
ఏఐ క్రియేటివ్ పోస్టర్
నెట్ ఫ్లిక్స్ లో సంచనలం, 'సెక్స్ ట్రాఫికర్ ఎప్స్టీన్ జీవితం'
డబ్బు, అధికారం, రాజకీయం.. ఈ మూడు కలిస్తే న్యాయం కూడా మూగబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే "Jeffrey Epstein: Filthy Rich"
డబ్బు, అధికారం, రాజకీయం.. ఈ మూడు కలిస్తే న్యాయం కూడా మూగబోతుందా? సెక్స్ ట్రాఫికర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఎంతమంది అమాయక ఆడపిల్లల్ని పాడుచేశాడు? అతనికంత వికారపు సంపద ఎలా వచ్చిందీ? ఎప్స్టీన్ కి బ్రిటన్ రాజుకి ఉన్న సంబంధమేమిటీ? మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో లింకేంటీ? ట్రంప్ టీమ్ లోని లేబర్ సెక్రటరీ పదవెందుకు ఊడిందీ? అన్ని తెలిసిన ఆ న్యాయమూర్తి ఆ మదాందుణ్ణి ఎందుకు వదిలేశారు? చివరకి అతడెందుకు కుక్కచావు చచ్చాడు? ఇలాంటి అనేక సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే "Jeffrey Epstein: Filthy Rich" (జెఫ్రీ ఎప్స్టీన్- వికారపు సంపద)డాక్యుమెంటరీ సీరీస్.
ప్రస్తుతం ప్రపంచ కుబేరులను వణికిస్తున్న పేరు జప్రీ ఎప్స్టీన్. ఇతని చీకటి సామ్రాజ్యంలో ఓలలాడిన వందలాది సుఖపురుషుల రంకు గురించి పుంఖానుపుంఖాలుగా బయటపడ్డ 30 లక్షల పేజీల్లో ఎవరి పేరు ఎప్పుడు వస్తుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు. వారిలో మన దేశానికి చెందిన ఓ కేంద్ర మంత్రి కూడా ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఇటువంటి దశలో నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన భవంతులు, ఎలైట్ క్లాస్ డిన్నర్లు, విందులు, వినోదాలు, వాటి వెనుక దాగి ఉన్న లైంగిక దోపిడీ వంటి చీకటి సామ్రాజ్యాల సమాహారమే ఈ సీరీస్.
Jeffrey Epstein జీవితం ఒక వ్యక్తిగత నేరగాథగా మాత్రమే కాకుండా, వ్యవస్థల వైఫల్యానికి ప్రతీకగా ఎలా మారిందో ఈ డాక్యుమెంటరీ స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం క్రైమ్ కథ కాదు- ఇదో అధికారపు చట్రంలో దాగిన అన్యాయాన్ని వెలికితీసే సామాజిక సాక్ష్యం.
డాక్యుమెంటరీలు సాధారణంగా ఏదైనా ఒక ఘటనను చెబుతాయి. కానీ Jeffrey Epstein: Filthy Rich అంతకు మించి ఒళ్లు జలదరించే వాస్తవాలను చెబుతుంది. వ్యవస్థల వైఫల్యాన్ని, అధికారం ఎలా రక్షణ కవచంగా మారుతుందో కళ్లకు కడుతుంది.
ఈ సిరీస్ లో కేంద్రమైన వ్యక్తి Jeffrey Epstein. ఇతనో యూధు మూలాలున్న వ్యక్తి. చాలా సాదాసీదా కుటుంబం. తండ్రిది చిన్న వ్యాపారం, తల్లి ఓ స్కూలు టీచర్. అతనికో అన్న. మంచి మాటకారి. అవతని వాళ్లను బురిడీ కొట్టించడంలో దిట్ట. సరిగ్గా అలాగే డిగ్రీ కూడా లేకుండానే సైంటిస్ట్ అవతారమెత్తుతాడు. స్టాక్ బ్రోకర్ అవుతాడు. అధికార, అనధికార వర్గాల అవసరాలు తీరుస్తాడు. సుఖం అనే దానికి ఇతనో నగ్నావతారం. రెండు ప్రైవేటు విమానాలు, సొంతం కోసం కొనుక్కున్న రెండు ద్వీపాలు (ఐలాండ్స్), ఫ్లోరిడా తీరప్రాంతంలో మరెవరికీ లేనటువంటి రాజసౌధాలు, ఇలా ఒకటేమిటీ.. అతనికి లేనిది లేదంటే నమ్మండి. కానీ ఈ తణుకు బెణుకుల మెరుపు ప్రపంచం వెనుక ఉన్నది మైనర్ బాలికల మాంసపు ముద్దలు. వందలాది మంది అభం శుభం తెలియని ఆడపిల్లల శరీరాలు.
బాధితుల స్వరమే ఈ కథనానికి మూలం..
ఈ డాక్యుమెంటరీలో అత్యంత ప్రభావవంతమైన అంశం బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలాలు. ముఖ్యంగా Virginia Giuffre వంటి మహిళలు తమ అనుభవాలను నిస్సందేహంగా పంచుకోవడం సిరీస్‌కు నైతిక బలం.
ఈ సీరీస్ ను తెరకెక్కించినందుకు ఆ దర్శకురాలు Lisa Bryant ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో. ఎన్నెన్ని పాట్లు పడిందో మాటల్లో చెప్పలేం. సెన్సేషన్ వైపు వెళ్లకుండా ఏ మాత్రం తోట్రుపాటు లేకుండా బాధితుల అనుభవాలను గౌరవంగా, నెమ్మదిగా వినిపిస్తుంది. కెమెరా వారి ముఖాలపై ఎక్కువ సేపు నిలిపి, ప్రేక్షకుడికి మింగుడు పడని ఓ నిజానికి ఎదురుగా నిలబెడుతుంది. ఇంత దారుణమే మీ పిల్లలకు జరిగితే అనే ప్రశ్న వేయకుండానే మనం జవాబు చెప్పుకునేలా చేస్తుంది.
Filthy Rich ఒక వ్యక్తి పాపాల చిట్టా కాదు. ఇది మూడు వ్యవస్థల క్షుద్ర అవస్థ. డబ్బు, అధికారం, నెట్‌వర్క్ ప్రభావం. ఈ మూడు కలిసినప్పుడు, బాధితుల గొంతు కీచుగొంతుకవుతుంది.
ఎప్స్టీన్ చావు అనేక ప్రశ్నలు జవాబు లేకుండా పోయినా బాధితుల వాంగ్మూలాలను చరిత్రకెక్కించడం ఈ డాక్యుమెంటరీ ఘనత.
జెఫ్రీ ఎప్‌స్టీన్: ఫిల్తీ రిచ్ (Jeffrey Epstein: Filthy Rich) సీరీస్ నాలుగు ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ సుమారు 55-57 నిమిషాలు ఉంది.
ఎపిసోడ్-1: Hunting Grounds (హంటింగ్ గ్రౌండ్స్). ఇందులో ఎప్‌స్టీన్ ఆడపిల్లలకు ఎలా వల వేస్తాడు అనేది డీల్ చేస్తుంది. 1996 నుంచి మొదలవుతుంది. తన గర్ల్ ఫ్రెండ్ తో, తన డబ్బు, సోషల్ సర్కిల్ తో మైనర్ బాలికలను టార్గెట్ చేయడం ఈ భాగంలో ఉంటుంది. ప్లోరిడాలోని పామ్ బీచ్ మాన్షన్‌లో జరిగిన అకృత్యాలను వివరిస్తుంది.
మనకు తెలిసిన పిరిమిడ్ స్కీం యోగం, ధ్యానానికి సంబంధించింది. ఎప్‌స్టీన్ "పిరమిడ్ స్కీమ్" మాత్రం గొలుసుకట్టు రిక్రూట్మెంట్. ఒకరు ఇంకొకర్ని తీసుకురావాలి. వాళ్లు ఇంకొందర్ని తీసుకురావాలి. అలా మనదేశంలోని చెయిన్ మార్కెటింగ్ మాదిరి బాధితులను ఒకరికొకరు రిక్రూట్ చేయించడం ఇతని వ్యవస్థ.
ఎప్స్టీన్ కబంధ హస్తాల నుంచి బయటపడిన వారి (సర్వైవర్స్) ఇంటర్వ్యూలతో మొదలవుతుంది. ఎలా వంచనకు గురయ్యారో, ఎలా భయపెట్టారో డీల్ చేస్తుంది ఈ భాగం.సర్వైవర్స్ కథలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి.
ఎపిసోడ్ 2: Follow the Money (ఫాలో ది మనీ)
ఎప్‌స్టీన్ కి సంపద ఎలా వచ్చింది, అది ఎలా అతనికి రక్షణ కల్పించిందనేది డీల్ చేస్తుంది. ఫైనాన్షియల్ డీల్స్, బ్యాంకింగ్ కనెక్షన్లు, పవర్‌ఫుల్ వ్యక్తులతో సంబంధాలు, 2005-2008 మధ్య పామ్ బీచ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందీ, మాజీ పోలీసు చీఫ్ మైఖేల్ రీటర్ ఇంటర్వ్యూ వంటివి ఈ ఎపిసోడ్ లో ఉంటాయి. డబ్బుతో దేన్నైనా కొనగలను అనే ధైర్యం రావడానికి కారణమేంటో వివరిస్తుంది. వ్యవస్థలోని లోపాలు, బలవంతుల ప్రభావాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తుంది.
ఎపిసోడ్ 3: The Island (ది ఐలాండ్)
ఎప్‌స్టీన్ కి రెండు సొంత ద్వీపాలు ఉన్నాయి. (ప్రైవేట్ ఐలాండ్స్).అవి లిటిల్ సెయింట్ జేమ్స్, US వర్జిన్ ఐలాండ్స్ లో. ఇవి ఓ రకంగా చెప్పాలంటే టెర్రర్ , టార్చర్ హౌసెస్. ఇక్కడ అరిచే అరుపులు ఆ నాలుగు గోడల మధ్య ఆగిపోవాల్సిందే. చుట్టూ మనుషులెవరూ ఉండరు గనుక ఆ ఆర్తనాధాలన్నీ గాల్లో కలిసిపోవాల్సిందే. ఐలాండ్‌ను "పీడోఫైల్ ఐలాండ్" అని పిలవడం ఎందుకు వచ్చింది, అక్కడికి బాధితులను ఎలా తీసుకెళ్తారు, ఎవరెవరు వచ్చేవారు అనేవి ఈ ఎపిసోడ్ లో ఉంటాయి. మరియా ఫార్మర్ లాంటి బాధితులు తమ ఐలాండ్ అనుభవాలను వివరిస్తుంటే మనసున్నఎవరికైనా కళ్లంట నీళ్లు జలజలా రాలాల్సిందే. ఈ సీరీస్‌లో అత్యంత డిస్టర్బింగ్ ఎపిసోడ్ ఇది. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఇది చూపిస్తుంది.
ఎపిసోడ్ 4: Finding Justice (ఫైండింగ్ జస్టిస్)
బాధితుల న్యాయ పోరాటం, 2019లో మియామి హెరాల్డ్ జర్నలిస్ట్ జూలీ కె. బ్రౌన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఎప్‌స్టీన్‌ను మళ్లీ అరెస్టు చేయించిందీ, న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద చావు, వర్జీనియా గిఫ్రే లాంటి సర్వైవర్స్ లీగల్ ఫైట్ ను చూపుతుంది. ఆశ నిరాశల మధ్య న్యాయం ఇంకా చచ్చిపోలేదన్న సందేశంతో ముగిసినా అంతు చిక్కని ప్రశ్నలు, జవాబులు ఎన్నో..
ఇన్ని ఘోరాలు చేసినా తాను అమాయకుణ్ణని తప్పించుకునేందుకు ఎప్‌స్టీన్ కోర్టు విచారణలో చూపే హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ మనకు ఆగ్రహావేశాలను తెప్పిస్తాయి. ఒంటి నిండా పూసుకున్న డబ్బు మదం, అహంకారంతో తాను గతంలో తప్పించుకున్నట్టే 2019లోనూ తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం, అతని చుట్టూ కుక్కపిల్లల్లా తిరిగే అమెరికన్ టాప్ మోస్ట్ లాయర్లు, వాళ్ల భాష చూస్తే మనకు ఒళ్లు మండిపోతుంది. కోపం కట్టలు తెగేలా చేస్తుంది. ఆలోచన రేపుతుంది.
2008 ప్లీ డీల్- న్యాయవ్యవస్థపై ప్రశ్నలు..
ఇటువంటి డీల్ మనకు ఉందో లేదో గాని అమెరికాలో వివాదాస్పదమైంది ప్లీ డీల్. (Plea Deal). సిరీస్‌లో అత్యంత ముఖ్యమైంది ఇది. 2008లో జరిగింది. తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, తక్కువ శిక్షతో బయటపడడం- అదీ ప్రత్యేక సౌకర్యాలతో..
అమెరికన్ న్యాయవ్యవస్థపై అనుమానాలు రేకెత్తించింది. ఈ ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైంది కూడా. “అధికారానికి ప్రత్యేక న్యాయం ఉందా?” అనే ప్రశ్నను ఇది బలంగా లేవనెత్తుతుంది. తిమ్మిని బమ్మి చేయగల లాయర్లు ఉంటే ఏదైనా సాధ్యమే అనే భావన కలుగుతుంది. మన దేశంలో బడాబడా లాయర్లు చేసేవి చూస్తుంటాం గనుక మనమేమి పెద్దగా విస్తుపోం.
ఎలైట్ నెట్‌వర్క్ – స్పష్టతకు మించిన సంకేతాలు
ఎప్స్టీన్ చుట్టూ ఉన్న బలవంతుల నెట్ వర్క్ గురించి చాలా జాగ్రత్తగా విషయాలను వివరిస్తుంది ఈ సీరీస్. డైరెక్టరు మొదలు మొత్తం టీమ్ అంతా ఆ జాగ్రత్తలు బాగా పాటించింది. ప్రత్యేకించి బ్రిటన్ రాజును బీబీసీ ఇంటర్వ్యూ చేస్తున్న తీరు ఇందుకు పెద్ద ఉదాహరణ. అయినా, ప్రేక్షకుడికి “ఇంకా ఏముంది?” అనే ప్రశ్న మిగులుతుంది. పూర్తి విచారణాత్మక లోతు లేకపోవడం ఈ సిరీస్ బలహీనతగా కూడా భావించవచ్చునేమో.
నెట్‌ఫ్లిక్స్‌లో చాలా కాలం కిందటే విడుదలైన “Jeffrey Epstein: Filthy Rich” సీరీస్ 2026లో బాగా పాపులర్ అయింది. ఎప్‌స్టీన్ పేపర్ల లీకేజీతో అతని నేరాల చిట్టాపై శోధన పెరిగింది. #MeToo మూవ్‌మెంట్ బలంగా ఉన్న సమయంలో వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది. ఈ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ ను మించి ఉత్కంఠ రేపుతుంది.
“Filthy Rich” కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. అధికారం, హోదా, సంపద, న్యాయ వ్యవస్థ కలగలిపితే జరిగే దుర్మార్గాలు ఎలా ఉంటాయనే దానికి అద్దం. ఇది చూసిన తర్వాత మీలో ఆగ్రహం పెల్లుబకవచ్చు. కీచు గొంతుకలు కూడా పెద్దగా అరవగలవు అన్పించవచ్చు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అని అరవవచ్చు.
Next Story

