
యుద్ధ బీభత్సంలో సర్వస్వం కోల్పోయి రోదిస్తున్న ఓ మహిళ (ఫోటో కర్టసీ అల్ జజీరా)
హర్మోజూ మాదే, టోల్ టాక్సూ మాదే!
అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ, తేల్చిచెప్పిన ఇరాన్ పార్లమెంటు, ఇంతకీ టాక్స్ ఎంతో తెలుసా?
ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం మొదలై 32 రోజులైంది. క్షిపణులు, డ్రోన్ల హోరుతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. భూతల యుద్ధం దిశగా అడుగులు పడకముందే సముద్ర జలాలు ఎర్రబారుతున్నాయి. ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల నడుమ ఇరాన్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు వెన్నెముక వంటి హర్మోజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది.
"హర్మోజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్"కు గ్రీన్ సిగ్నల్
ఇరాన్ పార్లమెంటు సెక్యూరిటీ కమిటీ తాజాగా 'హర్మోజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్'కు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం, ఇకపై ఈ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక ఇరాన్‌కు టోల్ చెల్లించాల్సిందే. ఒక్కో భారీ చమురు ట్యాంకర్‌పై గరిష్టంగా రూ. 18.90 కోట్లు ($2.25 million సుమారు) వసూలు చేయాలని నిర్ణయించారు. హర్మోజ్‌పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని చాటడం, సముద్రయాన భద్రత పేరుతో ఆర్థిక ప్రయోజనం పొందడం దీని లక్ష్యంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ నిబంధనలు రూపొందించారు.
ఇప్పటికే IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) నిర్దేశించిన నిబంధనల ప్రకారం 26 నౌకలు క్లియరెన్స్ కోడ్‌లు పొంది, టోల్ చెల్లించి ఈ మార్గం గుండా వెళ్లినట్లు ఇరాన్ అధికారిక మీడియా 'ఐఆర్‌ఐబీ' వెల్లడించింది.
కువైట్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. మంటల్లో 'అల్ సల్మీ'
ఒకవైపు టోల్ వసూళ్లు చేస్తూనే, మరోవైపు వ్యతిరేక దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా దుబాయ్ పోర్టు సమీపంలో ఉన్న కువైట్‌కు చెందిన ‘అల్ సల్మీ’ అనే భారీ ముడిచమురు నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ట్యాంకర్ నిండా చమురు ఉండటంతో భారీగా మంటలు చెలరేగాయి. 24 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినప్పటికీ, సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం పొంచి ఉందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా ఏమందంటే..
ఇరాన్ చర్యలను అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్రంగా ఖండించారు. "అంతర్జాతీయ జలమార్గాలను స్వాధీనం చేసుకుని, మా సొంతం అని చెప్పుకునే కొత్త పోకడకు ఇరాన్ తెరలేపింది.
దీనిని ప్రపంచ దేశాలు అంగీకరించవు" అని ఆయన హెచ్చరించారు. G7 దేశాలు సైతం నౌకాయాన స్వేచ్ఛను హరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇరాన్ లో ఇద్దరికి ఉరిశిక్ష...
యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ ప్రభుత్వం తన వ్యతిరేకులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భవనాలపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో తాజాగా ఇద్దరిని, నిన్న మరో ఇద్దరిని కలిపి మొత్తం నలుగురిని ఇరాన్ ఉరితీసింది.
ఇండోనేషియా శాంతి దళాలపై దాడి..
యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, లెబనాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన ఇండోనేషియా శాంతి పరిరక్షక దళాల (Peacekeepers) పై జరిగిన దాడి కలకలం రేపుతోంది. ఈ దాడిలో ముగ్గురు ఇండోనేషియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ "హేయమైన" దాడిని ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో తీవ్రంగా ఖండించారు. దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
"యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలన్నీ అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలి. శాంతి దళాల రక్షణే ప్రథమ ప్రాధాన్యం కావాలి" అని ఇండోనేషియా రక్షణ శాఖ ప్రతినిధి రికో రికార్డో సిరైట్ స్పష్టం చేశారు.
మరోపక్క, హర్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ఇరాన్ ఆడుతున్న ఈ 'టోల్ గేమ్' ప్రపంచ ఇంధన ధరలను ఎక్కడికి తీసుకెళ్తుందో అన్న భయం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. సముద్ర గర్భంలో మొదలైన ఈ మంటలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story

