
పీపీపీ మోడల్ లోకి 61 ఆస్పత్రులు
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఘోరంగా ఉంది. విపత్తుల సమయంలో కూడా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం ఉంది. అందుకు పాలకుల తీరే కారణం.
రాష్ట్రంలోని 61 నియోజకవర్గాల్లో 50 పడకలకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్ కిందకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకు రాబోతోంది. ఈ ఆస్పత్రులను 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులుగా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో తెలిపారు.
ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరు వంటి ప్రాంతాల్లో 50 పడకల ఆసుపత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా, మంత్రి స్పందిస్తూ కొత్త పాలసీ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర సాయంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వైద్యం వ్యాపారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న పడకలు 35,695
రాష్ట్రంలో వైద్య ఆసుపత్రుల స్థితిగతులను పరిశీలిస్తే 2023 మార్చి నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలలో మొత్తం 35,695 పడకలు ఉన్నాయి. ఇందులో పీహెచ్‌సీలలో 8,712, సీహెచ్‌సీలలో 6,400, సబ్-డిస్ట్రిక్ట్‌లో 5,400, డిస్ట్రిక్ట్‌లో 2,600, మెడికల్ కాలేజీలలో 12,583 పడకలు. 2025 నవంబర్ నాటికి 24 ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు) ఏర్పాటుతో అదనంగా 1,275 పడకలు జతయ్యాయి. ఇందులో 22 ఆసుపత్రులు 50 పడకలు, ఒకటి 75, మరొకటి 100 పడకల సామర్థ్యంతో ఉన్నాయి. 2026 ఫిబ్రవరి నాటికి మొత్తం పడకల సంఖ్య 37,000కు చేరుకునే అవకాశం ఉంది.
61 నియోజకవర్గాల్లో 50 పడకల కంటే తక్కువ ఉన్న ఆస్పత్రులు
పడకల సామర్థ్యం ఆధారంగా ఆసుపత్రుల సంఖ్యను చూస్తే, మంత్రి సత్యకుమార్ చెబుతున్న ప్రకారం 61 నియోజకవర్గాల్లో 50 పడకలకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా సీహెచ్‌సీలు (సాధారణంగా 30 పడకలు) లేదా చిన్న పీహెచ్‌సీలు (6 పడకలు).
2025 ఏప్రిల్ డేటా ప్రకారం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 70లో 100 పడకలు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఉన్నాయి. మిగిలిన 105లో 44 ఆసుపత్రులు 50-99 పడకల మధ్య ఉన్నాయి. మంత్రి చెబుతున్న ప్రకారం మొత్తం సీహెచ్‌సీల సంఖ్య 138 (2023 డేటా), ఏరియా హాస్పిటల్స్ 33, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ 7, ఎమ్‌సీహెచ్‌లు 2. సెకండరీ హాస్పిటల్స్ మొత్తం 243 ఉన్నాయి. వీటిలో 142లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
70 శాతం స్పెషలిస్టుల కొరత
వైద్యుల సంఖ్య, కొరతల విషయానికి వస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు 12,000 మంది వరకు ఉన్నారు. 1,150 పీహెచ్‌సీలలో 2,280 వైద్యులు పనిచేస్తున్నారు. ఇటీవల 227 స్పెషలిస్ట్ వైద్యులను 142 సెకండరీ ఆసుపత్రులలో నియమించారు. అలాగే 784 పీజీ వైద్యులను సీనియర్ రెసిడెంట్లుగా నియమించారు. ఇందులో 393 మంది 102 రీజినల్, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులలో, మిగిలినవారు 17 టీచింగ్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నారు.
2026 డేటా ప్రకారం ప్రకారం సీహెచ్‌సీలలో స్పెషలిస్టుల కొరత 9 శాతం ఉంది. మొత్తం వైద్యుల ఖాళీలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 శాతం ఉంది. పీజీ వైద్యుల (స్పెషలిస్టులు) కొరత మరింత తీవ్రంగా ఉంది. ఉదాహరణకు కర్నూల్ మెడికల్ కాలేజీలో 106 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 43 మాత్రమే నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో స్పెషలిస్టుల కొరత 80 శాతంగా ఉండగా, ఏపీలో ఇది 70 శాతం వరకు ఉంటుంది. ప్రభుత్వం ఇన్-సర్వీస్ పీజీ కోటా ద్వారా (272 సీట్లు) ఈ కొరతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
వైద్యరంగ నిపుణుల అభిప్రాయం
పీపీపీ మోడల్‌పై వైద్య రంగ నిపుణుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కన్నూరు సుజాతా రావు మాట్లాడుతూ ‘పీపీపీ మోడల్ వైద్య విద్యలో సుస్థిరత లేదు. ఇది పబ్లిక్ హెల్త్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేసి, దీర్ఘకాలంలో దాని సహజ అభివృద్ధిని దెబ్బతీస్తుంది’’ అన్నారు. ఏపీ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ అభిప్రాయం ప్రకారం‘‘పీపీపీ మోడల్ 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక చర్య. వైద్యం రాజ్యాంగ హక్కు. ప్రభుత్వమే దాన్ని సంరక్షించాలి.’
ప్రజా సంఘాల నాయకులు కూడా పీపీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు అప్పగించడం పబ్లిక్ మనీని దోచుకోవడానికి పెద్ద స్కాండల్. ఇది పేదలు, మధ్యతరగతి వారికి వైద్య విద్య, చికిత్సలను దూరం చేస్తుంది.’’
సీపీఐ కేంద్ర సహాయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ‘పీపీపీ మోడల్ ప్రైవేటీకరణకు మారుపేరు. ప్రభుత్వ భూములు, ఆసుపత్రులను 60 ఏళ్లు ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకం. పేదలకు ఉచిత చికిత్స దూరమవుతుంది.’ అని అన్నారు.
పీపీపీ మోడల్‌తో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ హెల్త్ ఇండెక్స్‌లో వెనుకబడి ఉంది. పీపీపీ పద్దతి వల్ల వైద్య రంగం వ్యాపారంగా మారి పేదలు నష్టపోయే ప్రమాదం ఉంది.

