
‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’ రివ్యూ
ఇది పూర్తి శవం మేనేజ్‌మెంట్ కామిక్ థ్రిల్లర్!
కొంతమంది కుటుంబాల్లో ఆస్తి గొడవలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో అక్రమ సంబంధాలు బయటపడతాయి. కానీ ఈ ఫ్యామిలీ స్పెషాలిటీ ఏంటంటే —దేవుడితో బిజినెస్ చేసి, శవంతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం!
భరతన్ నాయర్ చనిపోగానే, పెద్ద కొడుకు శశిధరన్ (సైజూ కురుప్) జీవితంలో “ఫ్యామిలీ ప్యాక్ కష్టాలు” మొదలవుతాయి. తండ్రి వదిలింది ప్రేమ కాదు… పాపాల EMIలు. “నాన్నకి మరో ఫ్యామిలీ ఉందట” అన్న షాక్ నుంచి బయటపడకముందే, ఇంకో బాంబ్ — “నాన్న గారు దేవుడినే స్టార్టప్‌గా వాడుకున్నారు!”. “నాన్న గారు జీవితంలో చాలా సైలెంట్ గా ఉన్నారు” అనుకుంటే… అసలు ఆయన సైలెన్స్ వెనకాలే పూర్తి సీరియల్ దాక్కుని ఉంటుందని అర్దం అవుతుంది.
“మంచి మనసుతో ఇల్లు కట్టించాడు… కర్మ వచ్చి గేటు తట్టింది!”
తండ్రి సెకండ్ ఫ్యామిలీ గురించి తెలిసిన తర్వాత, శశిధరన్ వాళ్లను కూడా సెటిల్ చేయాలని ఫిక్స్ అవుతాడు. పిన్ని రుక్మిణి, ఆమె కొడుకుకి కొత్త ఇల్లు కట్టించి, “ఇక అందరూ హ్యాపీ” అనుకునే టైమ్‌లోనే కథలోకి దిగుతాడు గోవిందరాజన్ (సూరజ్ వెంజరమూడు). అతను మనిషిలా రాడు…“ కుటుంబ రహస్యాల డెలివరీ బాయ్”లా, Income Tax Raidకి ముందు వచ్చే సమాచారం లా వస్తాడు.
అలా వచ్చిన గోవిందరాజన్ చెప్పే కథ వింటే, ఊరి దేవుళ్లకే BP వచ్చేస్తుంది. “మోహినేశ్వరి ఆలయం గుర్తుందా? అది భక్తి కాదు బాస్…పెద్ద స్కామ్.. మీ నాన్న చేసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్!” అని బాంబ్ పేలుస్తాడు. నకిలీ గుడి కట్టి, జనాల భక్తిని UPI స్కానర్‌లా వాడుకుని డబ్బులు కొట్టేశారని చెప్తాడు. ప్లాన్ వేసి, నకిలీ గుడిని క్రియేట్ చేసి భక్తులు హుండీ లో వేసిన డబ్బులు తినేసి ఆస్తులు సంపాదించుకున్న బాపతు అని తేలుస్తాడు.
అయితే ఇప్పుడు ఆ స్కామ్ బయటపడబోతోందని, ఓ ఆఫీసర్ అదే పనిమీద తిరుగుతున్నాడని రివీల్ చేస్తాడు. కాబట్టి కేసు మొత్తం ఎలాగూ చచ్పిపోయాడు కాబట్టి హీరో తండ్రి భరతన్ మీదే వేసేద్దాం అంటాడు. కుటంబ సభ్యులు దానికి ఒప్పుకోకపోవటంతో.. ఆ కేసు బయిటకు రాకుండా మూయించటానికి ఆఫీసర్ కు ఇవ్వటానికి వాళ్ల వాటాగా 75 లక్షలు కావాలని ప్రపోజల్ పెడతాడు. దాంతో చనిపోయిన మనిషి పరువు కూడా ఇప్పుడు EMIలోనే కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడా డబ్బులు ఎలా తేవాలి. అతన్ని నమ్మేదెలా అసలు అనే టెన్షన్ మొదలవుతుంది ఆ ఫ్యామిలీలో.
“బ్లాక్‌మెయిలర్ కి ఓవర్ యాక్షన్ ఎక్కువైతే…”
శశిధరన్ ఫ్యామిలీ ఈ కొత్త టెన్షన్‌లో టెన్షన్ పడుతూ ఉంటే, గోవిందరాజన్ మాత్రం Netflix subscription లా ప్రతి రోజు కొత్త ప్రెజర్ పెడుతుంటాడు. డబ్బు ఇవ్వండి, లేదంటే మీ నాన్న నిజాలు బయిటపెట్టి పరువు తీస్తానంటూ.. టార్చర్ మొదలుపెడతాడు. అతని ఫాలోఅప్ చూస్తే బ్యాంక్ లోన్ రికవరీ వాళ్లు కూడా జాబ్ మానేస్తారు.
“డబ్బు ఎప్పుడు?” “ఇంకెంత టైం?” “నిజం బయటపెడతా!” అంటూ ఫ్యామిలీ మీద పడిపోతుంటాడు.
చివరికి ఒక రోజు…
వాళ్ల సహనం చనిపోతుంది.
అతడూ చనిపోతాడు. సారీ..ఫ్యామిలీ మొత్తం కలిపి చంపేస్తారు.
అక్కడి వరకు సినిమా “టెన్షన్ కామెడీ” అయితే… అక్కడి నుంచి “శవం మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్!”
శవం దాచడం కన్నా… చనిపోయిన వ్యక్తి కోసం తిరిగే జనాలని హ్యాండిల్ చేయడం కష్టం! అయ్యిపోతుంది. గోవిందరాజన్ మేనల్లుడికి విషయం తెలియకుండా, శవాన్ని మాయం చేయడానికి వీళ్లు రకరకాల ప్రయత్నాలు మొదలెడతారు. అవి బెడిసికొడుతూనే ఉంటాయి. ఒక అబద్ధం కప్పిపుచ్చడానికి మరో అబద్ధం… దాన్ని దాచటానికి ఇంకో డ్రామా.
అలా ఇంట్లో ప్రతి ఒక్కరూ “క్రైమ్ పార్టనర్స్” అయిపోతారు. కానీ ప్లానింగ్ మాత్రం WhatsApp ఫ్యామిలీ గ్రూప్ అడ్మిన్స్ స్థాయిలో ఉంటుంది! ఉదాహరణకు ..శవాన్ని దాచే ప్లానింగ్ మాత్రం ఇలా ఉంటుంది — “Google Maps ఓపెన్ చెయ్యరా… దగ్గర్లో ఖాళీ స్థలం ఎక్కడుందో చూద్దాం!” ఇలా మొదలైన డ్రామా ఎక్కడ ముగిసింది. ఫ్యామిలీ మొత్తం ఆ హత్య కేసు నుంచి తప్పించుకున్నారా..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.నవ్వుకోవాల్సిందే.
విశ్లేషణ
ఓ రకంగా ఇది దృశ్యం సినిమాకు కామెడీ వెర్షన్ అని చెప్పాలి. Mohiniyattam ను సాధారణ కామెడీగా చూస్తే, ఇందులో చాలా సీన్స్ “ఇది నవ్వే విషయమేనా?” అనిపిస్తాయి.కానీ నవ్వుతాము. అదే డార్క్ కామెడీ అసలు స్వభావం. మనిషి భయపడాల్సిన పరిస్థితిని, సినిమా నవ్వించే విధంగా చూపిస్తుంది. అదే సమయంలో ఆ నవ్వు వెనకాల ఒక అసౌకర్యం, ఒక వ్యంగ్యం దాక్కుని ఉంటుంది. డార్క్ కామెడీకి కొన్ని బేసిక్ నియమాలు ఉంటాయి. ఈ సినిమా వాటిని చాలా తెలివిగా వాడుకుంది.
ఈ సినిమాలో ఒక మనిషి చనిపోవడం అనేది సీరియస్ విషయం. కానీ ఆ శవాన్ని దాచేందుకు కుటుంబం చేసే ప్రయత్నాలు చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే వాళ్లు క్రిమినల్స్‌లా కాకుండా, పరీక్షలో కాపీ కొట్టిన స్టూడెంట్స్‌లా టెన్షన్ పడతారు. ఒకరు ప్లాన్ చెబుతారు. ఇంకొకరు భయపడతారు. మరొకరు అబద్ధం మర్చిపోతారు. ఇది డార్క్ కామెడీకి ప్రధాన లక్షణం . పాత్రలు పరిస్థితికి సరిపడేంత “ప్రొఫెషనల్” గా ఉండవు.
కోయెన్ బ్రదర్స్ సినిమాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్లు ఒకసారి అన్న మాట చాలా ఫేమస్: “మూర్ఖులు నేరం చేస్తే… అదే డార్క్ కామెడీకి బంగారం.”
ఈ సినిమాలో కూడా కుటుంబం చేసే ప్రతి పని “మాస్టర్ ప్లాన్”లా కాకుండా, “ఇప్పుడేం చేయాలి రా?” అన్న కన్ఫ్యూజన్‌లో ఉంటుంది.
అందుకే నవ్వు వస్తుంది. శవాన్ని దాచాలని నిర్ణయించుకున్న క్షణం నుంచి వాళ్ల జీవితం ఇంకా గందరగోళంగా మారుతుంది. ఒక సమస్యను పరిష్కరించేందుకు చేసిన పని, మరో కొన్ని కొత్త సమస్యలు తెస్తుంది. ఇది ఫార్గో, బర్న్ ఆఫ్టర్ రీడింగ్ లాంటి డార్క్ కామెడీల్లో కనిపించే రైటింగ్ ప్యాటర్న్.
ముఖ్యంగా — “చనిపోయిన మనిషి పరువు కోసం బ్రతికున్న వాళ్లు నేరం చేయడం” అనే ఐరనీని సినిమా అద్భుతంగా వాడుకుంది.
ఫైనల్ గా..
చాలా డార్క్ కామెడీలు చేసే తప్పు ఏమిటంటే — డార్క్ ఎక్కువై కామెడీ మరిచిపోతాయి. లేదా కామెడీ ఎక్కువై ప్రమాదం ఫీలింగ్ పోతుంది.
కానీ ‘మోహినియాట్టం’ రెండింటి మధ్య బ్యాలెన్స్ పట్టుకుంది. మనకు నవ్వు వస్తుంది. అదే సమయంలో “ఇది ఎంత దారుణమైన పరిస్థితి!” అనిపిస్తుంది. అదే నిజమైన డార్క్ కామెడీ సక్సెస్.
ఎక్కడ చూడచ్చు?
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది

