
‘ఆటిజం చికిత్సకు స్టెమ్ సెల్ థెరపీ చట్టవిరుద్ధం’
శాస్త్రీయ ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు..
ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ వినియోగంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD), సెరిబ్రల్ పాల్సీ బాధిత పిల్లలకు స్టెమ్ సెల్ థెరపీ చేయడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లు ఆటిజం, సెరిబ్రల్ పాల్సీకి స్టెమ్ సెల్ థెరపీ ద్వారా చికిత్స చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ అంశం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వెళ్లింది.
జనవరి 30న జరిగిన విచారణలో కోర్టు సంబంధిత సంస్థల అభిప్రాయాలను పరిశీలించింది. ముఖ్యంగా Indian Council of Medical Research (ఐసీఎంఆర్) సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత, స్టెమ్ సెల్ థెరపీతో ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ బాధిత చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందన్నడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చింది. దీంతో స్టెమ్ సెల్ థెరపీని కేవలం ఆమోదిత వ్యాధులకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఆ లెక్కన 32 వ్యాధులకు మాత్రమే స్టెమ్ సెల్ థెరపీ చేయాలి. ఆ జాబితాలో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా, మల్టిపుల్ స్క్లెరోసిస్, థలసేమియా, మల్టిపుల్ మైలోమా, అప్లాస్టిక్ అనీమియాతో పాటు మరికొన్ని ఉన్నాయి.
‘అయితే పరిశోధన కోసం చేయాల్సి వస్తే Central Drugs Standard Control Organization (CDSCO) లేదా ఆరోగ్య పరిశోధన విభాగం అనుమతి తీసుకోవాలి. పరిశోధన సంస్థలు నైతిక మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. రోగుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి. చికిత్సకు ఖర్చు లేకపోవడం, ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం వంటి నిబంధనలు తప్పనిసరి. ’ అని కోర్టు సూచించింది.
మొత్తంగా, స్టెమ్ సెల్ థెరపీ వినియోగంపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ఆమోదిత వ్యాధులకు మాత్రమే ఆ థెరపీని పరిమితం చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

