భారత్‌పై పెనుభారం.. 500 శాతం సుంకాలు విధించనున్న  ట్రంప్
x

భారత్‌పై పెనుభారం.. 500 శాతం సుంకాలు విధించనున్న ట్రంప్

రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలోనూ, భారత్ రెండో స్థానంలోనూ ఉంది.


Click the Play button to hear this message in audio format

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంపై రిపబ్లికన్ సెనెటర్ లిన్స్ గ్రాహం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో పలు కీలక విషయాల గురించి చర్చలు జరిపినట్టు తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దారుణాలకు రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా బిల్లు ప్రకారం ఆయా దేశాలపై 500 శాతం సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుందని గ్రాహం తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనడం తగ్గుతుందని లిన్స్ గ్రాహం ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలోనూ, భారత్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపించడానికి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించారు. అయినా భారత్ మాత్రం రష్యా నుంచి చవకగా వస్తున్న చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇండియన్ కరెన్సీ విలువ కూడా భారీగా పడిపోయే అవకాశం కనిపిస్తుంది.

Read More
Next Story