
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం: ట్రంప్ ప్రకటనపై స్పష్టత లోపం..
అమెరికా అధ్యక్షుడు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించినప్పటికీ, ఒప్పందం పరిధి, టారిఫ్‌లు, కాలపరిమితులపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అమెరికా–భారత్(India-US) మధ్య వాణిజ్య ఒప్పందం(trade deal) కుదిరిందని ట్రంప్ “ట్రూత్ సోషల్” వేదికగా చేసిన ప్రకటన పూర్తి వివరాలు లేని రాజకీయ సంకేతంగా మాత్రమే చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొంటూ, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించి అమెరికా, వెనిజువెలా నుంచి కొనుగోళ్లు పెంచుతుందని తెలిపారు. అలాగే ‘బై అమెరికన్’ విధానానికి భారత్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
దానికి ప్రతిఫలంగా భారత వస్తువులపై ప్రస్తుతం ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తామని ట్రంప్ చెప్పినా, ఈ ప్రకటనలోని ప్రాథమిక అంశాలపై స్పష్టత లేదని GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏ ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి? కాలపరిమితులు ఏమిటి? వ్యవసాయం వంటి సున్నిత రంగాల్లో జీరో టారిఫ్‌లు ఉంటాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవని ఆయన అన్నారు.
టారిఫ్‌ల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ట్రంప్ మొదట రష్యా చమురు కొనుగోళ్లు ఆపితేనే టారిఫ్ తగ్గిస్తామని చెప్పడం సందేహాలకు దారి తీసింది. అనంతరం అమెరికా వర్గాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని స్పష్టత ఇచ్చాయి. ఇదే సమయంలో యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో కుదిరిన ఒప్పందాల్లో అమెరికా ఇప్పటికే 10–20 శాతం టారిఫ్ తగ్గింపులు ఇచ్చిన విషయాన్ని GTRI గుర్తుచేసింది.
అయితే కొన్ని కీలక రంగాల్లో టారిఫ్‌లు యథాతథంగా కొనసాగుతాయని GTRI స్పష్టం చేసింది. స్టీల్, అల్యూమినియం, కాపర్‌పై 50 శాతం సెక్షన్ 232 టారిఫ్‌లు, కొన్ని ఆటో భాగాలపై 25 శాతం పన్నులు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు ఔషధాలు, విమానాలు, యాంత్రిక–ఎలక్ట్రానిక్ భాగాలపై ఇప్పటికే ఉన్న సున్నా టారిఫ్‌లు మారే అవకాశం లేదని తెలిపింది.
భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ వాదనపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం భారత్ అమెరికా నుంచి ఏటా దిగుమతులు 50 బిలియన్ డాలర్లకు కూడా చేరడం లేదని, 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలంటే రెండు దశాబ్దాలకుపైగా సమయం పట్టవచ్చని GTRI అంచనా వేసింది. కాబట్టి ఇది తక్షణ హామీ కంటే దీర్ఘకాల లక్ష్యంగా మాత్రమే కనిపిస్తోందని పేర్కొంది.

