ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు బయల్దేరిన ఆంధ్రా అల్లుడు!
x
యుద్ధం 26వ రోజుకు చేరింది, పాకిస్తాన్ లో రాయబారం మొదలైంది..

ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు బయల్దేరిన 'ఆంధ్రా అల్లుడు'!

పాకిస్తాన్ వేదికగా రాయబారం, చర్చల్లో జేడీ వాన్స్


ఇరాన్–అమెరికా యుద్ధం 26వ రోజుకు చేరుకుంది. అమెరికా వెనక్కితగ్గి రాయబారానికి దిగింది. ఇరాన్ మరోవైపు విజృంభించి బాంబు దాడులు చేస్తోంది. కువైట్ విమానాశ్రయంపై గురిపెట్టి బాంబు దాడులు చేసినట్టు సమాచారం అందింది. యుద్ధభూమిలో బాంబుల మోత ఆగకపోయినా… తెరవెనుక శాంతి చర్చలు వేగం పుంజుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స (Vance) పాత్ర పెరగడం… భారతీయ కోణంలోనూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
‘ఆంధ్రా అల్లుడు’గా జేడీ వాన్స్ కీలక పాత్ర..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ధృవీకరించిన ప్రకారం… ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో JD Vance, విదేశాంగ మంత్రి Marco Rubio కీలక పాత్ర పోషిస్తున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మూలాలు కలిగి ఉండటంతో… “ఆంధ్రా అల్లుడు” అనే కోణం ఇప్పుడు ఈ అంతర్జాతీయ వ్యవహారానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల భారత్ పర్యటనలో కుటుంబ సభ్యులతో ఆయన కలిసిన ఘటన కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.

ఉషా చిలుకూరి అమెరికాలోనే జన్మించినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు భారతదేశానికి చెందినవి. ఉషా వాన్స్ తల్లిదండ్రులు భారతీయులు. ఈ నేపథ్యం వల్లే జేడీ వాన్స్‌ను భారతీయ మీడియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో “ఆంధ్రా అల్లుడు” అని పిలుస్తున్నారు. ఉషా వాన్స్ ఓ మామూలు కుటుంబం నుంచి వచ్చిన అత్యున్నత విద్యావంతురాలు. అమెరికా న్యాయ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి.
ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇరాన్ వర్గాలు కూడా ట్రంప్‌కు అత్యంత సన్నిహితులైన Jared Kushner లేదా ప్రత్యేక రాయబారి Steve Witkoff కంటే… JD Vanceతో చర్చలు జరపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా వాన్స్ ముందుకు వస్తారన్న నమ్మకం ఇరాన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇస్లామాబాద్ వేదికగా రహస్య చర్చలు
ప్రస్తుతం ఈ చర్చలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ప్రధాన వేదికగా మారగా… పాకిస్థాన్ ప్రధాని Shehbaz Sharif, ఆర్మీ చీఫ్ Asim Munir మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా మెసెంజర్లుగా వ్యవహరిస్తున్నాయి. గతంలో మస్కట్, జెనీవా వంటి వేదికలపై జరిగిన చర్చలకు ఇది కొనసాగింపుగా భావిస్తున్నారు.

అమెరికా ఇప్పటికే 15 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం వైట్ హౌస్ ఎదురు చూస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే… JD Vance స్వయంగా ఇస్లామాబాద్ వెళ్లి ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు… హర్మూజ్ సంకేతాలు
ఈ నేపథ్యంలో Trump చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇరాన్ నుంచి “ఒక పెద్ద బహుమతి” అందిందని, అది చమురు-గ్యాస్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. ఇది ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గురించే కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయబోదని అంగీకరించిందని కూడా ట్రంప్ తెలిపారు.
చర్చల మధ్యలోనే యుద్ధం...
ఒకవైపు చర్చలు జరుగుతుండగా… మరోవైపు యుద్ధం ఆగడం లేదు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడులు, ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో పేలుళ్లు పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. అంతేకాకుండా, అమెరికా 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి వేలాది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపేందుకు సిద్ధమవుతోంది. అంటే… శాంతి చర్చలు జరుగుతున్నా, యుద్ధానికి సన్నద్ధత తగ్గడం లేదు.
బూమరాంగ్ అవుతుందా… లేక బ్రేక్‌థ్రూ అవుతుందా?
మొత్తం పరిస్థితిని చూస్తే ఓ ద్వంద్వ దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు యుద్ధం తీవ్రత. ఈ నేపథ్యంలో JD Vance పాత్ర కీలకంగా మారుతోంది. “ఆంధ్రా అల్లుడు” అనే భావోద్వేగ కోణం ఒక వైపు ఉంటే… గ్లోబల్ డిప్లమసీలో ఆయన తీసుకునే నిర్ణయాలు మరో వైపు ప్రభావం చూపనున్నాయి.

ఇరాన్–అమెరికా యుద్ధం ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. చర్చలు ఫలిస్తే శాంతికి మార్గం సుగమమవుతుంది… లేకపోతే ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. “జేడీ వాన్స్ దౌత్యం యుద్ధానికి ముగింపు పలుకుతుందా… లేక ఇది కూడా మరో రాజకీయ వ్యూహమేనా?” అనేది తేలాల్సి ఉంది.
Read More
Next Story