
పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహకాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, తమిళనాడులోని పోతోగై మలై వంటి తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా ఎకో–టూరిజం ప్రాజెక్టులు ..
కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పర్యాటక(Tourism) రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో సాంస్కృతిక, పర్యావరణ పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
సాంస్కృతిక పర్యాటకాభివృద్ధి..
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా, 15 పురావస్తు ప్రదేశాలను అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రదేశాలను కేవలం సందర్శన ప్రదేశాలే కాకుండా అనుభవ ఆధారిత కేంద్రాలుగా మార్చేందుకు మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందుకు లోథాల్, సారనాథ్, హస్తినాపూర్ లాంటి ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ చర్యల ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, వారసత్వాన్ని కాపాడటం, స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం.
హై–స్పీడ్ ట్రైన్ కారిడార్లు..
పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఏడు హై–స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. ముంబై–పూణే, పూణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఈ రైలు మార్గాలు ఏర్పాటు కానున్నాయి. ఇవి ప్రధాన నగరాలను అనుసంధానిస్తాయి.
సీప్లేన్ సేవలకు ప్రోత్సాహం..
కనెక్టివిటీని మరింతగా మెరుగుపరచడం కోసం సీప్లేన్ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి ప్రకటించారు. కార్యకలాపాల నిర్వహణకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రాంతీయ విమానయాన అభివృద్ధి కోసం ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వైద్య పర్యాటక కేంద్రాలు..
భారతదేశాన్ని వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక ఆసుపత్రులు, చికిత్సానంతర సంరక్షణ, పునరావాస సేవలు, ఆయుష్ విధానాలను ఒకే చోట అందించే సమగ్ర ఆరోగ్య సముదాయాలుగా ఇవి రూపుదిద్దుకోనున్నాయి. దీనివల్ల విదేశీ రోగులను ఆకర్షించడంతో పాటు వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
సాహస, పర్యావరణ పర్యాటకం..
సాహసయాత్రలు, పర్వత పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తూ హిమాలయ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలగకుండా పర్వత మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, తమిళనాడులోని పోతోగై మలై వంటి తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా ఎకో–టూరిజం ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
మొత్తం మీద ఈ బడ్జెట్ నిర్ణయాల ద్వారా పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

