యువర్ ఆనర్,  నేను బొత్స ఝాన్సీ..!
x
భార్య ఝాన్సీ లక్ష్మీని అభినందిస్తున్న భర్త బొత్స సత్యనారాయణ

యువర్ ఆనర్, నేను బొత్స ఝాన్సీ..!

బొత్సా ఝాన్సీ W/O బొత్స సత్యనారాయణ.. ఇక అడ్వకేట్ కూడా !


ఆమె వయసు దాదాపు 60, చదువుకు వయసు అడ్డుకాదని నిరూపించారు. ఈ వయసులో ఆమె అడ్వకేట్ (న్యాయవాది)గా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. బాధితుల పక్షాన తన వాదనా పటిమను వినిపించబోతున్నారు. ఆమే బొత్స ఝాన్సీ లక్ష్మీ.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బొత్స కుటుంబానికో ప్రత్యేకత ఉంది. ఉత్తరాంధ్రలో ఆ కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. వైసీపీ నాయకుడు, ప్రస్తుత శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి.
ఆమె అఖిల భారత న్యాయవాద పరీక్ష (AIBE) ఉత్తీర్ణులై, న్యాయవాదిగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని ఆమె నిశ్చితాభిప్రాయం. 60 ఏళ్ల వయసులో ‘లాయర్’గా బొత్స ఝాన్సీ లక్ష్మి కొత్త ప్రస్థానం ఆరంభించబోతున్నారని ఆమె భర్త బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు.

నిరంతర కృషితో చదువుకోవాలే గానీ వయసు అడ్డుకాదని నిరూపించారు మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. 1964లో జన్మించిన ఆమె, 60 ఏళ్ల వయసులో, ఇద్దరు పిల్లల తల్లిగా, మనుమలున్న మహిళ. అయినా కూడా పట్టుదలతో అఖిల భారత న్యాయవాద పరీక్ష (AIBE) పూర్తి చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను భర్త చాటు భార్యను కాదని నిరూపించారు.
కుటుంబ నేపథ్యం...
విశాఖపట్నం జిల్లాకు చెందిన మజ్జి రామారావు (రిటైర్డ్ స్పెషల్ ఎస్పీ), కళావతి దంపతులకు ఝాన్సీ లక్ష్మి జన్మించారు. తండ్రి పోలీస్ అధికారి కావడంతో ఆయన బదిలీల కారణంగా విశాఖపట్నం, విజయవాడ, రంపచోడవరం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. చదువుపై ఉన్న మక్కువతో ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీలో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని వివాహం చేసుకున్న ఆమె, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బొత్స సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు బొత్స సందీప్, కుమార్తె బొత్స అనూష. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వీరి కుటుంబం మొత్తం రాజకీయంగా చురుకుగా ఉంటూ, ఆస్తులు కూడా కలిగి ఉంది. కుమారుడు బొత్స సందీప్ డాక్టర్. వివాహం అయ్యింది.
బొత్సా ఝాన్సీ 2001-2006 మధ్య విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా సేవలందించారు.
2007-2009: బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
2009: విజయనగరం లోక్‌సభ స్థానం నుండి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు.
కొత్త బాధ్యత.. సరికొత్త లక్ష్యం!
చదువుకు ముగింపు ఉండదని నమ్మే ఝాన్సీ లక్ష్మి తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే AIBE పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. దీనితో ఆమె కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ తన సతీమణికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
"నా సతీమణి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి హృదయపూర్వక అభినందనలు. ఆమె విద్యా ప్రస్థానంలో ఈ లీగల్ క్రెడెన్షియల్ మరొక మైలురాయి. నేర్చుకోవాలనే ఆమె తపన అందరికీ స్ఫూర్తిదాయకం" అన్నారు బొత్స సత్యనారాయణ

రాజకీయవేత్తగా, గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించినా, 60 ఏళ్ల వయసులో చట్టంపై పట్టు సాధించి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా ప్రశంసనీయం. నేటి తరం యువతకు, ముఖ్యంగా చదువుకోవాలనే ఆశయం ఉన్న మహిళలకు ఆమె ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు.
Read More
Next Story