
'పుష్పక విమానం' సీన్ రిపీట్ కాబోతుందా?
కరెన్సీ నోటు మాట్లాడుతుందా?
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ప్రయోగాలు క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అందులో మొదటి వరుసలో ఉండే పేరు 'పుష్పక విమానం'. మాటలు లేని సినిమాతో కోట్లాది మంది గుండెల్ని గెలుచుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే సింగీతం శ్రీనివాసరావు నిరూపించారు. అప్పట్లో కమల్ హాసన్ అభినయం, ఆ నిశ్శబ్దంలోనే వినిపించిన హాస్యం ఒక అద్భుతం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అలాంటి ఒక సాహసోపేతమైన 'మూకీ' ప్రయోగంతో మన ముందుకు వస్తున్నాడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి. అయితే తమది మూకీ సినిమా అని కన్ఫర్మ్ అయితే చేయలేదు టీమ్ . కానీ ట్రైలర్ మాత్రం పూర్తి మూకిగానే ఉంది.
నిశ్శబ్దమే ఇప్పుడు పెద్ద శబ్దం!
టెక్నాలజీ పెరిగి, డాల్బీ అట్మాస్ సౌండ్లతో థియేటర్లు దద్దరిల్లుతున్న ఈ రోజుల్లో.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. కానీ, 'గాంధీ టాక్స్' ఆ రిస్క్ తీసుకుంది.
ఏంటి ఈ 'గాంధీ టాక్స్' స్పెషల్?
ఈ పేరు వినగానే కరెన్సీ నోటు మీద ఉండే గాంధీ గారు మాట్లాడతారేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది! ఈ సినిమా అసలు మాట్లాడదు. అవును.. మీరు విన్నది నిజమే! ఇది ఒక 'మూకీ' (Silent Movie) సినిమా. భావాలను పంచుకోవడానికి భాష అక్కర్లేదు, కేవలం హావభావాలు ఉంటే చాలు అని నిరూపించడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు.
ఈ ట్రైలర్ లో తల్లిని ప్రాణంగా చూసుకునే మధ్య తరగతి యువకుడు (విజయ్ సేతుపతి) డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎదురింట్లో ఉండే అందమైన అమ్మాయి (అదితి రావు హైదరి) ని ఇష్టపడి ప్రేమిస్తాడు.
ఇంకో వైపు కోట్లలో మునిగితేలే బడా వ్యాపారవేత్త (అరవింద్ స్వామి). విమాన ప్రమాదంలో కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. వీళిద్దరిని మనీ క్రైమ్ ఒకటి లింకు పెడుతుంది. యుద్ధం మొదలవుతుంది. మనుగడ కోసం పరుగులు పెడతారు.
రెహమాన్ మ్యూజిక్.. అదిరిపోయే యాక్టింగ్!
సుమారు మూడు దశాబ్దాల క్రితం సింగీతం శ్రీనివాసరావు గారు 'పుష్పక విమానం'తో ఎలాంటి సంచలనం సృష్టించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి మేజిక్ రిపీట్ కాబోతోంది.
మ్యూజిక్ మేజిక్:
సినిమాలో మాటలు లేవు కాబట్టి, ఆ లోటు తెలియకుండా ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన సంగీతంతో ప్రాణం పోశారు. ట్రైలర్ చూస్తుంటే రెహమాన్ కి చాలా కాలం తర్వాత తన టాలెంట్ మొత్తం చూపించే స్కోప్ ఉన్న సినిమా దొరికిందనిపిస్తోంది.
స్టార్ కాస్ట్:
విజయ్ సేతుపతితో పాటు అరవింద్ సామి, అదితి రావు హైదరి వంటి దిగ్గజ నటులు తమ అభినయంతో మాటల అవసరం లేకుండానే మెప్పించారు.
మహారాజా తర్వాత మరో హిట్టేనా?
రీసెంట్ గా 'మహారాజా' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన విజయ్ సేతుపతి, ఇప్పుడు ఈ సైలెంట్ ఎక్స్‌పెరిమెంట్‌తో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ట్రైలర్ లోనే ఈ సైలెన్స్ ఉంటుందా లేక సినిమా మొత్తం ఇలాగే ఉంటుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
జనవరి 30న అసలు కథ!
జనవరి 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. మరి ఈ 'గాంధీ టాక్స్' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందో చూడాలి!

