
గ్రూప్ 2 సాధించిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు
వైరల్‌గా మారిన గ్రూప్-2 సక్సెస్ జంట
భార్యా భర్తలిద్దరు గవర్నమెంట్ గజిటెడ్ కొలువులు సాధించి ప్రశంసలు అందుకుంటుననారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ’సక్సెస్ జంట‘ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పోటీ పరీక్షల్లో ఒకరు నెగ్గడమే కష్టమైన ఈ రోజుల్లో.. ఒకే ఇంటి నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పట్టుబట్టి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతపురం జిల్లా గన్నెవారిపాలెంకు చెందిన ఓరుగంటి హేమచంద్ర .. వినత దంపతులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
ఎక్సైజ్ ఎస్‌ఐగా భర్త..సబ్ రిజిస్ట్రార్‌గా భార్య
తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ఫలితాల్లో ఈ జంట అద్భుతాన్ని ఆవిష్కరించింది. భర్త హేమచంద్ర అత్యంత పోటీతో కూడిన ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Excise SI) పోస్టుకు ఎంపిక కాగా, భార్య వినత సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి ఉన్నతమైన ప్రభుత్వ హోదాల్లోకి చేరడం నిజంగా అరుదైన విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఒకే బాట..ఒకే లక్ష్యం
ఈ దంపతుల అద్భుత విజయానికి పునాది వారి మధ్య ఉన్న అచంచలమైన విశ్వాసం.. అద్భుతమైన సమన్వయం. ఒకే బాట.. ఒకే లక్ష్యం అన్నట్లుగా సాగిన వీరి ప్రయాణంలో ఒకరికొకరు నిరంతరం తోడుగా నిలిచారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్ అంటేనే ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని, కానీ వీరు మాత్రం ఆ ఒత్తిడిని పరస్పర సహకారంతో జయించారు. క్లిష్టమైన సబ్జెక్టులను చర్చించుకుంటూ, ఒకరి సందేహాలను మరొకరు తీర్చుకుంటూ సాగించిన మ్యూచువల్ స్టడీ వీరిని విజేతలుగా నిలబెట్టింది. ఇద్దరూ సాప్ట్ వేర్ జాబ్ లు చేసుకుంటూ గ్రప్స్ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. వినతకు గతంలో కోర్టులో ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా దానిని వదులుకున్నారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం వచ్చింది. దానిని కొన్నేళ్ల పాటు చేశారు. అనంతరం గ్రూప్స్ పరీక్షలనే లక్ష్యంగా పెట్టకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడి చదవి ఇద్దరూ కలిసి గెజిటెడ్ హోదా కలిగిన కొలువులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ఉన్న ప్రేమ కేవలం అనురాగానికే పరిమితం కాకుండా, ఒకరినొకరు ఉన్నత శిఖరాలకు చేర్చుకునే సక్సెస్ మంత్రంగా మారి సత్తా చాటింది.
వైరల్ అవుతున్న అభినందనలు
ఈ ’పవర్ కపుల్‘ సక్సెస్ స్టోరీ నెట్టింట షేర్ కావడంతో అభినందనల వెల్లువ కురుస్తోంది. ’కలిసి చదివారు..కలిసి గెలిచారు.. రియల్ లైఫ్ జోడీ అంటే మీరే‘ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా గన్నెవారిపాలెంకు సైతం తమ ఊరి జంట రాష్ట్ర స్థాయిలో పేరు తేవడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story

