
భారతీయులను తిప్పి పంపిన అమెరికా
రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయిన విమానం, చాలామంది చేతులకు సంకెళ్లు వేసిన పంపిన వాషింగ్టన్ యంత్రాంగం
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెతికి తిప్పి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా యూఎస్ 35 మంది భారతీయులకు సంకెళ్లు వేసి మరీ భారత్ కు పంపింది.
తాజా బృందంలో హర్యానాలోని కైతాల్, కర్నాల్, కురుక్షేత్ర జిల్లాలకు చెందినవారని జాతీయ మీడియా వెల్లడించింది. అక్రమ వలసదారులతో కూడిన విమానం శనివారం రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయింది.
‘‘విమానంలో ఉన్నప్పుడూ మాలో చాలామంది చేతులకు సంకెళ్లు వేశారు’’ అని నరేష్ కుమార్ అనే వ్యక్తి చెప్పారు.
ఇంటికి పంపిన అధికారులు..
బహిష్కరించబడిన వారిలో 16 మంది కర్నాల్ నుంచి, 14 మంది కైతాల్ నుంచి, ఐదుగురు కురుక్షేత్ర వాసులు ఉన్నారు. వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చి వారి కుటుంబాలకు అప్పగించినట్లు కర్నాల్ పోలీస్ సూపరింటెండెంట్ గంగారామ్ పునియా ధృవీకరించారు.
కైతాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లలిత్ కుమార్ ప్రకారం.. ఆదివారం ఢిల్లీ విమానాశ్రాయం నుంచి కైతాల్ పోలీస్ లైన్స్ కు 14 మందిని తీసుకొచ్చారు. వారిలో నలుగురు కలయత్, పుండ్రీ బ్లాకుల నుంచి, ఇద్దరు కైతాల్ నుంచి, ముగ్గురు ధండ్ బ్లాక్, ఒక గుహ్లా బ్లాక్ కు చెందినవారు. ఆ వ్యక్తులు అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రమాదకరమైన డుంకీ మార్గాన్ని ఎంచుకున్నారని డీఎస్పీ తెలిపారు.
నిరాశతో వెనక్కి వచ్చాము..
వెనక్కి వచ్చిన వారిలో ఎక్కువ మంది 25-40 సంవత్సరాల వయస్సు గలవారు. బహిష్కరణపై నిరాశ వ్యక్తం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం అమెరికాకు వలస వెళ్లడానికి భూములు, బంధువుల నుంచి అప్పులు చేయడం, పొదుపు మొత్తాన్ని ఖర్చు చేసినట్లు వారు వెల్లడించారు. ఒక ఏజెంట్ తనకు రూ. 42 లక్షలు చెల్లిస్తే అమెరికాకు పంపుతామని చెప్పినట్లు.. కానీ చివరికి రూ. 57 లక్షలు చెల్లించినట్లు చెప్పారు.
‘‘ఒక ఎకరం భూమిని రూ. 42 లక్షలకు అమ్మేశాను. ఆ తరువాత వడ్డీకి రూ. 6 లక్షలు తీసుకున్నాను. నా సోదరుడు కొంతభూమిని అమ్మి రూ. 6.5 లక్షలు సేకరించాడు. కొన్ని రోజులకు నా బంధువు రూ. 2.85 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం రూ. 57 లక్షలు ఇచ్చాను’’ అని నరేష్ కుమార్ చెప్పారు.
‘‘డుంకీ మార్గం’’ ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి తనకు రెండు నెలల పట్టిందని, అలా చేయవద్దని అందరికి చెప్తానని అన్నారు. భారత్ కు రావడానికి ముందు దాదాపు 14 నెలలు జైలులో ఉన్నానని పేర్కొన్నారు.
అధికారిక ఫిర్యాదు లేదు..
డుంకీ మార్గం ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి తీసుకెళ్లిన ఏజెంట్లపై తమకు అధికారికంగా ఏ ఫిర్యాదు అందలేదని కైతాల్ డీఎస్పీ తెలిపారు. బహిష్కరణకు గురైన వారిలో ఒకరిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
కైతాల్ నుంచి బహిష్కరించబడిన వారిలో నరేశ్ కుమార్(తారాగఢ్ గ్రామం), కర్ణ్ శర్మ(పీడల్), ముఖేశ్ కుమార్(అగర్వాల్ కాలనీ), రితిక్ శర్మ( చిరంజీవి కాలనీ), సుఖ్ బీర్ సింగ్ (జదౌలా), అమిత్ కుమార్( హబ్రీ), అభిషేక్ కుమార్(బుచ్చి), మోహిత్ కుమార్(బార్తా), అశోక్ కుమార్(హబ్రీ), ప్రభాత్ చంద్(సిస్లా), సత్నామ్ సింగ్(పెహ్రక్), మునారెహ్రీ గ్రామానికి చెందిన డైమండ్ ఉన్నారు.
ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు ప్రారంభం అయ్యాయి.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికన్ అధికారులు పంజాబ్, హర్యానా, గుజరాత్ నుంచి అనేక మందిని వెనక్కి పంపారు. వారిలో అందరికి చేతులు, కాళ్లకు సంకెళ్లు చేశారు. ప్రతిపక్షం ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తింది. భారత్ అనేక సందర్భాలలో అమెరికా దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. కానీ బహిష్కరణకు గురైన వారిపట్ల అమానవీయ ప్రవర్తన అమెరికా కొనసాగిస్తోంది.
Next Story

