
జమ్మూ కాశ్మీర్‌లో 12 మంది భారతీయుల మృతి
నియంత్రణ రేఖ సమీప గ్రామాలపై పాక్ ఆర్మీ బలగాలు దాడులు..
భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పాకిస్తాన్(Pakistan)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే పాక్ సాయుధ బలగాలు భారత సరిహద్దు గ్రామాలపై దాడులను పాల్పడ్డారు. ఈ దాడులకు పూంచ్ జిల్లాలో 12 మంది చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ మరో 42 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భయాందోళనకు గురైన మిగతా గ్రామస్థులు బంకర్లలోకి ప్రవేశించి ప్రాణాలు దక్కించుకున్నారు.
మృతుల వివరాలు..
బల్విందర్ కౌర్ అలియాస్ “రూబీ” (33), మొహమ్మద్ జైన్ ఖాన్ (10), అతని అక్క జోయా ఖాన్ (12), మొహమ్మద్ అక్రం (40), అమరీక్ సింగ్ (55), మొహమ్మద్ ఇక్బాల్ (45), రంజీత్ సింగ్ (48), షకీలా బీ (40), అమర్జీత్ సింగ్ (47), మరియమ్ ఖతోన్ (7), విహాన్ భార్గవ్ (13), మొహమ్మద్ రఫీ (40).
ఇతర ప్రాంతాల్లో..
బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో కూడా జరిపిన దాడుల్లో ఐదుగురు చిన్నారులతో పాటు పదిమంది గాయపడ్డారు. రాజౌరి జిల్లాలో ముగ్గురు గాయపడ్డారు. దాడుల దాటికి కుప్వారా జిల్లాలోని కర్నా సెక్టార్‌లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి.
విద్యాసంస్థల మూసివేత..
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, సామ్బా, కతువా, రాజౌరి, పూంచ్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను బుధవారం మూసివేశారు.