
సుప్రీంలో షాక్: ‘జన నాయగన్’ ఆశలకు బ్రేక్
తిరిగి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన అత్యున్నత ధర్మాసనం
దళపతి విజయ్(Vijay) చిత్ర నిర్మాతలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ సమయంలో ఈ కేసులో తాము తలదూర్చలేమని మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీం(Supreme court) న్యాయమూర్తులు తెలిపారు. ‘జన నాయగన్’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ.. సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేసు విచారించిన అత్యున్నత మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యమైతే సినిమాకు అన్యాయం జరుగుతుందని నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీంకు (Supreme Court) తెలుపగా.. దీనిపై కచ్చితంగా జనవరి 20న తీర్పు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
అసలు వివాదమేంటి?
‘‘జననాయగన్’’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ 2025 డిసెంబర్‌లో CBFCకి దరఖాస్తు చేసుకుంది. చిత్రంలో అక్కడక్కడ మతపర భావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నాయంటూ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. బోర్డు సూచించిన మార్పులు చేసి నిర్మాతలు డిసెంబర్ 24న మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికేట్ ఇవ్వడంలో CBFC తాత్సారం చేస్తుందని చిత్రనిర్మాతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.

