కామెడీ వెబ్ సీరిస్ ‘మేము కాప్‌లం’ రివ్యూ
x

కామెడీ వెబ్ సీరిస్ ‘మేము కాప్‌లం’ రివ్యూ

నవ్వులా? నత్తనడకా?


గోదావరి జిల్లాలోని మహాదేవపట్నం కోడిపందాలకు ఫేమస్ . ఆ ఊర్లో గజపతిరాజు (నాగబాబు) అంటే ఓ బ్రాండ్. ఆయన మాట గ్రామంలో ఆఖరి తీర్పు లాంటిది. కానీ ఆ ఊర్లో అసలు సెలబ్రిటీ మాత్రం గజపతిరాజు పెంచే పందెం కోడి ‘సలార్ రాజు’. సంక్రాంతి వస్తే చాలు… హీరో ఇంట్రో షాట్ కంటే ఎక్కువ బిల్డప్ ఈ కోడికే ఉంటుంది. వరుస విజయాలతో ఊరంతా దానికి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోతుంది.

ఇక గజపతిరాజుకి ఎదురు నిలబడాలని మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు తమ తమ కోడిపుంజులతో రెడీ అవుతుంటారు. బయట పందెం కోళ్ల పోటీ నడుస్తుంటే… లోపల ఈగోల యుద్ధం మామూలుగా ఉండదు. పైగా మహిపాల్ కొడుకు ఆకాశ్… గజపతి కూతురు సంఘవిని ప్రేమించడంతో స్టోరీకి ఇంకో టెన్షన్ జత అవుతుంది.

ఈ హడావుడి మధ్య మహాదేవపట్నం పోలీస్ స్టేషన్‌ లో కానిస్టేబుల్ మోహన్ (గెటప్ శ్రీను) జాయిన్ అవుతాడు. అక్కడ ఎస్‌ఐగా ఉన్నది అతని బాల్య స్నేహితుడు రవి (రవితేజ నన్నిమల). ఈ ఇద్దరూ కలిసి కేసులు డీల్ చేస్తూంటారు. ఇదెలా ఉండగా సంక్రాంతికి కొద్ది రోజుల ముందు జరిగిన ఓ పార్టీ తర్వాత ‘సలార్ రాజు’ మిస్సవ్వడంతో ఊరంతా షాక్ అవుతుంది.

“ఊర్లో మనిషి కనిపించకపోయినా ఇంత టెన్షన్ పడరేమో… కోడి పోయిందంటే మాత్రం ఎమర్జెన్సీ!” అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. గజపతిరాజు కోపం ఒకవైపు… ఊరి ప్రెస్టీజ్ మరోవైపు… దీంతో ఆ కోడిని వెతికే బాధ్యత రవి-మోహన్ జోడీపై పడుతుంది.

మొదట ఇది సాధారణ కోడి దొంగతనంలా కనిపించినా… ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లేకొద్దీ మహాదేవపట్నం అసలు రంగులు బయటపడతాయి. చేతబడులు, రక్తపు వాంతులు, రహస్యంగా నడిచే అక్రమ వ్యాపారాలు… ఊరంతా భయంతో గుసగుసలాడే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. ఇదే సమయంలో ఓ అజ్ఞాత గ్యాంగ్… రిపోర్టర్ మీనాక్షి (రీతూ చౌదరి)పై కన్నేసి ఏదో ప్లాన్ చేస్తూ ఉండటం కథలో సస్పెన్స్ పెంచుతుంది.

అసలు ‘సలార్ రాజు’ని ఎత్తుకెళ్లింది ఎవరు? కోడి మిస్సింగ్ వెనక ఉన్నది పగనా? పొలిటిక్సా? లేక ఇంకేదైనా పెద్ద స్కామా? చేతబడుల పేరుతో ఊర్లో జరుగుతున్న అసలు డ్రామా ఏంటి? ఈ గందరగోళంలో ప్రేమజంట సంఘవి-ఆకాశ్ కథ ఎక్కడికి వెళ్లింది? అన్నది తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.

విశ్లేషణ

“మేము కాప్‌లం” అనే టైటిల్ చూస్తే మొదట ఇది ఓ గ్రామీణ క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ సిరీస్ మొదలైన కొద్దిసేపటికే ఇది అసలు కోడి పందాల చుట్టూ తిరిగే ఓ సెటైరికల్ కామెడీ అని అర్థమవుతుంది. కోనసీమలో కోడి పందాలను కొందరు ఎలా “సాంప్రదాయం” పేరుతో ఓ వ్యక్తిగత అహంకార ప్రదర్శనగా మార్చుకుంటారో… అదే పాయింట్‌ను రైటర్ శోభన్ చిట్టిప్రోలు కథలో బేస్‌గా తీసుకున్నారు.

ఇక్కడ కోడి అంటే కోడి కాదు… ఫ్యామిలీ పరువు, కుల అహంకారం, గ్రామ రాజకీయాలు, మగ ఈగో అన్నీ కలిపిన “ఫెదర్ వెర్షన్ ఆఫ్ పవర్”. అందుకే గజపతిరాజు తన కోళ్లకు ‘బాహుబలి రాజు’, ‘సలార్ రాజు’, ‘కల్కి రాజు’ లాంటి పేర్లు పెట్టి సెటైర్ వేసే ప్రయత్నం చేసారు.

స్క్రిప్ట్ పరంగా చూస్తే… రచయిత మొదటి నుంచే “మిస్సింగ్ కోడి”ని ఒక మెక్‌గఫిన్‌లా వాడుకున్నారు. అసలు కథ కోడి గురించి కాదు… కోడి చుట్టూ తిరిగే మనుషుల మూర్ఖత్వం గురించి. సలార్ రాజు కనిపించకుండా పోయిన తర్వాత ఊరిలో వచ్చే కలకలం చూస్తుంటే, “దేశ భద్రత కంటే కోడి భద్రత ముఖ్యం” అన్నట్టుంటుంది. అక్కడే సిరీస్ తన టోన్‌ను క్లియర్‌గా సెట్ చేస్తుంది.

రవి-మోహన్ పాత్రలు కూడా అసలు పోలీసుల్లా కాకుండా… “కేసు చేద్దామనుకునే ఇద్దరు జబర్దస్త్ స్కిట్ ఆర్టిస్టులు”లా రాసుకున్నారు. వాళ్ల ఇన్వెస్టిగేషన్‌లో సీరియస్‌నెస్ కంటే హడావిడి ఎక్కువ. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో చేసే ఓవర్ యాక్షన్, తామే వేసుకున్న ప్లాన్‌ల్లో తామే ఇరుక్కోవడం… ఇవన్నీ కామెడీకి పనిచేస్తాయి. కానీ అదే ప్యాటర్న్ పదేపదే రావడంతో మధ్యలో రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది.

ఇక్కడ అసలు సమస్య స్క్రీన్‌ప్లే రిథమ్. కథ మొదట్లో మంచి హుక్‌తో మొదలైనా… తర్వాత అదే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చివర “ఇదిగో ఇప్పుడు పెద్ద ట్విస్ట్ వస్తుంది” అన్న ఫీల్ ఇస్తుంది కానీ… మళ్లీ ఇంకో సైడ్ ట్రాక్‌లోకి జారిపోతుంది. ముఖ్యంగా సంఘవి-ఆకాశ్ లవ్ స్టోరీ, రక్తపు వాంతుల ఎపిసోడ్స్… ఇవన్నీ కథలో సహజంగా కాకుండా “ఏదైనా కంటెంట్ ఉండాలి కదా” అన్నట్టుగా ఇరికించిన ఫీలింగ్ ఇస్తాయి.

చేతబడుల ట్రాక్ మాత్రం ఆసక్తికరమైన ఐడియా. గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలను ఎలా వాడుకుని భయ రాజకీయాలు ఆడతారో చూపించే అవకాశం అక్కడ ఉంది. కానీ స్క్రీన్‌ప్లే ఆ ఐడియాను పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కొన్నిసార్లు థ్రిల్లర్‌లా మొదలై… వెంటనే కామెడీ స్కిట్ మూడ్‌లోకి వెళ్లిపోవడంతో టోన్ అస్థిరంగా అనిపిస్తుంది.

డైరెక్టర్ తీసుకున్న పెద్ద రిస్క్ ఏమిటంటే… ఈ కథను సీరియస్ క్రైమ్ డ్రామాగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం. అదే కొంతవరకు ప్లస్… కొంతవరకు మైనస్ అయ్యింది. ఎందుకంటే విలన్లు ఎవరో రివీల్ అయ్యే సమయానికి ఆడియన్స్ “అయ్యో వీళ్లేనా?” అనడం కంటే “ఇంతసేపు ఇదేనా?” అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. ట్విస్ట్ ఫన్నీగా ఉంది కానీ థ్రిల్ మాత్రం తగ్గిపోయింది.

నాగబాబు పాత్ర మాత్రం సిరీస్‌కి మంచి యాంకర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల గజపతిరాజు పాత్రకు ఓ బరువు వచ్చింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఊరిలో అందరూ ఆయనకు భయపడుతున్నట్టు చూపించినా, కథ ముందుకెళ్లేకొద్దీ ఆయన కూడా తన కోడిపై ఓవర్ ఎమోషనల్‌గా ఉండే “పెద్ద పిల్లవాడు”లా కనిపిస్తాడు. అదే పాత్రలోని సెటైరికల్ లేయర్.

కానీ మంచి కాన్సెప్ట్‌కు అవసరమైన టైట్ స్క్రీన్‌ప్లే, కన్సిస్టెంట్ కామెడీ, బలమైన థ్రిల్ ఇవి పూర్తిగా పడలేదు. కొన్ని సీన్లు నవ్విస్తాయి… కొన్ని సీన్లు “ఇంకా కోడి దొరకలేదా? త్వరగా దొరికి ముగిసిపోతే” అనిపిస్తాయి. అదే ఈ సిరీస్ అసలు సమస్య కూడా.

ఎవరెలా చేసారంటే..

నాగబాబు తన ఇమేజ్‌కు తగ్గట్టు గ్రామ పెద్ద పాత్రలో చాలా హుందాగా ఒదిగిపోయారు. గెటప్ శ్రీను, రవితేజ జోడీ తమ మార్క్ కామెడీతో కథను బోర్ కొట్టకుండా ఫన్ జనరేట్ చేస్తూ బాధ్యతాయుతంగా ముందుకు నడిపించారు.

గ్లామర్ & సపోర్టింగ్ కాస్ట్: రీతూ చౌదరి, సిరి పార్వతి గ్లామర్‌తో మెరిపిస్తే... కిరీటీ, చరణ్ వంటి నటీనటులు తమ పరిధి మేరకు ఓకే అనిపించారు.

టెక్నికల్ గా

కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కొంత సాగతీతను, రిపీట్ నెస్ ని తగ్గిస్తే బాగుండును అనిపించింది. డైరెక్టర్ బాగానే అవుట్ ఫుట్ తీసుకున్నాడు కానీ స్క్రిప్టే సహకరించలేదు. డైలాగులు బాగానే పేలాయి. బీవీఎస్ రవి నిర్మాతగా మారి రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

వీకెండ్‌లో సరదాగా, ఫన్ అండ్ సస్పెన్స్ మిక్స్ అయిన ఒక పక్కా లోకల్ గోదావరి కథను చూడాలనుకుంటే ఇదొక గుడ్ ఆప్షన్!

ఫైనల్ థాట్

“మేము కాప్‌లం”లో మిస్సయ్యింది నిజానికి ‘సలార్ రాజు’ కోడి కాదు… కథకు కావాల్సిన నేరేటివ్ ఫోకస్. క్రైమ్ కామెడీలు ఏం చేస్తాయంటే చిన్న సమస్యను తీసుకుని, దాని వెనకున్న మనుషుల అబద్ధాలు, ఆశలు, మూర్ఖత్వాన్ని బయటపెడతాయి. “మేము కాప్‌లం” దగ్గర ఆ అవకాశముంది. కానీ స్క్రీన్‌ప్లే ప్రతి సారి ఓ కొత్త ట్రాక్‌తో తన ఫోకస్‌ను తానే పక్కదారి పట్టించుకుంది.

Read More
Next Story