మదురో కిడ్నాప్ వెనుక మచాడో ?  ట్రంప్ తో చేతులు కలిపిన క్రేజీ ఉమెన్
x

మదురో కిడ్నాప్ వెనుక మచాడో ? ట్రంప్ తో చేతులు కలిపిన 'క్రేజీ ఉమెన్'

సీపీఐ శత వార్షికోత్సవ సభకు వచ్చిన వెనెజువెలా పార్టీ నేత రోడ్రిగ్జ్ తో మాటామంతి


"వెనెజువెలా.. మా దేశాన్ని, మా అధ్యక్షుడు మదురోను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అందుకు ఎందాకైనా వెళతాం, పోరాడతాం. అధ్యక్షుణ్ణి వెనక్కుతెచ్చుకుంటాం" అని దీమా వ్యక్తం చేస్తున్నారు ఆ దేశ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా (PSUV) సభ్యుడు, ఆ పార్టీ విదేశీ వ్యవహారాలు చూసే కపాయ రోడ్రిగ్జ్ (Capaya Rodriguez). తమది సార్వభౌమాధికార దేశమని, అటువంటి దేశంపై మరో దేశం దాడిని ప్రపంచ దేశాలేవీ అంగీకరించవన్నారు. ప్రస్తుతం అమెరికా బందీగా ఉన్న వెనెజువెలా అధ్యక్షుడు మదురోను తిరిగి స్వదేశానికి కచ్చితంగా తెచ్చుకుంటామన్నారు.
2026, జనవరి 3వ తేదీ శనివారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన 'డెల్టా ఫోర్స్' (Delta Force) వెనెజువెలా రాజధాని కారకాస్‌లోని అధ్యక్షుడు మదురో నివాసంపై బాంబుల వర్షం కురిపించి ఆయనతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వెనెజువెలా నుంచి విమానంలో తరలించి, న్యూయార్క్ కోర్టులో హాజరుపరిచారు. మదురో డ్రగ్స్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని, అమెరికాలోకి కొకైన్ సరఫరా చేస్తున్నారని అమెరికా ఆరోపించింది.

ఖమ్మంలో విదేశీ సౌహార్త్ర ప్రతినిధులకు సీపీఐ నేతల స్వాగతం

ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణలోని ఖమ్మం నగరంలో ఆదివారం (జనవరి 18న) జరిగిన మహాప్రదర్శన, బహిరంగ సభలో సౌహార్ద్ర సందేశాన్ని ఇచ్చేందుకు PSUV తరఫు కపాయ రోడ్రిగ్జ్ (Capaya Rodriguez) హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను 'ది ఫెడరల్ ప్రతినిధి' పలకరించారు. ప్రస్తుత సంక్షుభిత సమయంలో తాను ఏమీ మాట్లాడకూడదంటూనే కొన్ని ప్రశ్నలకు రోడ్రిగ్జ్ చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే..

ఇంటర్వ్యూ చేస్తున్న ది ఫెడరల్ ప్రతినిధితో..

మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే...
ప్రస్తుతం వెనెజువెలా ప్రపంచ దేశాల నోళ్లలో నానుతున్న మాట నిజం. మావైపు నిలిచి మాకు మద్దతు ఇస్తున్న అంతర్జాతీయ సమాజానికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. వెనెజువెలా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను అమెరికా అక్రమంగా బంధించి తీసుకెళ్లింది. మా దేశ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తి మదురో. ఆయన్ని అపహరించుకుపోవడం అంటే మా హక్కుల్ని ఉల్లంఘించడమే. అమెరికా చేసిన పనిని వెనెజులా ప్రజలు తమ దేశంపై దాడిగానే భావిస్తున్నారు.
దీన్ని అంగీకరించబోమని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మదురోను తిరిగి రప్పించుకుంటాం..
అమెరికా అక్రమంగా బంధించిన మా అధ్యక్షుడు మదురో కోసం మా పార్టీ ఐదుగురు ప్రముఖుల్ని నియమించింది. అందుకు ఇప్పుడున్న తాత్కాలిక అధ్యక్షుడు కూడా అంగీకరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరేమీ మాట్లాడవద్దన్న నిబంధన ఉంది. అందువల్ల మీకు మరిన్ని వివరాలు చెప్పలేను. ఏమైనప్పటికీ మా అధ్యక్షుడు మదురోను తిరిగి స్వదేశానికి రప్పించుకుంటాం.
మదురో చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే..
నికోలస్ మదురో పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలే. తప్పుడు ఆరోపణలే. మా అధ్యక్షుడు మదురోకి డ్రగ్స్ రవాణాకి సంబంధం లేదు. అవన్నీ ఫాల్స్. మమ్మల్ని నాశనం చేస్తామనే బెదిరింపులకు మా దేశ ప్రజలు లొంగరు. మా గత చరిత్ర అలాంటిది. మా ప్రజలందరూ మదురో వైపే ఉన్నారు.

సీపీఐ సభలో మెమొంటో అందుకుంటున్న చిత్రం..

మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ..
మా భవిష్యత్ కోసం మేము పోరాడడమే. మా భవిష్యత్ ను మేము నిర్ణయించుకుంటాం. అందుకోసం కృషి జరుగుతోంది. చూద్దాం.. ఏమి జరుగుతుందో..
ప్రతిపక్షనేత కొరినా మచాడో గురించి...
ఆమె పేరు ఎత్తినప్పుడు ఆయన చిరాకు పడుతూనే... She is a crazy women. (ఆమె ఓ తిక్క మనిషి).. కొరినా మచాడో సామ్రాజ్యవాదానికి ప్రతినిధి. నోబెల్ పీస్ ప్రైజ్ ఆమెకు అందుకే ఇచ్చారు. ఆమెకు వచ్చిన నోబెల్ బహుమతి శాంతి కోసం కృషి చేసినందుకు కాదు.. సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నందుకు ఇచ్చారు.. మదురోను అపహరించుకుపోవడం వెనుక ఆమె హస్తం కూడా ఉందని మా అనుమానం.

సభా వేదికపై కుడి నుంచి మూడో వ్యక్తి

అందుకే ఆమె ఇటీవల అమెరికా అధ్యక్షుడిని కలిశారు. (వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (Maria Corina Machado) అమెరికా వెళ్లి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడం, తన నోబెల్ శాంతి బహుమతిని ఆయనకు ఇవ్వడం, అది చెల్లదని నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించడం తెలిసిందే) వెనెజువెలా అధ్యక్షుడు మదురోను తిరిగి క్షేమంగా దేశానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అని ముగించారు కపాయ రోడ్రిగ్జ్ (Capaya Rodriguez).
Read More
Next Story