ట్రెండీ లవ్ స్టోరీ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ రివ్యూ
x

ట్రెండీ లవ్ స్టోరీ : ‘కపుల్ ఫ్రెండ్లీ’ రివ్యూ

-రొమాన్స్ మాత్రమే కాదు.. గుండెల్ని పిండేసే ఎమోషన్!


శివ (సంతోష్‌ శోభన్‌) ఓ ఇంటీరియర్ డిజైనర్. లైఫ్ సెటిల్ అవ్వటం కోసం సొంత ఊరు నెల్లూరు నుంచి చెన్నయ్‌కు వస్తాడు. అయితే అనుకున్న స్దాయిలో ప్రాజెక్టులు రావు. దాంతో వేరే దారిలేక పార్ట్‌టైమ్‌ బైక్‌ రైడర్‌గా పనిచేస్తూంటాడు. అదే సమయంలో మిత్ర (మానస వారణాసి) పరిచయం అవుతుంది. ఆమె కి ఇంట్లో పెళ్లి చేస్తాం అనడంతో అది తప్పించుకోవడానికి ఐటీ జాబ్ అని చెప్పి చెన్నైకి వస్తుంది. అలాగే తన హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. దాంతో శివ బైక్ మీద తిరుగుతూ కొత్త హాస్టల్ కోసం వెతుకుతుంది. కానీ ఫలితం లేకపోకపోవటంతో శివ రూంకే వెళ్లి దాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది.

ఒకే ఇంట్లో ఉండటంతో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది? మెల్లిగా ఇద్దరూ అదే ఇంట్లో సహజీనవం చేస్తుంటారు. కొంతకాలానికి శివకు జాబ్ వస్తుంది. కానీ ఆమెకు రాదు. ఈలోగా ఓ చిన్న కారణంతో ఇద్దరి మధ్యా గొడవలు వస్తాయి. ఇద్దరూ బ్రేక్ చెప్పి విడిపోదామనుకుంటారు. అప్పుడు ఓ ఊహించని విషయం ఆమె జీవితంలో చోటు చేసుకుంటుంది. దాంతో మొత్తం పరిస్దితులు రివర్స్ అవుతాయి. అసలు ఆమెకు ఏమైంది? అలాగే వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ గురించి ఇంట్లో వాళ్లకు తెలిసిందా? తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిగా మారిందా? ఇందుకోసం ఎదురైన అడ్డంకులు ఏమిటి? అనేది మిగతా కథ. అది వెండితెరపై చూడాలి.

ఎలా ఉంది

తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ సినిమాని మొదటి నుంచి చివరిదాకా ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీలా చూపాలనుకున్నాడు. మరీ ముఖ్యంగా చాలా సినిమాల్లో లివ్-ఇన్ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే చూపిస్తారు. కానీ ఇక్కడ శివ, మిత్రల మధ్య కెమిస్ట్రీని చాలా నేచురల్‌గా డిజైన్ చేశారు. ఫస్టాఫ్ సరదాగా గడిచిపోతే, అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది.హీరో శివ కంటే కూడా మిత్ర పాత్రపైనే ప్రేక్షకులకు ఎక్కువ సానుభూతి కలుగుతుంది. ఆమె పాత్రలో ఉన్న డెప్త్ సినిమాను నిలబెట్టింది. సెకండాఫ్‌లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమాకు పెద్ద బలం.

అయితే క్లైమాక్స్ మాత్రం కొన్ని బాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తుంది. సుదీర్ఘ ఎమోషనల్ ప్రయాణం తర్వాత ముగింపును చాలా సింపుల్‌గా తేల్చేశారు. అయితే సినిమా స్లోగా, నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్‌ వస్తుంది. అలాగే కొన్ని రొటీన్ సీన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. వాటిని ప్రక్కన పెడితే సినిమా ఎక్కడా ఓవర్ ది బోర్డ్ వెళ్లదు. సినిమా ప్రారంభంలో హీరో శివ ఎదుర్కొనే సమస్యలు ప్రతి మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అవుతాయి. ‘బెడ్ షేరింగ్’ వంటి అంశాలను దర్శకుడు చాలా ట్రెండీగా, అదే సమయంలో అసభ్యత లేకుండా హ్యాండిల్ చేశారు.

కాపీనా? ప్రేరణా?

సెకండాఫ్ చూస్తుంటే హాలీవుడ్ క్లాసిక్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ (The Fault in Our Stars) మరియు కొరియన్ ఎమోషనల్ మూవీ ‘ఎ మోమెంట్ టు రిమెంబర్’ (A Moment to Remember), ఈ మధ్యన సూపర్ హిట్టైన హిందీ సినిమా సైయారా గుర్తొస్తాయి. ఈ రెండు సినిమాల గురించి తెలిసిన వారికి ‘కపుల్ ఫ్రెండ్లీ’లోని కీలక సన్నివేశాలు వాటిని పోలి ఉన్నాయని ఇట్టే అర్థమైపోతుంది. కొన్ని సీన్లు యథాతథంగా ఉండటం ఆశ్చర్యకరం.

టెక్నికల్ గా..

దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. చెన్నైలోని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల విజువల్స్ డాక్యుమెంటరీలా కాకుండా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తాయి.

మ్యూజిక్: ఆదిత్య రవీంద్రన్ సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. ఆహ్లాదకరమైన పాటలతో పాటు, సెకండాఫ్‌లోని ఎమోషనల్ సీన్లను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు.

డైరెక్షన్: అశ్విన్ చంద్రశేఖర్ కొత్త దర్శకుడైనా.. కథను చాలా మెచ్యూరిటీతో డీల్ చేశాడు. ఎక్కడా హద్దులు దాటకుండా, నేటి తరం ప్రేమను సింపుల్‌గా, అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేసారు..

సంతోష్ శోభన్: శివ పాత్రలో సంతోష్ ఎప్పటిలాగే తన ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు పెద్ద అసెట్.

మానస వారణాసి: తెలుగు అమ్మాయి మానస 'మిత్ర'గా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు ఆమె అతిపెద్ద ఫైండ్. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది.

ఇతర నటులు: రాజీవ్ కనకాల, యోగి బాబు తమకు దక్కిన తక్కువ స్పేస్‌లోనే మెరిశారు. మిగతా పాత్రలన్నీ పరిమితమే.

ఫైనల్ థాట్:

మీరు రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, గుండెల్ని తాకే ఒక స్వచ్ఛమైన ప్రేమకథను చూడాలనుకుంటే, 'కపుల్ ఫ్రెండ్లీ' మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది కేవలం యూత్‌కు మాత్రమే కాదు, నేటి తరం ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులకు కూడా ఒక మంచి ఐ-ఓపెనర్.

Read More
Next Story