
భారత్‌కు అగ్రరాజ్యం మద్దతు
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా మాట్లాడిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో..
పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలపై యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణంలో.. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్ చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా(America) విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ పేర్కొ్న్నారు.
ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రమూకలు దాడిచేయడంలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం.. ఉగ్రమూకలను మట్టిలో కలిపేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు బృందం దాడికి ఒడిగట్టిన ఉగ్రమూకల కోస అన్వేషణ మొదలుపెట్టాయి. ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టుల ఇళ్లను, సానుభూతిపరులు ఇళ్లలో సోదాలు నిర్వహించి కూల్చివేశారు. ఇటు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్‌కు వెళ్లే సింధూ జలాలను నిలిపేయడంతో పాటు పాక్ జాతీయులంతా దేశం వీడాలని కోరిన విషయం తెలిసిందే.
పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం..
భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణ వార్త తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని షరీఫ్‌తోనూ మాట్లాడిన రూబియో..ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఉగ్రవాదాన్ని ఎవరూ కూడా ప్రోత్సహించరాదని కోరారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి రూబియోతో చర్చించినట్లు జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఉగ్రదాడికి పాల్పడినవారు, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టడమే భారత్ ముందున్న లక్ష్యమని అందులో పేర్కొ్నారు.