానియా ట్రంప్ తనపై 8,500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడంతో ఉల్ఫ్ సాక్ష్యాల వేటలో పడ్డారు. ఆయన ఉద్దేశం ప్రకారం.. ఒకవేళ ఈ కేసు కోర్టుకు వెళ్తే, 'వాస్తవాన్ని వెలికితీసే' ప్రక్రియలో భాగంగా ట్రంప్, మెలానియాతో ప్రమాణం చేయించి (Under Oath) విచారించే అవకాశం వస్తుంది.
ఎప్‌స్టీన్‌తో ట్రంప్ కుటుంబానికి ఉన్న అసలైన సంబంధాలను బయటకు తీయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఉల్ఫ్ భావిస్తున్నారు. అందుకే ఆయన తన ఆరోపణల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మెలానియా పేరును ప్రస్తావిస్తున్నారు.
'లింక్' ఎస్టాబ్లిష్ చేయడం ఎలా...
ఉల్ఫ్ తన విశ్లేషణలో మెలానియా మోడలింగ్ ఏజెంట్ అయిన పాలో జాంపొల్లి (Paolo Zampolli) పేరును కూడా ప్రస్తావించారు. జాంపొల్లికి ఎప్‌స్టీన్, అతని భాగస్వామి గిస్లేన్ మాక్స్‌వెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ 'లింక్' ఆధారంగానే మెలానియాకు కూడా ఎప్‌స్టీన్ ముఠాతో సంబంధాలు ఉండవచ్చని ఉల్ఫ్ తన పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లలో చెబుతూ వస్తున్నారు.
మెలానియా ఏమన్నారంటే..
ఈ ఆరోపణలు కేవలం పుకార్ల స్థాయిని దాటి, ఆమె పరువుకు నష్టం కలిగించేలా మారాయి. అందుకే ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌ను తాను తొలిసారి న్యూయార్క్‌లోని 'కిట్‌కాట్ క్లబ్'లో కలుసుకున్నానని, అంతకు మించి వస్తున్న కథనాలన్నీ కల్పితాలని మెలానియా వివరించారు.
2026 జనవరి, ఫిబ్రవరిలో అమెరికా న్యాయశాఖ సుమారు 35 లక్షల పేజీలను 'ఎప్‌స్టీన్ ఫైల్స్'ను పేరిట బయటపెట్టింది. ఈ పత్రాల్లో కొన్ని చోట్ల ట్రంప్ పేరు ఉంది. ఓ మహిళైతే తాను మైనర్‌గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగిక దాడికి ప్రయత్నించారని ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసినట్టు ఉంది. ఈ పత్రాల్లో ఎక్కడైనా తన పేరు కూడా ఉందేమోనన్న అనుమానాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో మెలానియా క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
తాను ట్రంప్‌ను 1998లో కిట్‌కాట్ క్లబ్‌లో జరిగిన ఒక పార్టీలో కలిశానని, అది యాదృచ్ఛికంగా జరిగిందని ఆమె చెప్పారు. ఎప్‌స్టీన్ ద్వారా పరిచయం జరిగిందన్నది పచ్చి అబద్ధమన్నారు.
ఎప్‌స్టీన్ లేదా ఆయన ప్రియురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌ (ఇప్పుడు ఈమె జైల్లో ఉన్నారు) తో తనకు ఎలాంటి స్నేహసంబంధాలు లేవని, కేవలం సామాజిక కార్యక్రమాల్లో మాత్రమే వారిని చూశానని పేర్కొన్నారు.

జెఫ్రీ ఎప్స్టీన్

ఈ ఆరోపణలను కేవలం రాజకీయ ప్రేరేపితమైనవిగా, డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలుగా కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ ఎప్‌స్టీన్ ప్రైవేట్ విమానంలో ప్రయాణించలేదని, అతని ప్రైవేట్ ద్వీపానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. మైఖేల్ ఉల్ఫ్ వంటి వారు తన ప్రతిష్టను దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
ట్రంప్‌పై పెరుగుతున్న ఒత్తిడి
మరోవైపు, జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో భాగంగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎఫ్‌బీఐ (FBI) పత్రాలు అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. 2019 నాటి దర్యాప్తు రికార్డుల ప్రకారం.. ఎప్‌స్టీన్ ద్వారా పరిచయమైన ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి ప్రయత్నించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటన సమయంలో తాను ట్రంప్‌ను గాయపరిచి తప్పించుకున్నానని ఆ మహిళ అధికారులకు వివరించారు. ఈ విషయాన్ని దాచిపెట్టాలని తనపై, తన కుటుంబంపై బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె పేర్కొనడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాజకీయ కోణం...
ఈ వ్యవహారం అమెరికాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కి ఉంది. ట్రంప్ పరిపాలనపై ప్రతిపక్షాలు ఈ ఎప్‌స్టీన్ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ వివాదం ట్రంప్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే కాకుండా, ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉంది. ట్రంప్ గతానికి సంబంధించిన చీకటి కోణాలను (ఎప్‌స్టీన్ సంబంధాలను) బయటపెట్టే క్రమంలో, మెలానియాను ఒక 'కీలక సాక్షి'గా లేదా 'పావు'గా ఉల్ఫ్ భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదంపై అమెరికాలో అటు న్యాయపరమైన విచారణలు, ఇటు రాజకీయ దర్యాప్తు సంస్థల కార్యకలాపాలు మహా వేగంగా జరుగుతున్నాయి.
కాంగ్రెస్ కమిటీ విచారణ..
అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) లోని హౌస్ ఓవర్ సైట్ కమిటీ (House Oversight Committee) ఈ ఎప్‌స్టీన్ వ్యవహారంపై విస్తృత స్థాయి విచారణ చేపట్టింది. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న పలువురు ప్రముఖులను, మాజీ అధికారులను కమిటీ ఇప్పటికే విచారించింది.
మెలానియా ట్రంప్ తన ప్రకటనలో మరో కీలక డిమాండ్ చేశారు. ఎప్‌స్టీన్ బాధితులకు బహిరంగ విచారణ (Public Hearing) జరిపి, వారి వాంగ్మూలాలను రికార్డు చేయాలని కోరారు. దీనివల్ల నిందితులెవరో, బాధితులెవరో స్పష్టంగా తెలుస్తుందని ఆమె వాదిస్తున్నారు.
ప్రస్తుతానికి మెలానియా ట్రంప్‌పై ఎలాంటి క్రిమినల్ విచారణ జరగడం లేదు. కానీ, ఆమె వేసిన పరువు నష్టం కేసు ద్వారా ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల గురించి మరిన్ని వివరాలు కోర్టు రికార్డుల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
Read More
Next Story