
క్రైమ్ కామెడీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ
శివాజీ ఏ మేరకు నవ్వించాడా, విసిగించాడా?
శ్రీరామ్ (శివాజీ) ఒక సిన్సియర్ పంచాయతీ సెక్రటరీ. తన భార్య ఉత్తర (లయ), రీల్స్ పిచ్చితో వింత పనులు చేసే కొడుకు బిట్టుతో కలిసి హ్యాపీగా గడిపేస్తుంటాడు. కానీ, ఆడవాళ్ల పిచ్చి ఉన్న లోకల్ ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) కన్ను ఉత్తరపై పడటమే ఆ ఫ్యామిలీ పాలిట శాపమైంది. శ్రీరామ్ లేని టైమ్ చూసి వాళ్ల ఇంటికి వచ్చిన ఆ కామపిశాచి ఎస్సై, అనూహ్యంగా శవమై తేలాడు. షాకింగ్ విషయం ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయింది శ్రీరామ్ చిన్న కొడుకు చేతిలో! అవును, మీరు విన్నది నిజమే. అక్కడితో కథ ముగియలేదు, అసలైన గేమ్ అప్పుడే మొదలైంది.
ఒకవైపు ఇంట్లో ఉన్న ఎస్సై శవాన్ని ఎలా మాయం చెయ్యాలా అని టెన్షన్ పడుతూంటే.., మరోవైపు ఇంకో గేమ్ మొదలువుతంది. కోటి రూపాయల గిఫ్ట్ బ్యాగ్ కోసం వేటాడుతున్న ఎమ్మెల్యే తిమ్మప్ప (శరత్ లోహితాశ్వ) గ్యాంగ్ ఈ కథలోకి చొరబడతారు! ఈ క్రమంలో శ్రీరామ్ ఫ్యామిలీ అసలు ఆ శవాన్ని ఎలా మాయం చేసింది? ఆ శవాన్ని దాచే క్రమంలో వీళ్లు ఏం విన్యాసాలు చేసారు. అటు పోలీసులు, ఇటు రౌడీలు వెంటాడుతుంటే.. ఒక సామాన్యమైన వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా దృశ్యం చూడాల్సిందే.
ఎనాలసిస్
ఈ సినిమా సెంట్రల్ ఐడియా చూస్తే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా Drishyam. దృశ్యం సినిమాని క్రైమ్ కామెడీ చేస్తే అనే ఆలోచనే ఇది. సాధారణ వ్యక్తి ఒక క్రైమ్ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే థీమ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తికరమే ఆ సినిమాలో కథ చాలా సింపుల్ అయినప్పటికీ, స్క్రీన్‌ప్లే ప్రతి సన్నివేశంలో టెన్షన్ ను పెంచుతుంది. ప్రేక్షకుడు హీరోతో పాటు ప్రతి క్షణం భయాన్ని అనుభవిస్తాడు. “సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని”లో సమస్య ఏమిటంటే... ఐడియా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాని చుట్టూ నిర్మించాల్సిన డ్రామాటిక్ ప్రెజర్ లేకపోవడం.అందుకు కారణం ప్రతీ సీన్ కామెడీ చెయ్యాలి, నవ్వించాలని తాపత్రయం కావచ్చు.
“Drishyam” లో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కుర్చీలో ముందుకు వంగేలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ప్రతి డైలాగ్, ప్రతి మలుపు కథను కుర్చిలో వెనక్కి వాలి కునుకు పట్టేలా చేస్తుంది. సినిమా మొదలైన కొద్ది సేపటికే ప్రేక్షకుడుకి అది ఎటు వెళ్తుందో అంచనా వేసే స్దితి వచ్చేస్తుంది. స్క్రీన్‌ప్లే లో సస్పెన్స్ లేకపోవడం వల్ల సినిమా మొదటి నుంచే ఒకే లెవెల్ లో ప్లాట్ గా సాగుతుంది.
అలాగే ఈ సినిమాను క్రైమ్ కామెడీగా ప్రమోట్ చేశారు. కానీ తెరపై చూసేటప్పుడు ఆ రెండు జానర్లులో ఏదీ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. చాలా కామెడీ సన్నివేశాలు బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. నవ్వు రావాల్సిన చోట చిరాకు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
సినిమా ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు కథలోకి ప్రేక్షకుడిని లాగుతాయి. కానీ అక్కడి నుంచి ఆ ఫ్లో కొనసాగించడంలో దర్శకుడు తడబడ్డాడు. ప్రతి మంచి స్క్రీన్‌ప్లేలో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది — పేసింగ్. ప్రముఖ దర్శకుడు Christopher Nolan ఒకసారి చెప్పిన మాట ఉంది: “సినిమాలో కథ కంటే ప్రేక్షకుడి ఆసక్తి ఎక్కడ పడిపోతుందో తెలుసుకోవడం ముఖ్యమైనది.” ఈ సినిమాలో అదే సమస్య కనిపిస్తుంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ బలంగా లేకపోవడం వల్ల కథ పలు చోట్ల బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది.
దీనికి తోడు క్రైమ్ డ్రామా అయినా, కామెడీ అయినా చివరికి ప్రేక్షకుడిని పట్టుకునేది ఎమోషన్. ఈ సినిమాలో ఎమోషనల్ బీట్‌లు చాలా నార్మల్ గా ఉన్నాయి. కథలో పెద్ద ప్రమాదం జరుగుతున్నట్టుగా అనిపించినా ప్రేక్షకుడికి ఆ టెన్షన్ ఫీల్ అవ్వదు. దీంతో సినిమా చూస్తున్నంతసేపు ఒక అసంతృప్తి ఫీల్ మాత్రమే మిగులుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అనుకున్న స్దాయిలో పేలలేదు. అయినా సినిమా క్లైమాక్స్ కాదు, క్లైమాక్స్ వరకు వెళ్లే ప్రయాణమే ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి.
టెక్నికల్ గా చూస్తే..
సినిమా మూడ్ ను పెంచడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ సినిమాలో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని సన్నివేశాలు మంచి మ్యూజిక్ ఉంటే ఎలివేట్ అయ్యేవి. కానీ అక్కడ కూడా సాధారణ స్థాయి ట్రీట్మెంట్ మాత్రమే కనిపించింది.…విజువల్స్ గా సినిమా బాగానే అనిపించింది. ఆ గ్రాండియార్ ని కూడా బాగానే చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.
నటీనటుల్లో ..
ధనరాజ్ క్యారెక్టర్ ఈ కథలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాంటిది. కానీ, క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ అనుకున్నంత రేంజ్‌లో పండలేదు. అయితే భార్యాభర్తలుగా శివాజీ, లయ మధ్య కెమిస్ట్రీ బాగుంది. కొడుకు పాత్రలో రోహన్ తన పరిధి మేరకు బాగానే చేశాడు. మిగతా నటులతో చేయించిన కామెడీ మాత్రం అస్సలు నవ్వించదు.
కంక్లూజన్
మొత్తానికి “సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని” ఒక మంచి ఐడియాతో మొదలైన సినిమా. కానీ స్క్రీన్‌ప్లే స్ట్రాంగ్ గా లేకపోవటం, పేసింగ్ లో తడబాటు, కామెడీ టైమింగ్ లో లోపాలు కలిపి ఆ ఐడియాను పూర్తిగా వినియోగించుకోలేకపోయాయి.

