
తిరుపతి దశ తిరుగుతోంది! ఏపీ–ఫస్ట్‌తో సరికొత్త అధ్యాయం!
తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతి ఇక కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రబిందువుగా మారబోతోంది. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా, వారికి అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో ముందుగానే గుర్తించి, ఆయా రంగాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దిశగా తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో ఈ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది రాష్ట్ర యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరవడమే కాకుండా, తిరుపతికి పూర్తిగా కొత్త గుర్తింపుని తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది.
భవిష్యత్తు రంగాలపై ప్రభుత్వ ఫోకస్
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఏరోస్పేస్–డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల సలహాదారులు, డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు రూపొందిస్తున్న ప్రణాళికలను సీఎం వివరించారు.
భవిష్యత్తులో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ–సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు కీలకంగా మారనున్నాయన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందని చెప్పారు.
దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో భాగంగా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ తరహా ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడంతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏపీ–ఫస్ట్ వస్తే ఏమవుతుంది?
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఏపీ–ఫస్ట్ కేంద్రం ద్వారా రాష్ట్ర యువతకు హైటెక్ రంగాల్లో నైపుణ్య శిక్షణ, పరిశోధన అవకాశాలు అందనున్నాయి. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడనుంది.
ఈ కేంద్రం చుట్టూ టెక్నాలజీ కంపెనీలు, డిఫెన్స్ యూనిట్లు, స్టార్టప్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో తిరుపతి–చిత్తూరు–శ్రీసిటీ బెల్ట్‌లో ఆర్థిక చలనం పెరిగి, ప్రాంతీయ అభివృద్ధికి బలమైన ఊతం లభించనుంది. యువత “జాబ్ సీకర్స్”గా కాకుండా “జాబ్ క్రియేటర్స్”గా మారే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే రూరల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, నీటి నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ వంటి ప్రజలకు అవసరమైన అంశాలపై పరిశోధనలు జరగడం ద్వారా రాష్ట్ర సమస్యలకు రాష్ట్రంలోనే పరిష్కారాలు లభించే దిశగా అడుగులు పడనున్నాయి.
జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యం..
తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థల కాంబినేషన్‌లో ఏపీ–ఫస్ట్ కేంద్రం ఏర్పాటవుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ కేంద్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని, దాని నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.
యువతకు నైపుణ్యాలు, పరిశోధన అవకాశాలు, స్టార్టప్‌లకు మద్దతు-ఈ మూడు సమన్వయంగా అమలైతే, తిరుపతి నుంచి రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఈ పరిణామాలతో తిరుపతి దశ తిరుగుతోందన్న భావనకు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.
Next Story

