
గుణ శేఖర్ కొత్త సినిమా ‘యుఫోరియా’ రివ్యూ
భూమిక క్యారెక్టర్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాకే!
వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి) ఒక టాప్ పబ్లిక్ స్కూల్ లో చదువుతూంటాడు. వింధ్య (భూమిక) ఆ స్కూల్ ప్రిన్సిపల్, తండ్రి వివేక్ (రోహిత్) పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో.. ఒక పార్టీలో చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయి వికాస్ కంట పడుతుంది. తనని ఎలాగైనా లోబర్చుకోవాలని ప్లాన్ వేసిన వికాస్, మరో ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని చెప్పి చైత్రను కారులో తీసుకెళ్తాడు. కారులో కేక్ తినిపించి ఆమెకు మత్తు ఇచ్చి, ఐదుగురు కుర్రాళ్ళు కలిసి అమానవీయంగా ప్రవర్తిస్తారు.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో పొలిటికల్ లీడర్స్ తమ పిల్లలను కాపాడుకుంటారు. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ వింధ్య మాత్రం అందరిలా ఆలోచించలేదు. తన కొడుకు తప్పు చేశాడని తెలిసి, ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా.. సొంత కొడుకుకి వ్యతిరేకంగా పోలీసులకు ఆధారాలు ఇచ్చి జైలుకు పంపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రేప్ కేసును సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) దగ్గరకు వెళ్తుంది.
కోర్టు ఆ ఐదుగురు కుర్రాళ్లకు 20 ఏళ్ల శిక్ష విధిస్తుంది. అయితే, సినిమా ఇక్కడే ముగిసిపోదు. అసలు కథ జైలుకు వెళ్ళాక మొదలవుతుంది. జైల్లో ఉన్న వికాస్ డ్రగ్స్ మాఫియాతో చేతులు కలుపుతాడు. అక్కడ నుంచి ఏం జరుగుతుంది, చివరకు వింధ్య తన కొడుకు విషయమై ఏం నిర్ణయం తీసుకుంటుంది?చైత్ర జీవితం ఏమైంది అనేది మిగతా కథ.
ఎనాలసిస్
సమాజాన్ని కుదిపేసిన జుబ్లీహిల్స్ పబ్ అత్యాచార ఘటన గుర్తుంది కదా? సరిగ్గా అదే పాయింట్‌ను బేస్ చేసుకుని, దానికి డ్రగ్ మాఫియాను జోడించి దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. చాలా వరకూ 'రా' అండ్ 'రస్టిక్' మూవీ లా చేద్దామనే ప్రయత్నం చేసారు.
వయసు రాని కుర్రాళ్ళు.. విచక్షణ కోల్పోయేలా చేసే మత్తు మందులు.. అధికారం ఉన్న తండ్రులు.. ఇవన్నీ కలిస్తే ఎంతటి ఘోరం జరుగుతుందో ఈ సినిమా చూపిస్తుంది. సినిమా ప్రారంభమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వికాస్ గ్యాంగ్ విలాసవంతమైన లైఫ్ స్టైల్‌ను చూపిస్తూనే, భూమిక కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా కథపై క్యూరియాసిటీ పెంచారు. అయితే ఈ సినిమాకు సమస్య ఏంటంటే...పోక్సో చట్టం పవర్ ఏంటో చూపిస్తూ, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడటంతో ఇంటర్వెల్ కల్లా కథ ఒక కొలిక్కి వచ్చేస్తుంది. దాంతో మనకు సినిమా పూర్తైన ఫీలింగ్ వచ్చేస్తుంది. మిగతాదంతా అంటే సెకండాఫ్ లో జైలు సీన్స్ ,డ్రగ్స్ ఇలాంటివన్నీ ఎక్సటెన్షన్లా భోర్ కొట్టేస్తాయి. సినిమా
సెకండాఫ్: ఎక్కడ దెబ్బకొట్టింది?
ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు ఒక కొత్త కథను చెప్పాలనుకోవటంతో ఈ సినిమాకు సమస్య మొదలైంది. జైల్లో ఆ మైనర్ నేరస్థుల పరిస్థితి ఏంటి? బయట సమాజంలో తల్లిదండ్రులు అనుభవిస్తున్న అవమానాలు ఏంటి? అనేది చూపించాలనుకున్నారు. కానీ ఇక్కడే స్క్రిప్ట్ గాడి తప్పింది.
నిజానికి తన కొడుకును తనే జైలుకు పంపిన ఒక తల్లి వేదనను, ఆ కొడుకులో వచ్చే మార్పును చూపించడంలో అద్భుతమైన డ్రామా ఉంది. సెకండాఫ్‌లో ఆ ఎమోషన్‌ను వదిలేసి, సడన్‌గా డ్రగ్ మాఫియా, ఆపరేషన్ యుఫోరియా అంటూ ఇన్వెస్టిగేషన్ ట్రాక్‌లోకి వెళ్లడంతో కథ ఫోకస్ తప్పింది. ఫలితంగా అద్భుతమైన క్లైమాక్స్ మెసేజ్ ఉన్నప్పటికీ, అక్కడి వరకు వచ్చే ప్రయాణం నీరసంగా సాగింది.
దానికి తోడు ఆసక్తికరమైన డ్రామా సాగాల్సిన చోట, వార్తల్లో చదివిన విషయాలన్నీ పోగేసి చూపిస్తున్నట్టు ఉండటంతో చూసేవాళ్లకు బోర్ కొట్టే అవకాశం ఉంది.
హైలైట్ సీన్: చైత్ర తన తల్లిదండ్రులకు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పే సీన్ ఎవరినైనా కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇన్వెస్టిగేషన్: పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) కేస్ డీల్ చేసే తీరు, సీన్ రీ-క్రియేషన్ సీన్లు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అయితే కొన్ని సీన్లు (ప్రైవేట్ పార్ట్స్ గురించి చర్చ) సున్నిత మనస్కులకు ఇబ్బంది కలిగించవచ్చు.
ఎవరెలా చేసారు
సారా అర్జున్ ఎమోషన్స్, భూమిక పవర్, గౌతమ్ మీనన్ స్టైల్ అదిరిపోయాయి. కొత్త కుర్రాళ్లు కూడా నేచురల్‌గా భయపెట్టారు.
టెక్నికల్ టార్చర్: కాలభైరవ మ్యూజిక్ మరీ లౌడ్‌గా ఉంది, సాంగ్స్ అస్సలు బాలేవు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నటన పరంగా అందరూ అదరగొట్టినా, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ మైనస్‌లు సినిమా ఫీల్‌ని దెబ్బతీశాయి.
ఫైనల్ థాట్:
'యుఫోరియా' ఒక బలమైన ఆలోచన, బలహీనమైన కథనం. జుబ్లీహిల్స్ ఘటన వంటి సెన్సేషనల్ ఇష్యూని తీసుకున్నప్పుడు, దానికి సమాజంపై ఉండే ఇంపాక్ట్‌ని సినిమాటిక్ డ్రామాతో కలిపి ఉంటే ఇది మరో 'ఆర్టికల్ 15' లాగా ఉండేది. కానీ, డాక్యుమెంటరీ ఛాయలు ఎక్కువవ్వడం, కథ ఇంటర్వెల్ లోనే ముగిసిపోవడం వల్ల ఒక అద్భుతమైన ఆలోచన వృథా అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది.

