
ట్రంప్, తాను తొవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డాడా?
ట్రంప్ తొవ్వుకున్న గొయ్యి ఏమిటో ఇప్పుడు ప్రపంచానికి కనిపిస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి ఎప్పుడూ రెండంచుల ఖడ్గం లాంటిదే. ఆయన అనుసరించిన 'అమెరికా ఫస్ట్' విధానం ఒకప్పుడు ఆయనకు తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో మాత్రం ఆయన బోల్తా పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆయన "తాను తవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డాడా?" అనే సందేహం కలగక మానదు.
అమెరికా రక్షణ, నిఘా రంగాలలో అత్యంత అనుభవజ్ఞులైన జాన్ బ్రెన్నన్, లియోన్ పనెట్టా వంటి దిగ్గజాల విశ్లేషణలను బట్టి ఈ 'బూమరాంగ్' ఎఫెక్ట్‌ను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి.
వ్యూహమే ఇప్పుడు సంకెళ్లు...
ట్రంప్ తన హయాంలో అంతర్జాతీయ ఒప్పందాల నుండి వైదొలగడం, ప్రత్యర్థి దేశాలపై విరుచుకుపడటం వంటివి ఒక "స్ట్రాంగ్ లీడర్" ఇమేజ్‌ను ఇచ్చాయి. కానీ, జాన్ బ్రెన్నన్ అన్నట్లు, ప్రపంచ సమస్యలు అంత సులభమైనవి కావు. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలను కేవలం "వ్యాపార లావాదేవీలు"గా చూడటం వల్ల దీర్ఘకాలిక నష్టం వాటిల్లిందని బ్రెన్నన్ విశ్లేషణ. నాడు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడు అమెరికాను అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేస్తున్నాయి.
ఇరాన్ పై అంచనా తప్పిందా?
లియోన్ పనెట్టా విశ్లేషణ ప్రకారం, ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమెరికాకు పెను సవాలుగా మారాయి. ఇరాన్ ప్రతిస్పందనను, వారి పట్టుదలను ట్రంప్ తక్కువ అంచనా వేశారని పనెట్టా భావిస్తున్నారు. యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆశించినా, అది ముగింపు లేని పోరాటంగా మారింది.
హర్మూజ్ జలసంధి ముప్పు...
ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల గ్లోబల్ ఎకానమీ షాక్‌కు గురవుతోంది. షిప్పింగ్ ఖర్చులు కోట్లలో పెరగడం సామాన్యుడిపై భారం పడేలా చేస్తోంది. ఇది "ముందే తెలిసినా రిస్క్ చేయడం" ప్లాన్ లో ఉన్న పెద్ద లోపమని పనెట్టా ఎత్తిచూపారు.
నాటోతో దూరం.. ఇప్పుడు ఒంటరితనం
ట్రంప్ గతంలో నాటో (NATO) మిత్రదేశాలను "పేపర్ టైగర్" అని ఎద్దేవా చేయడం, వారి రక్షణ బాధ్యతలపై కఠినంగా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకే ప్రతిబంధకంగా మారింది. అమెరికాకు అత్యంత అవసరమైన సమయంలో, పాత మిత్రులు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం గమనార్హం.
మిత్రదేశాలను దూరం చేసుకోవడం వల్ల ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో అమెరికా తనంతట తానుగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ట్రంప్ స్వయంకృతాపరాధమేనని విశ్లేషకుల వాదన.
ప్రస్తుత ట్రంప్ పరిస్థితిని పనెట్టా ఒక క్లిష్టమైన చిక్కుముడిగా అభివర్ణించారు. యుద్ధాన్ని ఇప్పుడు ఆపితే అది ట్రంప్ వైఫల్యంగా ముద్రపడుతుంది, ఆయన 'బలమైన నాయకుడు' అనే ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకు ట్రంప్ సిద్ధంగా లేరు.
యుద్ధం కొనసాగిస్తే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరి తడిసి మోపెడయ్యేలా ఉంది. అమెరికా ప్రజల్లో అసహనం పెరుగుతుంది. తద్వారా ఆయనతో పాటు ఆయన పార్టీ రిపబ్లికన్ల హవా తగ్గే ప్రమాదం ఉంది.
ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తవ్వుకున్న వ్యూహాల గొయ్యి, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మింగేస్తోంది. అగ్రెసివ్ రాజకీయాలు స్వల్పకాలిక విజయాలను ఇచ్చినా, అంతర్జాతీయ సంబంధాలలో అవి ఎంతటి ప్రమాదకరమో ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. పనెట్టా, బ్రెన్నన్ చెప్పినట్లు.. ఆ గొయ్యిలో ట్రంప్ పూర్తిగా పడ్డారా లేదా అన్నది పక్కన పెడితే, ఆ గొయ్యిలో అమెరికా ప్రయోజనాలు మాత్రం ప్రమాదంలో పడ్డాయి.
Next Story

