హోర్ముజ్ మూసివేతతో ఇంధన సంక్షోభం..
x

హోర్ముజ్ మూసివేతతో ఇంధన సంక్షోభం..

రష్యా చమురుకు ఆసియా దేశాల పోటీ..


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు సరఫరాకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆసియా దేశాలకు ఇది భారీ దెబ్బ. ఈ పరిస్థితుల్లో రష్యా ముడి చమురు కోసం ఆసియా దేశాలు పరస్పరం పోటీ పడుతున్నాయి.

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణ ఐదు వారాలు దాటినా, ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి దీర్ఘకాలం మూతపడితే, దాని ప్రభావం ఆసియాపై ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఆసియా దేశాలు ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్యం(Middle East)పై ఆధారపడుతుంటాయి. ఇప్పుడు సరఫరా మార్గాలను మూసివేయడంతో, ప్రత్యామ్నాయం కోసం దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ముడి చమురు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది.

ఇటు ప్రపంచ చమురు సరఫరాలను నిలబెట్టేందుకు అమెరికా ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రష్యా చమురు రవాణాలపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. మొదట భారతదేశానికి ఈ మినహాయింపు ఇవ్వగా, తరువాత ఇతర దేశాలకు కూడా వర్తింపజేసింది. దీంతో ఆసియా దేశాల్లో రష్యా చమురుపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే రష్యా సరఫరా సామర్థ్యం పరిమితంగానే ఉంది. మాస్కో ఇప్పటికే గరిష్టంగానే ఎగుమతులు చేస్తోందని నిపుణుల అంటున్నారు. దీంతో అదనపు సరఫరాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

మరోవైపు ఉద్రిక్తతలు తగ్గినా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత విధించిన ఆంక్షలు, అలాగే ఉక్రెయిన్ దాడులు రష్యా ఇంధన మౌలిక వసతులను దెబ్బతీశాయి. దీని వల్ల ఎగుమతులపై మరింత ఒత్తిడి పడుతోంది.

ఆసియాలోని అనేక దేశాలు ఇప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉన్నాయి. యుద్ధానికి ముందు చైనా, భారతదేశం, టర్కీ వంటి దేశాలు రష్యా చమురును తక్కువ ధరలకు కొనుగోలు చేసేవి. కానీ ఇప్పుడు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ పోటీలోకి దిగాయి.

ఫిలిప్పీన్స్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఆ దేశం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. గ్యాస్ స్టేషన్ల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. రవాణా రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. విమానయాన సంస్థలు కూడా ఇంధన వినియోగంపై పరిమితులు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఫిలిప్పీన్స్ గతంలో దాదాపు మొత్తం చమురు అవసరాలను మధ్యప్రాచ్యం (Middle East)పైనే ఆధారపడింది. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో, ఐదేళ్ల తర్వాత తొలిసారిగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. ఇతర దేశాలు కూడా ఈ తరహా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

వియత్నాంలో పెరుగుతోన్న డీజిల్ ధరలు తయారీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం రష్యాతో ఇంధన, అణుశక్తి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండోనేషియా కూడా కొత్త భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తోంది.

ఇక థాయ్‌లాండ్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. డీజిల్ ధరలు భారీగా పెరగడం వల్ల రవాణా, పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. దీని ప్రభావం ఇతర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంది.

ఈ మొత్తం పరిస్థితిలో చైనా, భారతదేశం కొంత ముందంజలో ఉన్నాయి. ఆంక్షల సడలింపు ముందుగానే రావడంతో ఈ రెండు దేశాలు పెద్ద మొత్తంలో రష్యా చమురును కొనుగోలు చేశాయి. అయితే, లోటును పూర్తిగా భర్తీ చేయడం వీటికీ కష్టంగా మారుతోంది.

భారతదేశం రోజుకు 5.5 నుంచి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరం ఉంటుంది. ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతులు పెరిగినా, అది సరిపోకపోవచ్చు. వేసవి కాలంలో డిమాండ్ మరింత పెరగనుంది. నిల్వలు తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

చైనాకు మాత్రం భారీ నిల్వలు ఉండటం ఒక ప్రయోజనం. సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉండటంతో, తాత్కాలిక సంక్షోభాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది. దీనివల్ల ఇతర దేశాల కంటే చైనా కొంత భద్రంగా ఉంది.

మొత్తంగా, ఈ ఇంధన సంక్షోభం ప్రపంచ భౌగోళిక రాజకీయాల అనిశ్చితిని మరోసారి గుర్తు చేస్తోంది. సరఫరా భద్రత ఇప్పుడు దేశాల ప్రధాన ప్రాధాన్యతగా మారింది. రష్యా చమురు కోసం పెరుగుతున్న పోటీ, భవిష్యత్తులో ఇంధన మార్కెట్లలో మరింత అనిశ్చితిని తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More
Next Story