
ఇరాన్-అమెరికా యుద్ధం 14వ రోజుకు చేరింది!
'రక్తానికి రక్తం, దెబ్బకు దెబ్బ' ఇరాన్
మా నెత్తురు కళ్లచూసిన వారిని వదలబోమన్న కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అమెరికా స్థావరాలను ఖాళీ చేయాలని హుకుం..
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లో మొజ్తాబా ఖమేనీ అమెరికాను ఘాటుగానే హెచ్చరించారు. ఈ హెచ్చరిక అమెరికాతో పాటు ఆ దేశ సైనిక అవసరాలకు ఆశ్రయం ఇచ్చిన ఇరుగుపొరుగు దేశాలకూ వర్తిస్తుందన్నారు. యుద్ధం 14వ రోజుకు చేరింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఎగిసిపడుతున్నాయి.
ఇరాన్ సుప్రీంకమాండర్ అయతుల్లా అలీ ఖమేనీని ఫిబ్రవరి 28న అమెరికా హత్య చేసిన తర్వాత, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ (56) మార్చి 12, 2026న తన మొదటి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇరాన్ చుట్టుపక్కల దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను తక్షణమే మూసివేయాలని హెచ్చరించారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే, ఈ ప్రకటనను స్టేట్ టెలివిజన్ ప్రెజెంటర్ చదివి వినిపించడం, మొజ్తబా స్వయంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయంగా సందిగ్ధత నెలకొంది.
ప్రతీకార జ్వాల - అమెరికాకు అల్టిమేటం
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తండ్రిని కోల్పోయిన మొజ్తబా, ఈ యుద్ధాన్ని ప్రతీకార పోరాటంగా అభివర్ణించారు. తొలిరోజు జరిగిన క్షిపణుల దాడిలో ఆయన తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీతో పాటు తల్లిని, మరికొందరు కుటుంబ సభ్యులను కోల్పోయారు. మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కుడి భుజానికి పెద్ద దెబ్బే తగిలినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
సైనిక స్థావరాల మూసివేత: గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక బేస్‌లను వెంటనే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో స్నేహాన్ని ఆకాంక్షిస్తున్నప్పటికీ, వారి భూభాగాల్లోని అమెరికా బేస్‌లు తమ దాడుల నుంచి తప్పించుకోలేవని హెచ్చరించారు.
ఆస్తుల విధ్వంసం: యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి, తల్లి, ఇరాన్ పౌరుల రక్తానికి బదులుగా శత్రువుల ఆస్తులను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బంద్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను మూసివేత కొనసాగుతుందని మొజ్తబా ప్రకటించారు. "ఇది శత్రువుల గొంతు నొక్కే ఆయుధం. మాపై ఒత్తిడి పెరిగితే ప్రపంచానికి చమురు సరఫరా నిలిచిపోతుంది," అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $100 మార్కును దాటడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త ఫ్రంట్‌లకు సిద్ధం
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC)తో పాటు హిజ్బుల్లా, హౌతీలు, ఇరాకీ రెసిస్టెన్స్ గ్రూపులను మొజ్తబా ప్రశంసించారు. అవసరమైతే కొత్త యుద్ధ క్షేత్రాలను (New Fronts) తెరవడానికి ఇరాన్ వెనుకాడదని ఆయన తేల్చి చెప్పారు.
మొజ్తబా ఎక్కడ? మిస్టరీగా మారిన ఆరోగ్యం
మార్చి 8న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తబాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ, ఆయన ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. గత నెలలో జరిగిన దాడుల్లో ఆయన గాయపడ్డారా? లేదా కోమాలో ఉన్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాతపూర్వక సందేశం విడుదల చేయడం ఇరాన్ అంతర్గత పరిస్థితులపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
మొత్తానికి, మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటనతోనే తను ఒక 'హార్డ్‌లైనర్' అని నిరూపించుకున్నారు. ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనన్న భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది.
Next Story

