
విజువల్ విస్ఫోటనం: 'క్రూయెల్లా' రివ్యూ
ఆస్కార్ కొట్టిన మాయాజాలం!
ఈ కథ 1970ల నాటి లండన్ నగరంలో జరుగుతుంది. అప్పట్లో అక్కడ 'పంక్ రాక్' (Punk Rock) విప్లవం నడుస్తోంది. ఫ్యాషన్ అంటే అందరికీ పిచ్చి. ఈ నేపథ్యంలో పుట్టిన ఒక అమ్మాయే ఎస్టెల్లా (ఎమ్మా స్టోన్). ఎస్టెల్లాకు పుట్టుకతోనే జుట్టు సగం నలుపు, సగం తెలుపు రంగులో ఉంటుంది. ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం, కానీ ఆమె ప్రవర్తన కాస్త వింతగా, మొండిగా ఉండటంతో అందరూ తనను 'క్రూయెల్లా' అని పిలుస్తూంటారు.
ఒక అనుకోని ప్రమాదంలో ఎస్టెల్లా తన తల్లిని కోల్పోతుంది. దిక్కులేని స్థితిలో లండన్ చేరుకున్న ఆమెకు జాస్పర్, హోరేస్ అనే ఇద్దరు చిన్న దొంగలు పరిచయమవుతారు. వీరు ముగ్గురూ కలిసి లండన్ వీధుల్లో దొంగతనాలు చేస్తూ బతుకుతుంటారు. ఎస్టెల్లా తన తెలివితేటలతో, అద్భుతమైన డ్రెస్ డిజైన్లతో రకరకాల మారువేషాలు వేసి జనాలను బురిడీ కొట్టిస్తుంటుంది.
ఎస్టెల్లాకు ఫ్యాషన్ ప్రపంచంలో పెద్ద డిజైనర్ అవ్వాలని కోరిక. ఒకరోజు ఫ్యాషన్ ప్రపంచంలో మహారాణి లాంటి బారోనెస్ వోన్ హెల్మాన్ (ఎమ్మా థాంప్సన్) కంట ఎస్టెల్లా పడుతుంది. ఎస్టెల్లా ప్రతిభను చూసి బారోనెస్ ఆమెను తన దగ్గర పనికి కుదుర్చుకుంటుంది. బారోనెస్ చాలా తెలివైనది, కానీ అంతే క్రూరమైనది కూడా.
బారోనెస్ దగ్గర పనిచేస్తున్న సమయంలో ఎస్టెల్లాకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన తల్లి మరణానికి కారణం మరెవరో కాదు, సాక్షాత్తూ ఈ బారోనెస్ అని అర్థమవుతుంది. దాంతో ఎస్టెల్లా మనసులో పగ రగులుతుంది. తన తల్లి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటివరకు సాదాసీదాగా ఉన్న ఎస్టెల్లా, తనలోని క్రూరమైన మారురూపం 'క్రూయెల్లా డి విల్' ను బయటకు తీస్తుంది.
క్రూయెల్లా తన ఫ్యాషన్ డిజైన్లనే ఆయుధాలుగా చేసుకుని బారోనెస్‌కు చుక్కలు చూపిస్తుంది. బారోనెస్ నిర్వహించే ప్రతి ఫ్యాషన్ షోలోనూ ఊహించని రీతిలో ఎంట్రీ ఇస్తూ ఆమెను అవమానిస్తుంది. చివరకు బారోనెస్ అసలు రంగును ప్రపంచానికి చూపిస్తూ, ఆమె సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేసింది అనేదే ఈ సినిమా క్లైమాక్స్. అదెలా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
సాధారణంగా డిస్నీ కథల్లో విలన్ అంటే హీరోకి అడ్డుగా నిలిచే వ్యక్తి గా చూపిస్తూంటారు. కానీ క్రూయెల్లా స్క్రీన్‌ప్లే ఆ రూల్‌ను పూర్తిగా రివర్స్ చేస్తుంది. ఇక్కడ కథ హీరో విజయం గురించి కాదు. ఒక వ్యక్తి తనను తాను తయారు చేసుకునే ప్రక్రియ గురించి. స్క్రిప్ట్ మొదట నుంచే ఒక ప్రశ్న వేస్తుంది: ఎస్టెల్లా పుట్టుకతోనే చెడ్డదా? లేక పరిస్థితులు ఆమెను అలా చేశాయా? ఎస్టెల్లాలో లోపల రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. బయటికి: కాస్త భయపడే, ప్రేమను కోరుకునే అమ్మాయి. లోపల: అహంకారం, తిరుగుబాటు, ఆకలి ఉన్న ఆర్టిస్ట్. ఇక ఆమె జుట్టులో ఉన్న నలుపు-తెలుపు కేవలం స్టైల్ కాదు . అది స్క్రిప్ట్‌కు విజువల్ థీమ్. ఓ రకంగా ఈ కథ “split morality character arc”.
ఇక ఈ స్క్రిప్టులో విశేషం ఏమిటంటే..ఇక్కడ స్క్రిప్ట్ మనకు క్రూయెల్లాపై సానుభూతి కలిగిస్తుంది. ఆమెను ముందు మనలా రకరకాల ఇబ్బందులు,బాధలు ఉన్న మనిషిగా చూపించడం.ఇదే రైటింగ్ ట్రిక్. ఇక నెగిటివ్ క్యారక్టర్ బారోనెస్ ఎంట్రీతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సినిమా జానర్ మారుతుంది. మరో చిత్రం ఏమిటంటే..ఇక బారోనెస్ ఒక సాధారణ విలన్ కాదు. ఆమె ఎస్టెల్లా భవిష్యత్ ప్రతిబింబం.ఇది స్క్రీన్‌ప్లేలో అరుదుగా వాడే “Mirror Antagonist” అనే టెక్నిక్. అలాగే కథ మెయిన్ థీమ్: మనం ఓడించాలనుకునే వ్యక్తిలాగే మారిపోతే… గెలిచినట్టేనా? అనే తాత్విక ప్రశ్నను మన మధ్య ఉంచుతుంది.
ఓటమిని ఒప్పుకోని ఇద్దరు ప్రతిభావంతులైన మహిళల మధ్య జరిగే ఈ 'ఫ్యాషన్ వార్' ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంది. అమాయకపు ఎస్టెల్లా కాస్తా.. పగతో రగిలిపోయే 'క్రూయెల్లా'గా ఎలా మారిందో ఈ కథలో అద్భుతంగా చూపించారు.
నటీనటుల్లో ..
ఎమ్మా స్టోన్ ఎస్టెల్లా నుంచి క్రూయెల్లాగా మారే ట్రాన్స్ఫర్మేషన్‌ను స్టెప్-బై-స్టెప్‌గా చూపిస్తూ భావోద్వేగాలు, అహంకారం, పిచ్చి — మూడు షేడ్స్‌ను బ్యాలెన్స్ చేస్తే, ఎమ్మా థాంప్సన్ బారోనెస్‌గా ఎంటర్ అయ్యే ప్రతి సీన్‌ను ఒక్క చూపుతోనే తన కంట్రోల్‌లోకి తీసుకెళ్లి స్క్రీన్‌ని డామినేట్ చేస్తుంది. ఇద్దరూ ఎదురెదురుపడే సన్నివేశాలే సినిమా హైలైట్; మిగతా క్యారెక్టర్లు ఎక్కువగా బ్యాక్‌డ్రాప్‌లా మిగిలిపోతే, జాస్పర్-హోరేస్ మాత్రం కథకి హ్యూమర్,హ్యూమన్ కలగలిపిన టచ్ ఇస్తారు.
టెక్నికల్ హైలైట్స్:
టెక్నికల్ గా ఈ సినిమా ఒక 'మాస్టర్ పీస్'. స్క్రీన్ మీద ఆ రంగులు, లైటింగ్ చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం కష్టం!
కాస్ట్యూమ్స్ (ఆస్కార్ లెవల్): ఈ సినిమాకు అసలైన ప్రాణం ఇందులోని డ్రెస్సులే. పాత పేపర్లు, చెత్తతో తయారు చేసిన డ్రెస్సుల నుంచి రాయల్ గౌన్ల వరకు.. ప్రతీదీ ఒక అద్భుతం. అందుకే దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది.
1970ల లండన్ సెటప్: మనం నిజంగా 1970ల నాటి లండన్ వీధుల్లో ఉన్నామా అన్నట్టుగా సెట్స్ ఉంటాయి. ఆ కాలం నాటి బిల్డింగ్స్, కార్లు, పంక్ రాక్ కల్చర్‌ను పర్ఫెక్ట్‌గా రీ-క్రియేట్ చేశారు.
మేకప్ & హెయిర్: సగం నలుపు-సగం తెలుపు జుట్టుతో ఎమ్మ స్టోన్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఆమె వేసే మారువేషాలు, ముఖం మీద 'ద ఫ్యూచర్' అని రాసి ఉండే మేకప్ సీన్ హైలైట్.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సినిమాలో మ్యూజిక్ మామూలుగా ఉండదు. సీన్ లో ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే క్లాసిక్ రాక్ సాంగ్స్ సినిమాకు పెద్ద ప్లస్.
సినిమాటోగ్రఫీ: కెమెరా వర్క్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్ షోలు జరిగేటప్పుడు వచ్చే విజువల్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
ఫైనల్ థాట్
డిస్నీ నుంచి వచ్చే సినిమాలు అంటే ఏదో పిల్లల కోసం అనుకుంటే పొరపాటే! 'క్రూయెల్లా' చూస్తే ఆ ఫీలింగ్ మొత్తం మారిపోతుంది. 1970ల నాటి లండన్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫ్యాషన్ ప్రపంచాన్ని వణిగించిన ఒక లేడీ విలన్ కథ ఇది. పగ ప్రతీకారంతో రగిలిపోయే ఒక యువతి.. తన మేధస్సుతో ఒక సామ్రాజ్యాన్నే ఎలా కూల్చేసింది అనేది ఈ సినిమా హైలైట్. కేవలం కథ కోసమే కాదు.. విజువల్స్, స్టైల్ మరియు రివెంజ్ డ్రామా ఇష్టపడే వారికి 'క్రూయెల్లా' ఒక విందు లాంటిది.
ఏ ఓటిటిలో ఉంది
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఈ సినిమా ఉంది.

