
ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఇండియా, 'శాంతి' భేటీకి దూరం!
అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు బెడిసినట్టేనా? కాశ్మీర్ సమస్యను తెర పైకి తెచ్చినందుకా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఇండియా షాక్ ఇచ్చింది. దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో జరిగిన "బోర్డ్ ఆఫ్ పీస్" (BoP) చార్టర్ ప్రకటన కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానంపై ప్రభుత్వం ఇంకా తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నా, గురువారం జరిగిన ఈ సమావేశానికి హాజరుకాకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఏమిటీ బోర్డ్ ఆఫ్ పీస్?
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'గాజా శాంతి ప్రతిపాదన - ఫేజ్ 2'లో భాగంగా ఈ బోర్డు ఏర్పాటైంది. గాజాలో భద్రత, మానవతా సాయం, పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.
2023 అక్టోబర్ లో హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇటీవల కాల్పుల విరమణ కుదిరి బందీలందరూ విడుదలవడంతో, ఈ శాంతి ప్రణాళికను ఐక్యరాజ్య సమితీ(ఐరాస) భద్రతా మండలి కూడా ఆమోదించింది.
భారత్ ఎందుకు తర్జన భర్జన పడుతోంది?
బోర్డులో చేరడానికి భారత్‌కు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.
పాలస్తీనాకు భారత్ ఎప్పుడూ సూత్రబద్ధమైన మద్దతుదారు. బాధితులకు నేరుగా సాయం చేయడానికి ఇది ఒక అవకాశం
UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలు ఇప్పటికే ఇందులో చేరాయి.
అమెరికాతో సంబంధాల్లో ఉన్న ఒత్తిడి దృష్ట్యా, ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఆయన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆందోళన ఉంది.
అభ్యంతరాలు ఎక్కడ ఉన్నాయి?
భారత్ వంటి దేశం కేవలం భయంతోనో, హడావిడిగానో నిర్ణయాలు తీసుకోదు. ఈ బోర్డు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి.లీక్ అయిన సమాచారం ప్రకారం, ట్రంప్ ఈ బోర్డుకు తనను తాను ఛైర్మన్‌గా నియమించుకున్నారు. బోర్డులో తన కుటుంబ సభ్యులకు చోటు కల్పించారు. ఇది ఐరాసకు ప్రత్యామ్నాయంగా మారుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పాలస్తీనాకు ప్రాతినిధ్యం లేదు. ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చోటు ఉంది కానీ, పాలస్తీనా నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది అన్యాయమని భారత్ భావిస్తోంది.
కాశ్మీర్ భయం: ఈ బోర్డులో పాకిస్థాన్ చేరడం భారత్‌కు పెద్ద రెడ్-ఫ్లాగ్. రేపు కాశ్మీర్ సమస్యను కూడా ట్రంప్ ఈ బోర్డు పరిధిలోకి తెస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.
సభ్యత్వ రుసుం: కేవలం సభ్యత్వం కోసం ఒక బిలియన్ డాలర్ల ఫీజు అడగడం, ఐరాసతో సంబంధం లేని సైనిక చర్యలకు (ISF) దళాలను పంపాల్సి రావడం భారత్‌కు ఇబ్బందికరమైన అంశాలు. చివరికి, ఈ బోర్డులో చేరడం వల్ల భారత్ కేవలం ట్రంప్ నిర్ణయాలకు 'రబ్బర్ స్టాంప్'గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతూ, తన సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని న్యూఢిల్లీ భావిస్తోంది.

