
‘జన నాయకుడు’ మూవీ రిలీజ్‌కు లైన్‌క్లియర్
U/A సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు...
తమిళ నటుడు విజయ్(Vijay) ప్రధాన పాత్రలో నటించిన 'జన నాయకుడు' (Jana Nayagan) విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) U/A సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. సినిమా సర్టిఫికేషన్ విషయంలో CBFC నుంచి ఆలస్యం జరుగుతుండటంతో చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సెన్సార్ బోర్డు ఆలస్యం చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తూ, వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై CBFC అపీలుకు వెళ్లినట్లు సమాచారం. చిత్రంలో భారత సైన్యానికి సంబంధించిన చిహ్నాలను అనుమతి లేకుండా ఉపయోగించారనే అంశాన్ని CBFC తన అపీల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియపై కొంత అనిశ్చితి కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సినిమా విడుదలకు లీగల్ అడ్డంకులు తొలగినట్టే అయినప్పటికీ.. CBFC అపీలు కారణంగా విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు, విజయ్ అభిమానులు ఈ తీర్పుతో ఊపిరి పీల్చుకుంటూ, సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అసలు వివాదం ఏమిటి?
'జన నాయకుడు' మూవీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం గత డిసెంబరులో మేకర్స్ సినిమాను పంపించారు. అయితే కొన్ని సీన్స్‌పై అభ్యంతరం తెలిపిన సెన్సార్ బోర్డు వాటిని తొలగించాలని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో వారు చెప్పినట్లుగానే మార్పులు చేసిన మేకర్స్ మళ్లీ సర్టిఫికెట్ కోసం పంపించారు. అయితే ఆ తర్వాత సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
మూవీకి తొలుత U/A సర్టిఫికెట్ సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై విచారించిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విని బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా... సినిమాకు ముందు సిఫార్సు చేసిన U/A సర్టిఫికెటే ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, నరైన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. విజయ్ పాలిటిక్స్‌లోకి వెళ్లడంతో ఇదే లాస్ట్ మూవీ అని ప్రకటించారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

