
భాక్సాపీస్ :ఫిబ్రవరిలో పరిస్థితి ఇంత దారుణమా?
టాలీవుడ్‌కు ‘బ్లాక్ ఫిబ్రవరి’ షాక్
కొత్త ఏడాది అదిరిపోయే రేంజ్‌లో స్టార్ట్ అయింది. జనవరిలో సంక్రాంతి సందడితో బాక్సాఫీస్ కళకళలాడింది. ఐదు సినిమాలు వరుసగా దిగి భారీ వసూళ్లను రాబట్టాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’ మినహా మిగిలిన సినిమాలన్నీ సేఫ్ జోన్‌లోకి వెళ్లడంతో ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఫీలైంది. కానీ, ఫిబ్రవరి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కనీసం సంక్రాంతిలో ఉన్న సగం జోరు కూడా కనిపిస్తుందని ఆశపడ్డ బయ్యర్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. థియేటర్లలో ఆడియన్స్ లేక, షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వరుసగా కుప్పకూలిన సినిమాలు:
ఈ నెలలో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఏ ఒక్క సినిమా కూడా కనీస ప్రభావం చూపలేకపోయింది.
దర్శకుడు గుణశేఖర్ కంబ్యాక్ మూవీ ‘యుఫోరియా’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.
నవీన్ చంద్ర హారర్ ప్రయోగం ‘హనీ’ ఊసే లేకుండా పోయింది.
నాగవంశీ, విశ్వక్ సేన్ కాంబోలో వచ్చిన ‘ఫంకీ’ భారీ అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
సుహాస్ నటించిన ‘హే బల్వంత్’ రెండు రోజులు హడావుడి చేసినా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది.
శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ మిక్స్‌డ్ టాక్‌తో నిండా మునిగింది. సీత పయనం, సన్ ఆఫ్, నవాబ్ కేఫ్ వంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.
థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం:
నైజాం, ఆంధ్ర అనే తేడా లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారంటే టాలీవుడ్ ఎంతటి సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవాలి. ఫుట్‌ఫాల్స్ లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. చివరకు ‘ఆరెంజ్’, ‘అతడు’, ‘ఏ మాయ చేశావే’ వంటి పాత సినిమాలను రీ-రిలీజ్ చేసి బండి లాగించాల్సి వస్తోంది. సంక్రాంతికి భారీగా ఖర్చు చేసిన ప్రేక్షకులు, ఇప్పుడు చిన్న సినిమాలను థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. అందరూ OTT ప్రీమియర్ల కోసం వెయిట్ చేయడం ఇండస్ట్రీకి శాపంగా మారింది.
కాస్త ఊరట.. కానీ కలెక్షన్లు లేవు:
ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, ఆ టాక్ కలెక్షన్ల రూపంలోకి మారలేదు. సినిమా బాగుందని అంటున్నా, బాక్సాఫీస్ వద్ద కాసులు మాత్రం కురవడం లేదు. దీంతో ఫిబ్రవరిలో ఒక్కటంటే ఒక్క ఏకగ్రీవ హిట్ కూడా లేకుండా పోయింది.
టాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు మార్చి నెల మీద ఉన్నాయి. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ’తో మార్చి గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ఆశ పడుతున్నాయి. ధురంధర్ 2, టాక్సిక్, ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, డెకాయిట్ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌కు మళ్లీ పూర్వ వైభవం తెస్తాయని అందరూ కోరుకుంటున్నారు. థియేటర్లకు జనం మళ్లీ క్యూ కడతారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా ఫిబ్రవరి మాత్రం తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు ఒక ‘బ్లాక్ మంత్’ గా మిగిలిపోనుంది.

